Begin typing your search above and press return to search.

పూజా, మృణాల్ మూవీ ఎలా ఉంది? టాక్ ఏంటి?

స్టార్ హీరోయిన్స్ పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్, బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ లీడ్ రోల్స్ లో నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ హై జవానీ తో ఇష్క్ హోనా హై థియేటర్స్ లో సందడి చేస్తోంది.

By:  M Prashanth   |   6 Jun 2026 12:34 AM IST
పూజా, మృణాల్ మూవీ ఎలా ఉంది? టాక్ ఏంటి?
X

స్టార్ హీరోయిన్స్ పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్, బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ లీడ్ రోల్స్ లో నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ హై జవానీ తో ఇష్క్ హోనా హై థియేటర్స్ లో సందడి చేస్తోంది. సీనియర్ దర్శకుడు డేవిడ్ ధావన్ తెరకెక్కించిన ఆ చిత్రంపై విడుదలకు ముందే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు రిలీజ్ అయ్యాక ప్రేక్షకులు సోషల్ మీడియాలో రివ్యూస్ ఇస్తున్నారు. మరి సినిమా టాక్ ఎలా ఉందంటే?

డేవిడ్ ధావన్ తన స్పెషల్ కామెడీ యాంగిల్ ను మరోసారి సినిమాలో చూపించే ప్రయత్నం చేసినట్లు ప్రేక్షకులు చెబుతున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్, గందరగోళ పరిస్థితి నుంచి పుట్టే కామెడీ చిత్రానికి మెయిన్ అసెట్ గా నిలిచిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కథలో కొత్తదనం పెద్దగా లేకపోయినా, కామెడీ ట్రాక్, లీడ్ రోల్స్ మధ్య సీన్స్ ప్రేక్షకులను అలరిస్తున్నాయని పలువురు పేర్కొంటున్నారు.

సినిమా కథ జస్వీందర్ అలియాస్ జాస్ అనే పెళ్లిళ్ల ఫొటోగ్రాఫర్ చుట్టూ తిరుగుతుంది. అతడు ప్రేమించి పెళ్లి చేసుకున్న బాణీతో కొన్ని కారణాల వల్ల దూరమవుతాడు. అనంతరం లండన్‌ లో ప్రీత్ అనే యువతితో ప్రేమలో పడతాడు. అయితే ఒకే సమయంలో తన మాజీ భార్య, ప్రేయసి ఇద్దరూ ప్రెగ్నెంట్స్ అని చెప్పడంతో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఆ పరిస్థితుల నుంచి పుట్టే గందరగోళమే మెయిన్ స్టోరీ లైన్.

క్యాస్టింగ్ విషయానికి వస్తే.. వరుణ్ ధావన్ మరోసారి తన ఎనర్జిటిక్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నారని సినీ ప్రియులు చెబుతున్నారు. కామెడీ, ఎమోషన్స్ తో కూడిన రోల్ లో ఆయన తనదైన శైలిలో మెప్పించినట్లు అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరోవైపు మృణాల్ ఠాకూర్, పూజా హెగ్డే ఇద్దరికీ కథలో తగిన ఇంపార్టెన్స్ లభించిందని, పాత్రలకు న్యాయం చేశారని రివ్యూలు వస్తున్నాయి. ముఖ్యంగా మృణాల్ నటనపై సోషల్ మీడియాలో ప్రశంసలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

మనీష్ పాల్, చుంకీ పాండే, జిమ్మీ షెర్గిల్ కూడా తమ కామెడీ టైమింగ్‌ తో నవ్వులు పంచినట్లు ప్రేక్షకులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే కన్ఫ్యూజన్ కామెడీ సీన్స్, పాత హిట్ పాట చునరి చునరి రీమిక్స్ వెర్షన్ ప్రేక్షకులను అలరించాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే సినిమాపై కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. కథ చాలా వరకు ముందే ఊహించగలిగేలా సాగుతుందని, కొన్ని కామెడీ సన్నివేశాలు పాత తరహాలో అనిపిస్తున్నాయని కొందరు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

తొలి భాగంలోని కొన్ని ఎపిసోడ్లు నెమ్మదిగా సాగడం, క్లైమాక్స్ మరింత స్ట్రాంగ్ గా ఉండాల్సిందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. డేవిడ్ ధావన్ పాత కామెడీ చిత్రాలు ఇష్టపడే ప్రేక్షకులకు సినిమా బాగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉందని సినీ ప్రియులు భావిస్తున్నారు. ఏదేమైనా హై జవానీ తో ఇష్క్ హోనా హై మూవీ ఇప్పుడు మిక్స్‌ డ్ టాక్‌ తో రన్ అవుతోంది. వరుణ్ ధావన్ యాక్టింగ్, పూజా- మృణాల్ స్క్రీన్ ప్రెజెన్స్, కామెడీ ట్రాక్‌ సినిమాకు మెయిన్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. అయితే కథలో కొత్తదనం ఆశించే ప్రేక్షకులకు ఇది నార్మల్ కమర్షియల్ ఎంటర్టైనర్‌లా అనిపించే అవకాశం ఉంది.