Begin typing your search above and press return to search.

ప్రేమించినా అక్క‌డ సినిమా సీన్లు ఏవీ లేవ‌నేసిన జోడీ!

వెండితెరపై కనిపించే ప్రేమకథలు.. హీరో హీరోయిన్లకు చేసే ప్రపోజల్స్ ఎంతో విలాసవంతంగా, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో అద్భుతంగా సాగిపోతుంటాయి.

By:  Srikanth Kontham   |   9 Jun 2026 8:15 AM IST
ప్రేమించినా అక్క‌డ సినిమా సీన్లు ఏవీ లేవ‌నేసిన జోడీ!
X

వెండితెరపై కనిపించే ప్రేమకథలు.. హీరో హీరోయిన్లకు చేసే ప్రపోజల్స్ ఎంతో విలాసవంతంగా, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో అద్భుతంగా సాగిపోతుంటాయి. కానీ నిజ జీవితంలో మాత్రం పరిస్థితులు అంత సినిమాటిక్‌గా ఉండవని బాలీవుడ్ యువ హీరో వరుణ్ ధావన్ రుజువు చేశారు. తన చిన్ననాటి స్నేహితురాలు, భార్య నటాషా దలాల్‌కు తాను లవ్ ప్రపోజ్ చేసినప్పటి తమాషా విశేషాలను ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. సినిమాల్లో చూపించే గ్రాండ్ ప్రపోజల్స్‌కు, రియల్ లైఫ్‌లో తాను చేసిన దానికి అస్సలు పొంతన లేదని న‌వ్వేసారు.

చాలామంది సెలబ్రిటీలు తమ భాగస్వాములకు విదేశాల్లోనో లేదా భారీ ఏర్పాట్ల మధ్యనో ప్రపోజ్ చేస్తుంటారు. కానీ వరుణ్ ధావన్ విషయంలో చాలా సాధారణంగా.. కాస్త గందరగోళంగా సాగింది. తాను నటాషాకు ప్రేమను వ్యక్తపరిచిన సమయంలో ఎలాంటి ముందస్తు ప్రణాళికలు లేవన్నారు. ఏదో ఒక ప్రత్యేకమైన సందర్భాన్ని సృష్టించి, మోకాళ్లపై నిలబడి ఉంగరం తొడగడం లాంటి ఫిల్మీ వాతావరణం అక్కడ అస్సలు జరగలేదన్నారు. అంతా చాలా క్యాజువల్‌గా జరిగిపోయిందని గుర్తుచేసుకున్నారు.

వరుణ్- నటాషా ఇద్దరూ స్కూల్ రోజుల నుండే ఒకరికొకరు తెలుసు. చాలా ఏళ్ల పాటు మంచి స్నేహితులుగా కొన‌సాగారు. ఆ స్నేహ‌మే కాలక్రమేణా ప్రేమగా మారింది. ఆ ప్రయాణంలో ఒకరోజు తన మనసులోని మాటను నటాషాకు చెప్పాలని వరుణ్ నిర్ణయించుకున్నారు. అయితే ఆ క్షణం ఎంతో సరదాగా ఊహించని విధంగా సాగిందన్నారు. `మనం సినిమాల్లో చూసేటప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో వయలిన్ వాయించడం, పూల వర్షం కురవడం లాంటివి చూస్తాం. కానీ నిజ జీవితంలో అలా ఏమీ అవ్వదు. నా ప్రపోజల్ కూడా చాలా వింతగా, నవ్వు తెప్పించేలా సాగింది` అని వరుణ్ చెప్పుకొచ్చారు.

వరుణ్ ధావన్ ప్రేమను చెప్పేట‌ప్పుడు నటాషా దలాల్ స్పందన కూడా అంతే సహజంగా ఉందిట‌. ఒక స్టార్ హీరోగా ప్రపంచమంతా తన వైపు చూస్తున్నప్పటికీ నటాషా ముందు మాత్రం తానొక సాధారణ వ్యక్తిగానే ఉన్నానని వరుణ్ పేర్కొన్నారు. తమ మధ్య ఉన్న సుదీర్ఘమైన పరిచయం వల్ల ఎలాంటి ఆడంబరాలు లేకుండానే ఆమె తన ప్రేమను అంగీకరించిందని తెలిపారు. రంగుల ప్రపంచంలో ఉన్నప్పటికీ నటాషా తనను ఒక సాధారణ మనిషిగా ప్రేమించిందని.. అదే తమ బంధాన్ని ఇంత దూరం తీసుకొచ్చింద‌ని సంతోషం వ్యక్తం చేశారు.

ఇద్దరి వివాహం 2021లో అలీబాగ్‌లో అత్యంత సన్నిహితులు - కుటుంబ సభ్యుల సమక్షంలో కోవిడ్ నిబంధనల నడుమ ప్రశాంతంగా జరిగింది. బాలీవుడ్ ఆడంబరాలకు దూరంగా పరిమిత సంఖ్యలో అతిథులను మాత్రమే పిలిచి పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో వీరి వివాహ వేడుక చిత్రాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. పెళ్లయిన ఇన్నేళ్ల తర్వాత కూడా ఇద్ద‌రు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ క్యూట్ కపుల్‌గా కొనసాగుతున్నారు.