Begin typing your search above and press return to search.

శ్వేతాబ‌సు (X) వ‌రుణ్ సందేశ్: 18 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ క‌లుసుకున్నారు!

తెలుగు యువతను ఎంతగానో అలరించిన `కొత్త బంగారు లోకం` చిత్రం వచ్చి దాదాపు 18 ఏళ్ళు గడిచాయి.

By:  Sivaji Kontham   |   23 Oct 2026 9:00 AM IST
శ్వేతాబ‌సు (X) వ‌రుణ్ సందేశ్: 18 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ క‌లుసుకున్నారు!
X

తెలుగు యువతను ఎంతగానో అలరించిన `కొత్త బంగారు లోకం` చిత్రం వచ్చి దాదాపు 18 ఏళ్ళు గడిచాయి. వ‌రుణ్ సందేశ్ హ్యాపీడేస్ చిత్రంతో వెండితెర‌కు పరిచ‌యం అయితే.. శ్వేతాబసు ప్రసాద్ కొత్త బంగారు లోకం చిత్రంతో టాలీవుడ్ కి ప‌రిచ‌య‌మైంది. ఆ ఇద్ద‌రి ఆరంగేట్రాలు సంచ‌ల‌న విజ‌య‌మే. అయితే `కొత్త బంగారు లోకం` సినిమా తర్వాత ఇద్దరూ ఎవరి దారి వారు చూసుకోవడంతో.. మళ్లీ ఇన్నాళ్లకు ఒక సినిమా(నా వైఫ్ మిస్సింగ్) కారణంగానే వీరిద్దరూ మ‌రోసారి ఒకే వేదికపై కలుసుకోగ‌లిగారు. నాటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఇద్దరూ కలిసి తాజాగా ఓ ప్రాజెక్ట్ చేసారు.

అప్పట్లో టీనేజ్ వయసులో `కొత్త బంగారు లోకం` షూటింగ్ జరుగుతున్నప్పుడు తామిద్దరం తరచూ చిన్న చిన్న విషయాలకే గొడవపడేవాళ్లమని.. అప్పట్లో ఒకరినొకరం పెద్దగా ఇష్టపడేవాళ్లం కాదని శ్వేతాబసు సరదాగా గుర్తుచేసుకున్నారు. కానీ ఇన్నాళ్ల తర్వాత.. 30 ఏళ్ల వయసులో ఈ ప్రాజెక్ట్ కోసం మళ్లీ కలుసుకున్నప్పుడు ఇద్దరం ఏకంగా ఐదు గంటల పాటు కూర్చుని పాత విషయాలన్నీ మాట్లాడుకున్నామని.. ఇప్పుడు తాము మంచి స్నేహితులమయ్యామని శ్వేతాబ‌సు తెలిపారు.

కాలంతో పాటు కెరీర్ పరంగా ఎన్నో ఒడిదుడుకులను, వివాదాలను ఎదుర్కొని నిలబడిన శ్వేతాబసు నటిగా తన పోరాటాన్ని విజయవంతంగా సాగిస్తున్నారు. గతంలో ఎదురైన చేదు అనుభవాలను అభిమానులు ఎప్పుడో మరచిపోయి, త‌న‌ రీఎంట్రీని ఎంతో మనసారా స్వాగతిస్తున్నారు. మరోవైపు వరుణ్ సందేశ్ కూడా ఎన్నో ప‌రాజ‌యాల్ని ఎదుర్కొని.. ఇబ్బందులను అధిగమిస్తూ ఇటు సినిమాల్లో, అటు ఓటీటీ ప్రాజెక్టులలో తన ప్రయాణాన్ని బిజీ బిజీగా కొనసాగిస్తూనే ఉన్నారు.

ఇక శ్వేతాబసు ప్రసాద్ విషయానికొస్తే.. నటనతో పాటు అప్పట్లో రచనా రంగంలోనూ తన ప్రతిభను చాటుకున్నారు. అంతేకాకుండా హిందీలో పలు ప్రముఖ వెబ్ సిరీస్‌లు, టెలివిజన్ షోలలో నటిస్తూ ఎప్పుడూ బిజీగా ఉన్నారు. తాజాగా ఓటీటీ వేదికగా రూపొందుతున్న #నా వైఫ్ మిస్సింగ్ చిత్రంతో ఆమె మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు. ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు నేడు కుటుంబాలకు చక్కటి వినోదాన్ని అందిస్తున్నాయని.. ఈ మాధ్యమం ద్వారా తెలుగులో రీ-ఎంట్రీ ఇవ్వడం తనకు ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

ఈ చిత్ర ప్రెస్ మీట్‌లో పాల్గొన్న శ్వేతాబసు మాట్లాడుతూ.. ఇదొక చక్కని కుటుంబ కథా చిత్రమని.. అందరూ కలిసి హాయిగా నవ్వుకునే అన్ని అంశాలు ఇందులో ఉన్నాయని తెలిపారు. ఈ సినిమా దర్శకురాలు స్వాతి ఎంతో ఆత్మవిశ్వాసంతో.. ఒక క్రూ మెంబర్ లాగా కష్టపడి పనిచేసే ట్యాస్క్‌మాస్టర్ అని కొనియాడారు. తెలుగులో తనకు ఇంతకంటే అద్భుతమైన కంబ్యాక్ లభించదని... ఈ ప్రాజెక్ట్ ద్వారా మరోసారి ప్రేక్షకులను అలరించడానికి తాను ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు శ్వేతాబ‌సు వెల్లడించారు.

`నా వైఫ్ మిస్సింగ్’` చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ `లైట్ హౌస్ సినీ మ్యాజిక్` బ్యానర్‌పై శివ కంఠంనేని నిర్మాతగా వ్యవహరించి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇక ఈ సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశానికి స్వాతిప్రకాష్ మంత్రిప్రగడ దర్శకత్వం వహించారు. ఒక వైపు కుటుంబ భావోద్వేగాలు, మరోవైపు గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేషన్ ఎలిమెంట్స్‌తో సాగే ఈ కథను దర్శకురాలు చాలా స్పష్టతతో, ఆసక్తికరమైన మలుపులతో తెరకెక్కించారు. నిర్మాణ విలువలతో పాటు బలమైన టెక్నికల్ వాల్యూస్‌ను జోడిస్తూ ఈ ప్రాజెక్ట్‌ను త్వ‌ర‌లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.