Begin typing your search above and press return to search.

మెగా గుడ్ న్యూస్ చెప్పిన వరుణ్ తేజ్

ఆ వేచి చూచే సమయానికి సెప్టెంబర్ 10న ముగింపు లభించింది. హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో లావణ్య త్రిపాఠి నార్మల్ డెలివరీ ద్వారా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది

By:  M Prashanth   |   10 Sept 2025 4:21 PM IST
మెగా గుడ్ న్యూస్ చెప్పిన వరుణ్ తేజ్
X

మెగా ఫ్యామిలీలో మరో సెలబ్రేషన్ కి హడావుడి మొదలైంది. ఇటీవలే అల్లు కుటుంబంలో విషాదాలు ఎదురైనప్పటికీ, ఇప్పుడు వారసుడి రాకతో మెగా ఫ్యామిలీ మరోసారి ఆనందంలో మునిగిపోయింది. హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి దంపతులు పండంటి బిడ్డకు జన్మనివ్వడం అభిమానులకు సంతోషకరమైన వార్తగా మారింది.

సినీ ఇండస్ట్రీలో ఫ్యామిలీకి చెందిన హీరోలు, హీరోయిన్లు పెళ్లి చేసుకుంటే అది పెద్ద సంబరంగానే మారుతుంది. అలాంటి జంటల్లో వరుణ్ లావణ్య కూడా ఒకరు. ఇద్దరి ప్రేమ మొదలై పెళ్లి వరకు వెళ్లిన ప్రయాణం అభిమానులకు మంచి ఫెయిరీటేల్ లాగా అనిపించింది. మెగా కుటుంబం సమక్షంలో 2023 నవంబర్‌లో వీరి వివాహం జరగగా, అప్పటి నుంచే అభిమానులు వారసుడి కోసం ఎదురుచూస్తున్నారు.

ఆ వేచి చూచే సమయానికి సెప్టెంబర్ 10న ముగింపు లభించింది. హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో లావణ్య త్రిపాఠి నార్మల్ డెలివరీ ద్వారా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. దీంతో వరుణ్ తేజ్ తండ్రి అయ్యాడు అనే వార్తతో సోషల్ మీడియా మొత్తం శుభాకాంక్షల వర్షం కురిపిస్తోంది. అభిమానులు, సినీ వర్గాలు, స్నేహితులు వరుణ్, లావణ్యలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

మెగా కుటుంబంలో వారసుడి రాక ఫ్యాన్స్‌లో పెద్ద పండుగలా మారింది. ఇప్పటికే చరణ్, బన్నీ, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ లాంటి వారసులు ఇండస్ట్రీలో ఉన్నా, వరుణ్ చిన్నారి రావడంతో మరో తరం మొదలైందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారిని చూసే ఆత్రుతలో ఫ్యాన్స్ ఉన్నారు. త్వరలోనే ఫోటోలు బయటకు వస్తే సోషల్ మీడియాలో వైరల్ అవడం ఖాయం అని అంటున్నారు.

ఇక వరుణ్ తేజ్ ప్రస్తుతం హారర్ కామెడీ జానర్‌లో ఒక సినిమాను చేస్తున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ స్టేజ్‌లో ఉంది. లావణ్య త్రిపాఠి కూడా “టన్నెల్” అనే సినిమాలో లీడ్ రోల్‌లో నటించింది. ఈ సినిమా సెప్టెంబర్ 19న థియేటర్లలో విడుదల కానుంది. మొత్తానికి, వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతులకు చిన్నారి పుట్టడంతో మెగా ఫ్యామిలీ సంబరాల్లో మునిగిపోయింది. మరో మెగా వారసుడు రాబోయే రోజుల్లో స్టార్‌గా ఎదగాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు.