Begin typing your search above and press return to search.

మళ్లీ కలిసి నటించాలనుకున్నారు.. మధ్యలోనే బయటకు!

ఈ నిర్ణయం తేలికగా తీసుకున్నది కాదని, ఇప్పటి పరిస్థితుల్లో తమకు ఇదే సరైన నిర్ణయంగా అనిపించిందని కూడా నోట్‌లో పేర్కొన్నారు.

By:  M Prashanth   |   18 Sept 2026 6:30 PM IST
మళ్లీ కలిసి నటించాలనుకున్నారు.. మధ్యలోనే బయటకు!
X

వరుణ్ సందేశ్, వితికా షేరు కలిసి మళ్లీ సినిమాలో నటిస్తున్నట్లు ఆమధ్య స్పెషల్ అప్డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే. దాదాపు 11 ఏళ్ల తర్వాత భార్యాభర్తలు ఒకే సినిమాలో కనిపించబోతుండటంతో అప్పట్లో మంచి బజ్ వచ్చింది. వితికా ఆస్ట్రోనాట్ కావాలని కలలు కనే యువతిగా కనిపిస్తారని, వరుణ్ కూడా కీలక పాత్రలో ఉంటారని టీమ్ చెప్పింది. ‘డియర్ ఆస్ట్రోనాట్’ అనే టైటిల్ కూడా ఫిక్స్ అయ్యింది.

వరుణ్ సందేశ్, వితికా షేరు 2015లో వచ్చిన ‘పడ్డానండి ప్రేమలో మరి’ సినిమాలో కలిసి నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరి పరిచయం ప్రేమగా మారి, తర్వాత పెళ్లి చేసుకున్నారు. అయితే డియర్ ఆస్ట్రోనాట్ ఫస్ట్ లుక్, గ్లింప్స్‌తో వచ్చిన తర్వాత ఇప్పుడు ఇద్దరూ ఒక్కసారిగా ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. తమకు ఇక ‘డియర్ ఆస్ట్రోనాట్’ సినిమా, ఆ టీమ్ లేదా భవిష్యత్తులో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఏ పనితోనూ సంబంధం లేదని వరుణ్, వితికా కలిసి క్లారిటీ ఇచ్చారు. కొన్ని పరిస్థితులు, పరిష్కారం కాని విభేదాల వల్ల తప్పుకోవాల్సి వచ్చిందని చెప్పారు.

ఈ నిర్ణయం తేలికగా తీసుకున్నది కాదని, ఇప్పటి పరిస్థితుల్లో తమకు ఇదే సరైన నిర్ణయంగా అనిపించిందని కూడా నోట్‌లో పేర్కొన్నారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే కొన్ని నెలల క్రితమే ప్రాజెక్ట్‌కు దూరమైనట్లు వాళ్లు చెప్పారు. కానీ బయట మాత్రం ఇప్పటికీ వారి పేర్లు ‘డియర్ ఆస్ట్రోనాట్’తో కలిపి వినిపిస్తుండటంతో ఇప్పుడు ఈ ప్రకటన చేయాల్సి వచ్చిందని తెలిపారు. అసలు విభేదాలు ఎక్కడ మొదలయ్యాయి, నిర్మాతలతోనా లేక క్రియేటివ్ విషయాల్లోనా అనే వివరాలు మాత్రం బయటకు చెప్పలేదు.

‘డియర్ ఆస్ట్రోనాట్’ మొదట ప్రకటించినప్పుడు వితికా పాత్రనే కథలో ప్రధానంగా చూపించారు. చిన్నప్పటి నుంచి అంతరిక్షంలోకి వెళ్లాలని కలలు కనే అమ్మాయి ప్రయాణంగా సినిమాను పరిచయం చేశారు. వరుణ్, వితికా ఇద్దరూ కలిసి స్క్రీన్‌పై కనిపించడంతో ఈ ప్రాజెక్ట్‌కు బజ్ క్రియేట్ చేసింది. అందుకే ఇప్పుడు ఇద్దరూ బయటకు రావడంతో సినిమా అదే కథతో కొనసాగుతుందా అనే డౌట్ వస్తోంది.

వితికా స్థానంలో మరో హీరోయిన్‌ను తీసుకుంటారా, వరుణ్ పాత్రను కూడా మార్చేస్తారా, లేక కథనే మళ్లీ రాసుకుంటారా అన్నది ఇప్పుడు టీమ్ చెప్పాల్సి ఉంది. ఇప్పటికే షూటింగ్ ఎంతవరకు జరిగింది, పూర్తయిన ఫుటేజ్‌ను ఉపయోగిస్తారా అనే వివరాలు కూడా బయటకు రాలేదు. ఇద్దరూ కొన్ని నెలలుగా ప్రాజెక్ట్‌లో లేరని చెప్పడంతో సినిమా ఇప్పటివరకు ఏ దశలో ఉందన్నదానిపైనే ఎక్కువ సందేహాలు ఉన్నాయి. టీజర్ వరకు వచ్చిన ప్రాజెక్ట్ కావడంతో కొత్త నటీనటులతో మళ్లీ మొదలుపెడితే ఇప్పటికే చేసిన పనిలో కూడా మార్పులు చేయాల్సి ఉంటుంది.

వరుణ్, వితికా మాత్రం ఈ వివాదాన్ని ఇక్కడితో ఆపాలని నిర్ణయించుకున్నట్లు తమ నోట్‌లో చెప్పారు. ఏం జరిగిందో పబ్లిక్‌గా చర్చించబోమని, నెగెటివిటీకి వెళ్లాలని లేదని స్పష్టం చేశారు. ఈ అనుభవం నుంచి నేర్చుకున్న విషయాలతో కొత్త ప్రాజెక్టుల వైపు వెళ్తామని చెప్పారు. ఇప్పుడు ‘డియర్ ఆస్ట్రోనాట్’ మేకర్స్ ఎలాంటి అప్డేట్ ఇస్తారో చూడాలి.