Begin typing your search above and press return to search.

వరలక్ష్మి ప్రమోషన్స్ ఇష్యూ.. అగ్రిమెంట్‌ లో ఉన్నదేంటి?

దర్శకుడి వివరణ ప్రకారం, క్యాస్టింగ్ తో మూవీ టీమ్ కుదుర్చుకున్న ఒప్పందంలో ప్రమోషన్స్‌ కు సంబంధించిన నిబంధనలు క్లియర్ గా ఉన్నాయట.

By:  M Prashanth   |   11 Jun 2026 9:17 AM IST
వరలక్ష్మి ప్రమోషన్స్ ఇష్యూ.. అగ్రిమెంట్‌ లో ఉన్నదేంటి?
X

నటి వరలక్ష్మి శరత్‌ కుమార్‌ పై డైరెక్టర్ సంజీవ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. సాధారణంగా సినిమా విడుదలకు ముందు హీరో, హీరోయిన్లు ప్రమోషన్స్‌ లో పాల్గొనడం కామన్. కానీ పోలీస్ కంప్లైంట్ సినిమా విషయంలో పరిస్థితి వేరేగా కనిపించింది. సినిమాలో కీలక పాత్ర పోషించిన వరలక్ష్మి ప్రమోషన్స్‌ కు దూరంగా ఉండటంపై దర్శకుడు ఓపెన్ గానే ఆరోపణలు చేయడం హాట్ టాపిక్ గా మారింది.

హారర్, యాక్షన్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో రూపొందిన పోలీస్ కంప్లైంట్ మూవీ జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్‌ లో నిర్వహించిన మీడియా సమావేశంలో దర్శకుడు సంజీవ్ మాట్లాడుతూ వరలక్ష్మి రాకపోవడంపై స్పందించారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న అగ్రిమెంట్‌లో ప్రమోషన్స్ అంశం లేకపోయి ఉండొచ్చనే ప్రచారంపై ముందుగానే ఆయన క్లారిటీ ఇచ్చారు.

దర్శకుడి వివరణ ప్రకారం, క్యాస్టింగ్ తో మూవీ టీమ్ కుదుర్చుకున్న ఒప్పందంలో ప్రమోషన్స్‌ కు సంబంధించిన నిబంధనలు క్లియర్ గా ఉన్నాయట. వరలక్ష్మికి సినిమా కోసం రూ.75 లక్షల రెమ్యూనరేషన్ ఇచ్చామని, అదే విధంగా ఐదు రోజుల పాటు ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొంటానని ఆమె అగ్రిమెంట్ పేపర్ పై సంతకం చేశారని తెలిపారు. అయితే ఇప్పటి వరకు ఆమె ఒక్క రోజు మాత్రమే ప్రమోషన్స్ కు హాజరయ్యారని చెప్పారు. అది కూడా కేవలం 40 నిమిషాల సమయం మాత్రమే కేటాయించారని వెల్లడించారు.

ఇక ఇదే సందర్భంలో హీరో నవీన్ చంద్ర విషయాన్ని కూడా దర్శకుడు ప్రస్తావించారు. ఆయన ముందుగానే తన బిజీ షెడ్యూల్ గురించి చెప్పారని, అవకాశం ఉంటే తప్పకుండా వస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. ప్రస్తుతం తమిళ చిత్రాలతో నవీన్ చంద్ర బిజీగా ఉన్నప్పటికీ, మూవీ టీమ్ ఎప్పుడూ టచ్‌ లో ఉంటూ స్పందిస్తున్నారని చెప్పారు. ఆయన మేనేజ్మెంట్ నుంచి కూడా కోపరేషన్ ఉందని వెల్లడించారు.

కానీ వరలక్ష్మి టీమ్ నుంచి మాత్రం సరైన రెస్పాన్స్ లేదని దర్శకుడు ఆరోపించారు. రెమ్యునరేషన్ విషయంలో మేనేజ్మెంట్ చురుగ్గా వ్యవహరిస్తుందని, కానీ ప్రమోషన్స్ విషయానికి వచ్చేసరికి రెస్పాన్స్ కనిపించడం లేదని తెలిపారు. రెమ్యునరేషన్ కాకుండా ఆమె స్టాఫ్ కు రోజుకు రూ.50 వేలు ఖర్చు పెట్టామని చెప్పిన డైరెక్టర్.. కనీసం ఎవరూ రెస్పాండ్ అవ్వడం లేదని అన్నారు.

అయితే దర్శకుడి కామెంట్స్ తర్వాత మొత్తం వ్యవహారంపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఒప్పందం ప్రకారం ప్రమోషన్స్‌ కు హాజరు కావాల్సిందేనని అంటుంటే, మరికొందరు క్యాస్టింగ్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ రీజన్స్ ను పరిశీలించాలని అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా దర్శకుడు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, దీనిపై వరలక్ష్మి శరత్‌కుమార్ లేదా ఆమె టీమ్ స్పందిస్తుందా? అసలు ఆ వివాదానికి ఎప్పుడు ఎండ్ కార్డు పడుతుంది? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సినిమా విడుదలకు ముందే బయటకు వచ్చిన ప్రమోషన్స్ ఇష్యూలో చివరికి ఏం జరుగుతుందో అంతా వేచి చూడాలి.