ఆఖరి దశకు చేరిన వారణాసి షూటింగ్. వైరలవుతున్న రాజమౌళి కామెంట్స్!
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రతి సినిమాతో భారతీయ సినీ పరిశ్రమలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతూ వస్తున్నారు.
By: Sravani Lakshmi Srungarapu | 26 Jun 2026 3:52 PM ISTదర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రతి సినిమాతో భారతీయ సినీ పరిశ్రమలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతూ వస్తున్నారు. బాహుబలి సిరీస్‌తో భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఆయన, ఆర్ఆర్ఆర్‌తో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు ఆయన తర్వాతి సినిమా వారణాసిపై బయటకు వస్తున్న తాజా వివరాలు సినిమాపై మరిన్ని అంచనాలను పెంచుతున్నాయి.
ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ దశ చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా అంతర్జాతీయ మీడియాతో మాట్లాడిన రాజమౌళి, షూటింగ్‌కు సంబంధించిన కీలక అప్‌డేట్‌ను షేర్ చేసుకున్నారు. ఇప్పటికే సినిమాలోని భారీ యాక్షన్ ఎపిసోడ్‌లు, అత్యంత ప్రతిష్ఠాత్మక విజువల్ సీన్స్ షూటింగ్ పూర్తైందని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం కథను ముందుకు నడిపే ముఖ్యమైన డ్రామా, కనెక్టింగ్ సీన్స్‌పై చిత్రబృందం దృష్టి పెట్టిందని చెప్పారు. అన్నీ అనుకున్నట్లే సాగితే సెప్టెంబర్ చివరి నాటికి లేదా అక్టోబర్ స్టార్టింగ్ లో షూటింగ్‌కు పూర్తిగా గుమ్మడికాయ కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వారణాసి కథ కూడా రాజమౌళి సినిమాలకు తగ్గట్టుగానే అత్యంత విభిన్నమైన కాన్సెప్ట్‌తో రూపొందుతున్నట్లు సమాచారం. వేల సంవత్సరాల చరిత్రతో కథనం, ప్రపంచంలోని అత్యంత క్లిష్టమైన ప్రాంతాల్లో ఒకటైన అంటార్కిటికా వరకు విస్తరించే నేపథ్యం, భూమికి ముప్పుగా మారే గ్రహశకలం వంటి అంశాలు ఈ సినిమాను సాధారణ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా నిలబెట్టనున్నాయి. విజువల్ పరంగా కూడా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో సినిమాలోని కొన్ని కీలక భాగాలను 70ఎంఎం ఐమాక్స్ ఫార్మాట్‌లో షూట్ చేస్తున్నట్టు రాజమౌళి తెలిపారు.
అయితే ఐమాక్స్ వెర్షన్ కోసం కథను మార్చాల్సిన అవసరం రాలేదని రాజమౌళి స్పష్టం చేశారు. ముందుగానే ఊహించిన భారీ విజువల్ సీన్స్ కు ఈ ఫార్మాట్ మరింత న్యాయం చేస్తుందని భావించి ఆ డెసిషన్ తీసుకున్నట్లు చెప్పారు. షూటింగ్ మొదటి రోజుల్లో సినిమాస్కోప్‌తో పాటు ఐమాక్స్ ఫ్రేమింగ్‌కు అనుగుణంగా కెమెరా కంపోజిషన్‌లో కొంత మార్పు అవసరమైనప్పటికీ, తర్వాత ఆ విధానానికి చిత్రబృందం పూర్తిగా అలవాటు పడిందని వివరించారు.
సినిమాలో ఎమోషన్స్, విజువల్ గ్రాండియర్ రెండింటి మధ్య తన దృష్టిలో ఎలాంటి తేడా ఉండదని కూడా రాజమౌళి చెప్పారు. కథలోని భావోద్వేగమే ప్రతి భారీ సన్నివేశానికి మూలమని, ప్రేక్షకులను కదిలించే ఎమోషన్ లేకుండా కేవలం భారీ విజువల్స్‌తో సినిమా నిలబడదనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. అదే తన ప్రతి సినిమాలో అనుసరించే ప్రధాన సూత్రమని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, 2027లో హైదరాబాద్‌లో మళ్లీ ఐమాక్స్ థియేటర్ అందుబాటులోకి రావడంపై కూడా రాజమౌళి ఆనందం వ్యక్తం చేశారు. తెలుగు ప్రేక్షకులు ప్రపంచంలోనే అత్యంత సినీ అభిమానులని, భాషతో సంబంధం లేకుండా మంచి సినిమాలను ఆదరిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు ప్రసాద్ ఐమాక్స్‌లో ఉన్న 70ఎంఎం ప్రొజెక్షన్ అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ, ఆ తరహా ప్రీమియం విజువల్ ఎక్స్‌పీరియెన్స్ మళ్లీ హైదరాబాద్‌కు రావడం సినిమా అభిమానులకు ప్రత్యేకమైన సందర్భంగా నిలుస్తుందని రాజమౌళి పేర్కొన్నారు. ఈ పరిణామం వారణాసి వంటి భారీ విజువల్ సినిమాకు మరింత ప్రత్యేక ఆకర్షణగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
