జక్కన్నతో మహేష్ హిస్టరీ క్రియేట్ చేస్తాడా?
శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కె.ఎల్. నారాయణ అత్యంత భారీ స్థాయిలో ఇండియన్ సినీ హిస్టరీలోనే కనీవిని ఎరుగని విధంగా తెరపైకి తీసుకొస్తున్నారు.
By: Tupaki Entertainment Desk | 17 Dec 2025 1:25 PM ISTసూపర్‌స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న గ్లోబల్ లెవెల్ మూవీ 'వారణాసి'. భూమిపై తొలి నగరంగా పురాణాల్లో ప్రసిద్ధి చెందిన వారణాసి పేరుతో రూపొందుతున్న ఈ గ్లోబ్‌త్రోటర్‌ని జక్కన్న అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరపై ఆవిష్కరిస్తున్నాడు. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కె.ఎల్. నారాయణ అత్యంత భారీ స్థాయిలో ఇండియన్ సినీ హిస్టరీలోనే కనీవిని ఎరుగని విధంగా తెరపైకి తీసుకొస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్, గ్లింప్స్, అందులో చూపించిన విజువల్స్ సినిమాపై అంచనాల్ని పెంచేశాయి.
కాశీ క్షేత్రం, ఆస్ట్రాయిడ్ శాంభవి, రాస్ ఐస్ షెల్ఫ్, ఆఫ్రికా అంబుసలి వైల్డర్ నెస్, వానాంచల్..ఉగ్రభట్టి గుహ.., చిన్నమస్తాదేవి..త్రేతాయుగంతో లింక్.. గ్లింప్స్‌లో చూపించిన ప్రతీ విజువల్ `వారణాసి`పై అంచనాల్ని పతాక స్థాయికి చేర్చింది. ఇదిలా వుంటే ఈ ప్రాజెక్ట్‌పై ప్రస్తుతం సరికొత్త చర్చ టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ మూవీని ఇండియన్ సినిమాల్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరపైకి తీసుకొస్తున్నారు. 2027 వేసవిలో వరల్డ్‌వైడ్‌గా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.
ఈ నేపథ్యంలోనే ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. మహేష్ బాబు, జక్కన్న తొలిసారి కలిసి చేస్తున్న సినిమా ఇది. అందులోనూ మహేష్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా కావడంతో దీని బడ్జెట్, రిలీజ్ మార్కెట్ లెక్కలు వేస్తున్నారిప్పుడు. దాదాపు రూ.1500 కోట్ల బడ్జెట్ అవుతుందన్నది ఇండస్ట్రీ వర్గాల అంచనా. 'బాహుబలి' సిరీస్‌తో పాన్ ఇండియా సినిమాలకు సరికొత్త మార్కెట్‌ని క్రియేట్ చేశాడు రాజమౌళి.
ఆ తరువాత ఆ మార్కెట్‌ని కేజీఎఫ్, పుష్ప చిత్రాలు మరింతగా పెంచాయి. కంటెంట్‌తో భారీ స్టార్ కాస్ట్‌తో సినిమాలు చేస్తే పాన్ ఇండియా తో పాటు వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని, కాసుల వర్షం కురిపిస్తారని ఇవి నిరూపించాయి. ఇప్పుడు 'వారణాసి'తో మహేష్ వంతు వచ్చింది. తను నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ కావడం, సరికొత్త నేపథ్యంలో హైందవ ధర్మాన్ని అంతర్లీనంగా చూపిస్తూనే సరికొత్త ప్రపంచాన్ని జక్కన్న ఈ సినిమాతో క్రియేట్ చేస్తుండటం, అవతార్ స్థాయి విజువల్స్‌తో తెరపై ఆవిష్కరిస్తుండటంతో 'వారణాసి'పై అందరి దృష్టి పడింది.
దీంతో ఈ ప్రాజెక్ట్ జక్కన్న కంటే మహేష్‌కు బిగ్ ఛాలెంజింగ్ ప్రాజెక్ట్‌గా మారింది. రాజమౌళి క్రేజ్, అబ్బుర పరిచే విజువల్స్‌తో ఈ సినిమాకు భారీ మార్కెట్ ఏర్పడే అవకాశం ఉంది. అది నిజంగా జరిగి సినిమా ప్రపంచ వ్యాప్తంగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంటేనే `వారణాసి` పాన్ ఇండియా సినిమాల్లో నెక్స్ట్ లెవెల్ హిస్టరీని క్రియేట్ చేస్తుందన్నది ట్రేడ్ వర్గాల అంచనా. అదే జరిగితే తెలుగు సినిమా మార్కెట్ మరో లెవెల్‌కి చేరడం ఖాయం. మరి ఆ ఛాలెంజ్‌ని 'వారణాసి'తో మహేష్ సక్సెస్ ఫుల్‌గా అధిగమిస్తాడా? అన్నది తెలియాలంటే 2027 సమ్మర్ వరకు వేచి చూడాల్సిందే.
