Begin typing your search above and press return to search.

స‌ర‌స్వ‌తి సక్సెస్.. మ‌రింత మందికి మార్గ‌ద‌ర్శ‌కం అయ్యేనా?

గతంలో విజయనిర్మల లాంటి అరుదైన వ్యక్తిత్వం ఉన్న‌వారు మాత్రమే భారీ స్థాయిలో సినిమాలు తెరకెక్కించి గిన్నిస్ రికార్డు సృష్టించారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   4 March 2026 4:26 PM IST
స‌ర‌స్వ‌తి సక్సెస్.. మ‌రింత మందికి మార్గ‌ద‌ర్శ‌కం అయ్యేనా?
X

టాలీవుడ్‌లో మహిళా దర్శకుల సంఖ్య ఇప్పటికీ చాలా లిమిటెడ్ మాత్ర‌మే. హీరోయిన్లుగా స్టార్‌డమ్ అందుకున్నవారు చాలామందే ఉన్నా, కెమెరా వెనుక మెగాఫోన్ పట్టే వాళ్లు మాత్రం రేర్. అలాంటి పరిస్థితుల్లో నటి నుంచి దర్శకురాలిగా మారిన వరలక్ష్మి శరత్ కుమార్ వేస్తున్న అడుగు ఇండ‌స్ట్రీలో చర్చనీయాంశమైంది. ఆమె దర్శకత్వంలో రూపొందిన సరస్వతి రిలీజ్ కు సిద్ధమవుతుండగా, ఒక ప్రశ్న సహజంగానే వినిపిస్తోంది. అదే వరలక్ష్మిని చూసైనా మరింత మంది మహిళలు డైరెక్షన్ వైపు అడుగేస్తారా? అని.

గిన్నిస్ రికార్డు సృష్టించిన విజ‌య నిర్మ‌ల‌

గతంలో విజయనిర్మల లాంటి అరుదైన వ్యక్తిత్వం ఉన్న‌వారు మాత్రమే భారీ స్థాయిలో సినిమాలు తెరకెక్కించి గిన్నిస్ రికార్డు సృష్టించారు. ఆమె తర్వాత మహిళా దర్శకుల ప్రవాహం పెరుగుతుందని ఆశించినా, అది పెద్దగా మారలేదు. మధ్యలో కొంతమంది ప్రయత్నాలు చేసిన‌ట్టు కనిపించినా, నిరంతరంగా కొనసాగిన ఉద్యమంలా మారలేదు. ఇదే నేపథ్యంలో వరలక్ష్మి తీసుకున్న నిర్ణయం ఒక ధైర్యవంతమైన ప్రయోగంగా భావించవచ్చు.

సాహ‌సం చేస్తున్న వ‌ర‌ల‌క్ష్మి

వరలక్ష్మి ఇప్పటికే నటిగా బలమైన పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి సమయంలో కమర్షియల్ సేఫ్ జోన్‌లోనే కొనసాగకుండా, కథ చెప్పే బాధ్యత తీసుకోవడం సాహసమే. అది కూడా హీరో ఓరియెంటెడ్ స్క్రీన్ ప్లే కు బదులుగా కథానాయకత్వాన్ని పాత్రలకు అప్పగించడం ఇండ‌స్ట్రీలో కొత్త చర్చకు దారి తీసింది. ఇలాంటి నేప‌థ్యంలో ఈ సినిమా ఎలాంటి ఫ‌లితాన్ని అందుకుంటుంద‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.

అయితే ఇదంతా సినిమా స‌క్సెస్‌పై ఆధారపడి ఉంటుంది. సరస్వతి మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి రిజ‌ల్ట్ ను అందుకుంటే, అది కేవలం ఒక సినిమా స‌క్సెస్ కాదు, మహిళా డైరెక్ట‌ర్ల పట్ల ఉన్న అన్ని డౌట్స్ కు సమాధానాలు ఇచ్చిన‌ట్టు అవుతుంది. ఈ సినిమా స‌క్సెస్ అయితే, మ‌రొక‌రికి ధైర్యాన్నిస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో కథల వైవిధ్యం పెరుగుతున్న నేపథ్యంలో, మహిళా దృక్కోణం కూడా అవసరమనే చర్చ బలపడుతోంది. అలాంటి సమయంలో వరలక్ష్మి ప్రయత్నం స‌క్సెస్ అయితే, నటీమణులు గానీ, రచయిత్రులు గా ఉన్న మరికొందరు క్రియేటివ్ మ‌హిళ‌లు కానీ దర్శకత్వం వైపు చూసే అవ‌కాశ‌ముంది. సరస్వతి మూవీ రిజ‌ల్ట్ ఏదైనా కావొచ్చు, కానీ వరలక్ష్మి వేసిన ఈ అడుగు, టాలీవుడ్‌లో మహిళా డైరెక్ట‌ర్ల భవిష్యత్తుపై కొత్త చర్చను ప్రారంభించిన విషయం మాత్రం స్పష్టమే.