"పిల్లలు వద్దు.. నా భర్తకి ఆల్రెడీ కూతురు ఉంది"
నటి వరలక్ష్మి శరత్ కుమార్ ప్రస్తుతం తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.
By: Sivaji Kontham | 3 Oct 2026 9:38 AM ISTనటి వరలక్ష్మి శరత్ కుమార్ ప్రస్తుతం తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. పెళ్లి తర్వాత పిల్లల గురించి ఆమె తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తనకు పిల్లలు వద్దని తాను, తన భర్త ఇద్దరూ నిర్ణయించుకున్నామని వరలక్ష్మి స్పష్టంగా చెప్పారు.
2024లో ముంబైకి చెందిన వ్యాపారవేత్త, గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్‌దేవ్‌ను వరలక్ష్మి వివాహం చేసుకున్నారు. తాజాగా వీడియో జాకీ భరణీ సురేష్‌తో జరిగిన ఇంటర్వ్యూలో ఆమె పిల్లల గురించి తన అభిప్రాయాలను వెల్లడించారు.
“నాకు పిల్లలు వద్దని వ్యక్తిగతంగా నిర్ణయించుకున్నాను. పిల్లలను కనలేనని కాదు. నాకు పిల్లలు వద్దని నేను అనుకుంటున్నాను. నా భర్త కూడా అదే ఆలోచనతో ఉన్నారు” అని వరలక్ష్మి చెప్పారు.
తన భర్తకు గత వివాహం ద్వారా ఒక కుమార్తె ఉందని ఆమె తెలిపారు. ఆ అమ్మాయిని తాను తన సొంత కుమార్తెలాగే చూసుకుంటానని చెప్పారు. అలాగే తమకు రెండు కుక్కలు ఉన్నాయని, వాటిని కూడా తమ పిల్లలుగానే భావిస్తామని వరలక్ష్మి పేర్కొన్నారు.
పిల్లలను కనడం అనేది చాలా పెద్ద బాధ్యత అని ఆమె అభిప్రాయపడ్డారు. పిల్లలను పెంచే బాధ్యతకు సిద్ధంగా లేకపోతే పిల్లలను కనకపోవడమే మంచిదని చెప్పారు. ఈ నిర్ణయం తన వ్యక్తిగత ఎంపిక అని, దీనిపై ఎవరూ ప్రశ్నించాల్సిన అవసరం లేదని ఆమె వ్యాఖ్యల ద్వారా స్పష్టం చేశారు. వరలక్ష్మి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కెరీర్ విషయానికి వస్తే, వరలక్ష్మి శరత్ కుమార్ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో పలు సినిమాల్లో నటించారు. వైవిధ్యమైన పాత్రలు చేస్తూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల ఆమె సరస్వతి అనే చిత్రంలో కనిపించారు. ఈ సినిమాకు వరలక్ష్మి శరత్ కుమారే దర్శకత్వం వహించగా, ఇందులో నటి ప్రియమణి కూడా కీలక పాత్రలో నటించారు. నటిగా మాత్రమే కాకుండా, దర్శకత్వం వైపు కూడా అడుగులు వేస్తూ వరలక్ష్మి తన కెరీర్‌లో కొత్త ప్రయోగాలు చేస్తున్నారు.
