ఏళ్ల క్రితమే విజయ్ రాజకీయ భవిష్యత్తుని ఊహించా!
తమిళనాడు రాజకీయాల్లో విజయ్ ఎదుగుదలపై ప్రస్తుతం ఎన్నో చర్చలు జరుగుతున్న వేళ, నటి వరలక్ష్మి శరత్‌కుమార్ చేసిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది.
By: Sravani Lakshmi Srungarapu | 16 July 2026 3:15 PM ISTతమిళనాడు రాజకీయాల్లో విజయ్ ఎదుగుదలపై ప్రస్తుతం ఎన్నో చర్చలు జరుగుతున్న వేళ, నటి వరలక్ష్మి శరత్‌కుమార్ చేసిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది. విజయ్ రాజకీయాల్లోకి వచ్చి, రాణిస్తారని తానిప్పుడు అనుకోలేదని, కొన్నేళ్ల క్రితమే ఆయన భవిష్యత్తు దిశను ఊహించానని ఆమె వెల్లడించడం అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. సర్కార్ సినిమా షూటింగ్ టైమ్ లో విజయ్‌తో జరిగిన ఓ సంభాషణ తర్వాత ఆయన ప్రయాణం సినిమాలకు మాత్రమే పరిమితం కాదనే అభిప్రాయం తనకు కలిగిందని, ఆ టైమ్ లో వచ్చిన ఆ ఆలోచనే ఇప్పుడు నిజమైనట్లు అనిపిస్తోందని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం విజయ్ తమిళనాడు రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్న నేపథ్యంలో ఆ జ్ఞాపకాన్ని మరోసారి ఫ్యాన్స్ తో పంచుకున్నారు.
తాజాగా విజయ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన వరలక్ష్మి, ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన వ్యక్తిత్వంలో ఎలాంటి మార్పు కనిపించలేదని చెప్పారు. గతంలో ఎలా అందరితో ఆప్యాయంగా మెలిగేవారో, ఇప్పటికీ అదే స్వభావంతో ఉంటున్నారని ఆమె వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వినయం కోల్పోకపోవడం తనను ఆకట్టుకుందని వెల్లడించారు.
తమ సమావేశంలో మహిళల సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలపై కూడా చర్చించినట్లు వరలక్ష్మి పేర్కొన్నారు. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో ఆ దిశగా మరిన్ని చర్యలు కనిపిస్తాయని అన్నారు. అదే సమయంలో ప్రజలు ఎన్నుకున్న నాయకుడికి తన పనితీరును నిరూపించుకునే అవకాశం ఇవ్వాలని కూడా ఆమె అభిప్రాయపడ్డారు.
విమర్శలు చేయడం సులభమే అయినప్పటికీ, ఒక నాయకుడి సామర్థ్యాన్ని నిర్ణయించేది కాలమేనని పేర్కొంటూ, అందరూ ఆ టైమ్ వచ్చేవరకు వెయిట్ చేయాలని కోరారు. ప్రజల విశ్వాసంతో నాయకత్వం దక్కడం వెనుక ధైర్యం, కృషి, ప్రజాభిమానం ఉంటాయని ఆమె వ్యాఖ్యానించారు. వరలక్ష్మి చేసిన ఈ కామెంట్స్ తో విజయ్ రాజకీయ ప్రస్థానంపై ఆమెకు ఉన్న నమ్మకం చర్చనీయాంశంగా మారింది.
