బ్రెజిల్ ప్రచారానికి వారణాసి రెడీ అవుతోందా?
సినిమా షూటింగ్ దశలో ఉన్నప్పుడే అంతర్జాతీయ ఈవెంట్లలో ప్రచారం చేయడం ద్వారా ప్రపంచవ్యాప్త పంపిణీదారుల దృష్టిని ఆకర్షించాలనేది మేకర్స్ ఉద్దేశం కావొచ్చు.
By: Srikanth Kontham | 29 April 2026 10:15 AM ISTసూపర్ స్టార్ మహేష్ -దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం `వారణాసి’ రిలీజ్ కు ముందే అంతర్జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తోంది. భారతీయ సినిమా హద్దులు దాటి గ్లోబల్ ఆడియన్స్‌ను లక్ష్యంగా చేసుకున్న చిత్రం ప్రచార పర్వాన్ని విదేశాల్లో ముమ్మరం చేస్తోంది. ఇటీవలే మెక్సికోలో జరిగిన ప్రఖ్యాత `కామికాన్` ఈవెంట్‌లో సినిమాకు సంబంధించిన ప్రత్యేక గ్లింప్స్ - రాజమౌళి వీడియో సందేశాన్ని ప్రదర్శించగా అద్భుతమైన స్పందన దక్కింది. ఇదే ఊపుతో తాజాగా చిత్ర యూనిట్ బ్రెజిల్‌లో ప్రచారానికి సిద్ధమవుతోందని సమాచారం.
మెక్సికో కామికాన్‌లో రాజమౌళి పంపిన వీడియో సందేశం అంతర్జాతీయ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తెర వెనుక సన్నివేశాలు , సినిమా కోసం వాడుతోన్న అత్యాధునిక సాంకేతికతను చూసి పాశ్చాత్య ప్రేక్షకులు సైతం ఆశ్చర్యపోయారు. ఈ క్రమంలోనే లాటిన్ అమెరికా మార్కెట్‌లో సినిమాపై మరింత హైప్ పెంచేందుకు బ్రెజిల్‌ను తదుపరి వేదికగా ఎంచుకున్నట్లు వినిపిస్తోంది. బ్రెజిల్‌లో భారతీయ సినిమాలకు ముఖ్యంగా రాజమౌళి గత చిత్రం `ఆర్ఆర్ఆర్` క్రేజ్‌ను ప్రామాణికంగా తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ గ్లోబల్ ప్రచార వ్యూహం వెనుక రాజమౌళి పక్కా ప్లానింగ్ ఉంది. సినిమా షూటింగ్ దశలో ఉన్నప్పుడే అంతర్జాతీయ ఈవెంట్లలో ప్రచారం చేయడం ద్వారా ప్రపంచవ్యాప్త పంపిణీదారుల దృష్టిని ఆకర్షించాలనేది మేకర్స్ ఉద్దేశం కావొచ్చు. బ్రెజిల్‌లో జరగబోయే ప్రచార కార్యక్రమంలో మహేష్ కూడా వర్చువల్ గా పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. యాక్షన్ అడ్వెంచర్ చిత్రంగానే కాకుండా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మూవీగా `వారణాసి`ని ప్రెజెంట్ చేసేందుకు చిత్ర బృందం శ్రమిస్తోంది.
బ్రెజిల్ ప్రచారానికి సిద్ధమవుతున్న తరుణంలోనే సోషల్ మీడియాలో ఈ సినిమా చుట్టూ ఉన్న రహస్యం మరింత పెరుగుతోంది. కామికాన్‌లో ప్రదర్శించిన విజువల్స్ బయటకు రాకుండా చిత్ర యూనిట్ ఎంతో జాగ్రత్త పడుతోంది. ఈ రకమైన సైలెంట్ స్ట్రాటజీ ప్రేక్షకుల్లో ఒక రకమైన క్యూరియాసిటీని పెంచుతోంది. రాజమౌళి సినిమాల విషయంలో అనుసరించే గోప్యత మార్కెటింగ్‌లో కూడా బలమైన ఆయుధంగా మారుతోంది. బ్రెజిల్ ఈవెంట్ తర్వాత ఈ సినిమాపై ఉండే అంచనాలు మరో స్థాయికి చేరుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
మహేష్ లుక్ - ఫిజిక్ విషయంలో ఈ సినిమా కోసం అసాధారణమైన మేకోవర్ అయ్యారు. లాంగ్ హెయిర్ - రఫ్ లుక్ ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతోంది. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే అడ్వెంచర్ కథలో మహేష్ పాత్రను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతున్నారు. బ్రెజిల్ వంటి దేశాల్లో ఇలాంటి అడ్వెంచర్ సినిమాలకు మంచి ఆదరణ ఉంటుంది కాబట్టి అక్కడ చేసే ప్రచారం సినిమా బిజినెస్‌కు ఎంతో కీలకం కానుంది. దీంతో రాజమౌళి భారతీయ సినిమాను మరోసారి ప్రపంచ చిత్రపటంపై నిలబెట్టేందుకు సిద్ధమయ్యారన్నది క్లియర్. మెక్సికో నుండి బ్రెజిల్ కే పరిమితం కాకుండా ఇంకా ప్రపంచ దేశాల్లో చాలా పట్టణాలపైనే జక్కన్న అండ్ కో గురి పెడుతుంది. మొత్తంగా ఈ గ్లోబల్ టూర్ ట్రెండ్ సెట్టర్‌గా నిలవడం ఖాయం.
