Begin typing your search above and press return to search.

కరణ్ జోహార్ సీక్రెట్స్ లీక్ చేసిన వరుణ్, జాన్వీ!

బాలీవుడ్ ద‌ర్శ‌క‌, నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న పాపులర్ సెలెబ్రిటీ టాక్ షో `కాఫీ విత్ కరణ్` తాజా ఎపిసోడ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది.

By:  Srikanth Kontham   |   25 Oct 2026 5:00 PM IST
కరణ్ జోహార్ సీక్రెట్స్ లీక్ చేసిన వరుణ్, జాన్వీ!
X

బాలీవుడ్ ద‌ర్శ‌క‌, నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న పాపులర్ సెలెబ్రిటీ టాక్ షో `కాఫీ విత్ కరణ్` తాజా ఎపిసోడ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. సినిమా ప్రపంచంలోని సంచలనాలు.. సెలెబ్రిటీల వ్యక్తిగత విషయాలు.. హాట్ గాసిప్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే షోలో ఈసారి బాలీవుడ్ యంగ్ స్టార్స్ వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ సందడి చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో విడుదలకాగా క్షణాల్లో వైరల్‌గా మారింది.

తాజా ఎపిసోడ్‌లో వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ కలిసి కరణ్ జోహార్‌పైనే రివర్స్ దాడి చేస్తూ ఆయనకు సంబంధించిన పలు రహస్యాలను, అలవాట్లను బయటపెట్టడం విశేషం. షో ప్రారంభం నుంచే కరణ్ జోహార్‌ను ఆటపట్టిస్తూ ఇద్దరూ చేసిన సందడి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా కరణ్ జోహార్ వ్యక్తిత్వంలోని డ్రామా కోణాన్ని వరుణ్ ధావన్ బయటపెట్టగా.. ఆయనతో ఉన్న పాత జ్ఞాపకాలను జాన్వీ సరదాగా గుర్తుచేసుకుంది.

కార్యక్రమంలో భాగంగా వరుణ్ ధావన్ మాట్లాడుతూ.. కరణ్ జోహార్ చాలా డ్రామా క్రియేట్ చేస్తాడని.. కొన్ని సమయాల్లో `కభీ ఖుషీ కభీ గమ్` చిత్రంలో అమితాబ్ బచ్చన్ ప్రవర్తించినట్లే ప్రవర్తిస్తాడని చమత్కరించారు. వరుణ్ కామెంట్స్‌కు కరణ్ ఆశ్చర్యపోవడం ప్రోమోలో హైలైట్‌గా నిలిచింది. మరోవైపు ఒకానొక సమయంలో కరణ్ జోహార్ తమతో మాట్లాడటం మానేశాడని.. ఆ సమయంలో తాను తీవ్రంగా బాధపడి బరువు కూడా పెరిగిపోయానని జాన్వీ కపూర్ నవ్వులు పూయించింది.

ఎపిసోడ్‌లో మరో ప్రధాన ఆకర్షణగా బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ ప్రత్యక్షమవ్వడం విశేషం. ఈ షోలో అత్యంత ఉత్కంఠగా సాగే రాపిడ్ ఫైర్ రౌండ్ నిర్వహించేందుకు అర్జున్ కపూర్ ప్రత్యేక అతిథిగా ఎంట్రీ ఇచ్చారు. ఈ రౌండ్‌లో వరుణ్, జాన్వీలకు కరణ్ వేసిన ప్రశ్నలు దానికి వారు ఇచ్చిన సమాధానాలు ప్రేక్షకులకు వినోదాన్ని పంచేలా ఉన్నాయి.

షోలో భాగంగా వరుణ్ ధావన్‌ను కరణ్ ఒక ప్రశ్నిస్తూ.. `నీ కెరీర్ .. వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఏ విషయంలోనైనా సలహాల కోసం ఎవరి దగ్గరకు వెళ్తావు?` అని అడుగగా వరుణ్ ఏమాత్రం తడుముకోకుండా వెంటనే పక్కనే ఉన్న అర్జున్ కపూర్ వైపు చూపించారు. కెరీర్ ..వివాహ జీవితం ఈ రెండింటికీ సంబంధించిన సలహాల కోసం తాను అర్జున్ కపూర్‌నే సంప్రదిస్తానని వరుణ్ చెప్పడం ఇద్ద‌రి మధ్య ఉన్న గాఢమైన స్నేహబంధాన్ని స్పష్టం చేసింది.

సామాజిక మాధ్య‌మాల్లో చురుగ్గా ఉండే బాలీవుడ్ ప్రముఖుల గురించి మాట్లాడే క్రమంలో క‌పూర్ బ్యూటీ చెప్పిన సమాధానం అందర్నీ ఆశ్చర్యపరిచింది. భోజుపురీ నటుడు రవి కిషన్ సోషల్ మీడియా స్టైల్‌ను ఇమిటేట్ చేసి నవ్వులు పూయించింది. అంతిమంగా వరుణ్ ధావన్, జాన్వీ కపూర్, అర్జున్ కపూర్‌ల కాంబినేష‌న్ లో వ‌స్తున్న‌ `కాఫీ విత్ కరణ్` కొత్త ఎపిసోడ్ పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుంద‌ని తాజా ప్రోమో నిరూపిస్తోంది.