15 నెలల ముందు రిలీజ్ డేట్.. జక్కన్న అసలు ప్లాన్ అదేనా?
దర్శకధీరుడు రాజమౌళి ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో వారణాసి మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచర్ డ్రామాగా రూపొందుతున్న ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
By: M Prashanth | 31 Jan 2026 4:16 PM ISTదర్శకధీరుడు రాజమౌళి ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో వారణాసి మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచర్ డ్రామాగా రూపొందుతున్న ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే వివిధ షెడ్యూల్స్ ను పూర్తి చేసిన జక్కన్న.. ఇప్పుడు కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతా అనుకున్న విధంగా పూర్తి చేస్తున్నట్లు సమాచారం.
అలా షూటింగ్ తో బిజీగా గడుపుతున్న జక్కన్న.. రీసెంట్ గా మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. ఇటీవల వారణాసిలో ఎలాంటి ప్రచారం లేకుండా కేవలం తేదీతో భారీ హోర్డింగ్స్ ఏర్పాటు చేసి ఆసక్తి రేపి.. ఆ తర్వాత స్పష్టత ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా 2027 ఏప్రిల్ 7న థియేటర్లలోకి రానుందని తెలిపారు. స్పెషల్ పోస్టర్ కూడా విడుదల చేశారు.
పోస్టర్ లో ఆకాశం నుంచి అగ్నిగోళంలా దూసుకొచ్చే గ్రహశకలం భూమిని ఢీకొట్టడం, దాంతో సంభవించే అపోకలిప్టిక్ ఎక్స్ప్లోషన్ ను చూపించిన మేకర్స్.. సినిమాపై అంచనాలు పెంచారు. అయితే ఏప్రిల్ 7న ఉగాది, గుడిపడ్వా పండుగలు, ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి, 15న శ్రీరామ నవమి, అదే సమయంలో తమిళ సంవత్సరాది కూడా ఉండటంతో లాంగ్ వీకెండ్ ఏర్పడనుంది.
అందుకే ఆ డేట్ ను రాజమౌళి ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అయితే విడుదలకు 15 నెలల ముందు ప్రకటించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాజమౌళి ప్లాన్ ఏంటోనని డిస్కస్ చేసుకుంటున్నారు. అయితే వారణాసి చిత్రాన్ని ప్రీమియం లార్జ్ స్కేల్ ఫార్మాట్ లో చిత్రీకరిస్తున్నారు మేకర్స్. థియేటర్లలో అత్యుత్తమ అనుభూతి ఇవ్వాలనే లక్ష్యంతో IMAX స్క్రీన్లకు అనుగుణంగా రూపొందిస్తున్నారు.
అందుకే విదేశాల్లో ఎక్కువ IMAX స్క్రీన్లు దక్కించుకోవడం టీమ్ కు కీలకం కానుంది. కానీ వారణాసి టైంలోనే పలు హాలీవుడ్ పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. గాడ్జిల్లా x కాంగ్: సూపర్‌నోవాతో పాటు డిస్నీ, యూనివర్సల్ బ్యానర్ల నుంచి భారీ టెంట్‌పోల్ మూవీస్ మార్చి చివరి వారం, ఏప్రిల్ మధ్యలో రానున్నాయి. దీంతో IMAX స్క్రీన్లకు పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉంది.
ఇది వారణాసి ఓవర్సీస్ స్క్రీన్ కౌంట్ పై ప్రభావం చూపొచ్చని అంచనా. అందుకే దాదాపు 15 నెలల ముందుగానే రిలీజ్ డేట్ ప్రకటించి అన్ని మార్కెట్లలో సరైన విడుదలకు మార్గం సుగమం చేసుకున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఎంతైనా రాజమౌళి లెక్కే వేరు కదా.. ఏ విషయంలో అయినా సరైన ప్లాన్ తో ముందుకెళ్తారు. మొత్తానికి వారణాసిపై అంచనాలు రోజురోజుకు పెరుగుతుండగా.. ప్రపంచవ్యాప్తంగా భారీ ఓపెనింగ్స్ ఖాయం అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి బాక్సాఫీస్ వద్ద వారణాసి మూవీ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
