Begin typing your search above and press return to search.

గ్లోబల్ రిలీజ్‌కు వారణాసి మాస్టర్ ప్లాన్!

మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘వారణాసి’ని 18 విభిన్న థియేట్రికల్ ఫార్మాట్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఐమ్యాక్స్ 1.43:1, డాల్బీ విజన్, 4DX వంటి ఫార్మాట్లలోనూ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 2027 ఏప్రిల్ 7న విడుదల లక్ష్యంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి.

By:  Srikanth Kontham   |   22 Nov 2026 5:09 PM IST
గ్లోబల్ రిలీజ్‌కు వారణాసి మాస్టర్ ప్లాన్!
X

సూపర్ స్టార్ మహేశ్ -రాజ‌మౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న`వారణాసి` పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పాల్సిన ప‌నిలేదు. భారతీయ సినిమా ఖ్యాతిని మరో మెట్టు ఎక్కించేలా చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 18 విభిన్న థియేట్రికల్ ఫార్మాట్లలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. సాధారణ స్క్రీన్లతో పాటు ఐమ్యాక్స్ IMAX 1.43:1.. డాల్బీ విజన్.. 4DX వంటి అత్యుత్తమ సాంకేతిక ఫార్మాట్లలో విజువల్ వండర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని రాజమౌళి బృందం రేయింబ‌వ‌ళ్లు శ్ర‌మిస్తుంది.

ఇండియ‌న్ సినిమా ఇన్ని ఫార్మాట్లలో విడుదల కావడం సినీ చరిత్రలోనే ఇదే తొలిసారి. ముఖ్యంగా ఐమ్యాక్స్ 1.43:1 ఫార్మాట్‌లో చిత్రీకరించిన సన్నివేశాలు వెండితెరపై ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతాయని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. దేశీయ మార్కెట్‌కే పరిమితం కాకుండా అంతర్జాతీయ ప్రేక్షకులను సైతం థియేటర్లకు రప్పించేందుకే ఈ స్థాయి సాంకేతిక వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్.. సౌండ్ డిజైన్ పనులను ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దుతున్నారు.

అయితే 18 ఫార్మాట్లకు అనుగుణంగా అవుట్‌పుట్ సిద్ధం చేయడం పోస్ట్ ప్రొడక్షన్ బృందానికి పెద్ద సవాలుగా మారింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ఉగాది కానుకగా సినిమాను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో మార్చి నెలాఖరులోగా సాంకేతిక పనులన్నీ పూర్తి చేయడానికి యూనిట్ రేయింబవళ్లు శ్రమిస్తోంది. ప్రతి ఫార్మాట్‌లోనూ నాణ్యత ఏమాత్రం తగ్గకుండా ఉండేందుకు రాజమౌళి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. డెడ్‌లైన్ లోపు పనులను కొలిక్కి తెచ్చే పనిలో నిమగ్నమయ్యారు.

కథాంశం పరంగానూ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇందులో మహేశ్ బాబు రుద్ర‌ అనే శక్తివంతమైన పాత్ర పోషిస్తుండ‌గా.. ప్రియాంక చోప్రా మందాకినిగా.. పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభకర్ణగా కీలక పాత్రలు పోషిస్తున్నారు. పురాణాల నేపథ్యం.. టైమ్ ట్రావెల్ అంశాలు.. భారీ యాక్షన్ ఘట్టాలతో కూడిన అడ్వెంచర్ డ్రామా ప్రేక్షకులను మరో లోకంలోకి తీసుకెళ్లడం ఖాయమని అంచ‌నాలున్నాయి.

`వారణాసి` చిత్రాన్ని ప్రపంచ సినిమా వేదికపై సాంకేతిక అద్భుతంగా నిలబెట్టేందుకు జక్కన్న వేస్తున్న అడుగులు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. 120 దేశాల్లో రిలీజ్ అవుతున్న చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.