Begin typing your search above and press return to search.

ఆ తప్పులు మళ్ళీ జరగకుండా.. వరుణ్ తేజ్ జాగ్రత్తలు..

చిన్న సినిమా అయినా, పెద్ద స్కేల్ లో తీసిన పాన్ ఇండియా మూవీ అయినా సరే పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కనీసం మూడు నుంచి నాలుగు నెలల సమయం కచ్చితంగా ఉండాలని ఆయన బలంగా అభిప్రాయపడ్డారు.

By:  M Prashanth   |   6 Aug 2026 9:46 AM IST
ఆ తప్పులు మళ్ళీ జరగకుండా.. వరుణ్ తేజ్ జాగ్రత్తలు..
X

కొరియన్ కనకరాజు సినిమాతో ఈసారి వరుణ్ తేజ్ పక్కగా హిట్ కొట్టాలని ప్రిపేర్ అవుతున్నాడు. అయితే గతంలో తన సినిమాల రిజల్ట్స్ పై ఓపెన్ గా మాట్లాడిన వరుణ్, ముఖ్యంగా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల విషయంలో తాను చేసిన కొన్ని తప్పులను ఎలాంటి దాపరికాలు లేకుండా నిజాయితీగా ఒప్పుకున్నారు. ఒక హీరోగా తన బాధ్యత ఎక్కడుందో ఆయన తన మాటల ద్వారా వివరించారు.

కొన్ని సినిమాల విషయంలో షూటింగ్ హడావిడిలో పడిపోయి, సరైన తీరిక లేకపోవడం వల్ల పోస్ట్ ప్రొడక్షన్ పనులను తాను దగ్గరుండి చూసుకోలేకపోయానని, అది తాను చేసిన అతిపెద్ద తప్పు అని వరుణ్ తేజ్ అన్నారు. షూటింగ్ పూర్తయిన తర్వాత కూర్చుని క్వాలిటీ చెక్ చేసుకోకపోవడం వల్లే ఫైనల్ అవుట్ పుట్ దెబ్బతిందని ఫీల్ అయ్యారు. ఆ తప్పిదాలు చివరకు సినిమా ఫలితం మీద తీవ్ర స్థాయిలోనే ప్రభావం చూపించాయని ఆయన కుండబద్దలు కొట్టారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓటీటీల రాకతో రిలీజ్ డేట్స్ పై మేకర్స్ కు ఒత్తిడి పెరిగిపోయిందని చెప్పుకొచ్చారు. తన కెరీర్ లోని ఒక సినిమాకు సంబంధించి ముందుగానే ఓటీటీ వాళ్లతో రిలీజ్ డేట్ ఫిక్స్ అవ్వడంతో, లాస్ట్ డే షూటింగ్ నుంచి సినిమా థియేటర్లలో రిలీజ్ అవ్వడానికి కేవలం 35 రోజుల గ్యాప్ మాత్రమే దొరికిందని వరుణ్ ఒక ఉదాహరణ చెప్పారు. ఆ రష్ వల్ల ఫైనల్ ప్రోడక్ట్ ను సరిగ్గా చెక్ చేసుకునే ఛాన్స్ కూడా మేకర్స్ కు లేకుండా పోయిందని తెలిపారు.

చిన్న సినిమా అయినా, పెద్ద స్కేల్ లో తీసిన పాన్ ఇండియా మూవీ అయినా సరే పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కనీసం మూడు నుంచి నాలుగు నెలల సమయం కచ్చితంగా ఉండాలని ఆయన బలంగా అభిప్రాయపడ్డారు. అప్పుడే ఎడిటింగ్, డబ్బింగ్, మ్యూజిక్ మిక్సింగ్ లాంటి పనులన్నీ కరెక్ట్ గా సింక్ అవుతాయని వివరించారు. లేకపోతే ఆ హడావిడిలో తాను చెప్పిన డబ్బింగ్ కు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు ఏమాత్రం సంబంధం లేకుండా పోయే ప్రమాదం ఉందని, ఆ తప్పులు మళ్లీ జరగకూడదని ఆయన డిసైడ్ అయ్యారు.

సరిగ్గా ఇదే పాయింట్ ను నాగార్జున గారు కూడా గతంలో ఒకసారి చెప్పారని, సినిమాలకు కచ్చితంగా సరైన సమయం తీసుకుని బెస్ట్ అవుట్ పుట్ ఇవ్వడమే ఒక కరెక్ట్ పద్ధతి అని వరుణ్ తేజ్ అంగీకరించారు. అయితే ఈ మార్పు కేవలం ఒకరు ఇద్దరు హీరోలు లేదా ప్రొడ్యూసర్లు అనుకుంటే రాదని ఆయన అన్నారు. ఇండస్ట్రీలో అందరూ కలిసి ఒకే మాట మీద ఉంటేనే ఈ లాస్ట్ మినిట్ రష్ ను అడ్డుకోగలమని క్లారిటీ ఇచ్చారు.

గత సినిమాల ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకున్న ఈ పాఠాలతో ఇప్పుడు 'కొరియన్ కనకరాజు' సినిమా విషయంలో వరుణ్ తేజ్ అన్ని జాగ్రత్తలు తీసుకున్నారట. ఎలాంటి హడావిడి లేకుండా పోస్ట్ ప్రొడక్షన్ కు తగినంత సమయం ఇచ్చి ఈ చిత్రాన్ని చాలా కూల్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. మరి ఈసారి వరుణ్ ఎలాంటి సక్సెస్ ను అందుకుంటాడో చూడాలి.