వారసుడితో తొలి దివాళీ సెలబ్రేషన్స్ జరుపుకున్న మెగా ఫ్యామిలీ!
ఫ్యామిలీ అంతా ఒకే చోట చేరి ఇలా సంతోషంగా గడపడం చూసి అభిమానుల ఆనందానికి అవధులు లేవని చెప్పవచ్చు.
By: Madhu Reddy | 21 Oct 2025 12:30 PM ISTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీ గా గుర్తింపు తెచ్చుకుంది మెగా ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీలో నిన్న దీపావళి సెలబ్రేషన్స్ అంబరాన్ని ఉంటాయి. అటు చిరంజీవి ఆయన సతీమణి సురేఖ కొణిదెల సినీ నటులైన వెంకటేష్, నాగార్జున, నయనతార కుటుంబాలను ప్రత్యేకంగా ఆహ్వానించి తమ ఇంట దీపావళి ఆతిథ్యం ఇచ్చిన విషయం తెలిసిందే. ఇటు మరొకవైపు మెగా బ్రదర్ గా పేరు సొంతం చేసుకున్న నాగబాబు కూడా తన వారసుడితో కలిసి మొదటి దీపావళి పండుగ సెలబ్రేషన్స్ ను తన ఇంట్లో ఘనంగా జరుపుకున్నారు.
నాగబాబు ఆయన సతీమణి పద్మజ తోపాటు కొడుకు వరుణ్ తేజ్, కోడలు లావణ్య త్రిపాఠి, కూతురు నిహారిక కొణిదెల అందరూ కలిసి తమ ఇంట్లోకి ఈ ఏడాది అడుగుపెట్టిన వారసుడితో తొలి దీపావళి జరుపుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది అంటూ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. తాజాగా వారసుడి రాకతో తమ ఇంట్లో దీపాల వెలుగు ప్రారంభం అయ్యిందని.. అలాంటి వారసుడితో కలిసి తొలి దీపావళి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆ కుటుంబ సభ్యులు తెలియజేశారు. ప్రస్తుతం నాగబాబు , వరుణ్ తేజ్ ఫ్యామిలీకి సంబంధించిన ఈ దీపావళి సెలబ్రేషన్స్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఫ్యామిలీ అంతా ఒకే చోట చేరి ఇలా సంతోషంగా గడపడం చూసి అభిమానుల ఆనందానికి అవధులు లేవని చెప్పవచ్చు. ఇకపోతే మెగా వారసుడిగా, ప్రిన్స్ హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వరుణ్ తేజ్.. ప్రముఖ సినీనటి లావణ్య త్రిపాఠి తో కొంతకాలం పాటు రహస్యంగా ప్రేమాయణం సాగించిన విషయం తెలిసిందే. మధ్యలో సోషల్ మీడియాలో ఈ జంట పై ఎన్నో రూమర్స్ వినిపించినా.. ఎక్కడ కూడా వీరు బయట పెట్టలేదు. కానీ 2023 ద్వితీయార్థంలో నిశ్చితార్థం చేసుకొని అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఆ తర్వాత అదే ఏడాది నవంబర్ 1న ఇటలీలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య డెస్టినేషన్ వివాహం చేసుకున్నారు. ఇకపోతే వీరిద్దరూ తొలిసారి 'మిస్టర్' అనే సినిమాలో నటించారు. ఆ తర్వాత అంతరిక్షం సినిమాతో తమ ప్రేమ బంధం బలపడినట్లు సమాచారం.
గత ఏడాది చివర్లో గర్భం దాల్చిన లావణ్య త్రిపాఠి ఈ ఏడాది సెప్టెంబర్ 9వ తేదీన పండంటి బాబుకు జన్మనిచ్చింది. ఇక 2025 అక్టోబర్ 2న దసరా పండుగ సందర్భంగా తమ కొడుకుకి వాయువ్ తేజ్ అని నామకరణం చేశారు. ప్రస్తుతం కొడుకుతో మధుర క్షణాలను గడుపుతూ ఇటు కెరియర్ లో కూడా బిజీగా మారిపోయింది ఈ జంట.
వరుణ్ తేజ్ సినిమాల విషయానికి వస్తే.. చివరిగా మట్కా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వరుణ్ తేజ్.. ఈ సినిమాతో డిజాస్టర్ ను చవిచూశారు. ఇప్పుడు తొలిసారి మేర్లపాక గాంధీ దర్శకత్వంలో హారర్ కామెడీ జానర్లో ఒక సినిమా చేస్తున్నారు. అలాగే దర్శకుడు విక్రమ్ సిరికొండతో కూడా ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ చేస్తున్నట్లు సమాచారం.
లావణ్య త్రిపాఠి సినిమాల విషయానికి వస్తే.. తల్లి అయిన తర్వాత ఇటీవల విడుదలైన చిత్రం థానల్. అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన ఈ తమిళ్ క్రైమ్ సస్పెన్స్ సర్వైవల్ థ్రిల్లర్ ఇది. ఈ చిత్రం తెలుగు, తమిళ్, హిందీ భాషలలో ఏకకాలంలో విడుదలైంది. ఇప్పుడు ఈమె సతీ లీలావతి చిత్రంతో పాటు సొరంగం అనే చిత్రంలో కూడా నటిస్తోంది.
