చెల్లిని కూడా వంకరగా చూస్తారా మీరు? వరలక్ష్మి ఘాటైన ప్రశ్న!
సమాజంలో మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలకు వారు వేసుకునే దుస్తులే కారణమనే వాదనపై నటి వరలక్ష్మి శరత్ కుమార్ అత్యంత ఘాటుగా స్పందించారు.
By: Sivaji Kontham | 5 March 2026 9:34 AM ISTసమాజంలో మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలకు వారు వేసుకునే దుస్తులే కారణమనే వాదనపై నటి వరలక్ష్మి శరత్ కుమార్ అత్యంత ఘాటుగా స్పందించారు. ఒక ఇంటర్వ్యూలో వరలక్ష్మి మాట్లాడుతూ.. అమ్మాయిల బట్టల వల్ల తప్పులు జరుగుతున్నాయని విమర్శించే మగవారి ఆలోచనా విధానాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. బట్టలు మార్చుకోవడం వల్ల సమాజంలో మార్పు రాదని.. చూసే కళ్ళలో మార్పు వచ్చినప్పుడే మహిళలకు రక్షణ ఉంటుందని కుండబద్దలు కొట్టారు.
దుస్తుల సాకుతో వేధింపులను సమర్థించే వారికి వరలక్ష్మి ఒక సునిశితమైన ప్రశ్న వేశారు. ``మీ ఇంట్లో మీ అక్క లేదా చెల్లి పొట్టి బట్టలు (షార్ట్స్) వేసుకున్నప్పుడు.. వారిని చూసి మీకు రేప్ చేయాలని అనిపిస్తుందా?`` అని ఆమె నిలదీశారు. ఇంట్లో వాళ్ళని చూసినప్పుడు రాని చెడు ఆలోచనలు.. బయట మహిళలను చూడగానే ఎందుకు వస్తాయని.. ఇది కేవలం వారి వ్యక్తిత్వ లోపమేనని ఘాటుగా విమర్శించారు.
ముఖ్యంగా మహిళల లోదుస్తుల (బ్రా) గురించి సమాజంలో ఉన్న వింత పోకడలను వరలక్ష్మీ ఎండగట్టారు. ఒక అమ్మాయి బ్రా స్ట్రాప్ పొరపాటున బయటకు కనిపిస్తే.. ఏదో ప్రపంచమే అంతమైపోయినట్లు లేదా ఆమె జీవితమే నాశనమైనట్లు ఎందుకు అంత వింతగా చూస్తారని ప్రశ్నించారు. బ్రా అనేది కేవలం ఒక ఇన్నర్ వేర్ మాత్రమేనని, అది ప్రతి మనిషికి ప్రాథమిక అవసరమని వరూ గుర్తు చేశారు.
మగవారి వస్త్రధారణతో పోలుస్తూ ఆమె ఆసక్తికరమైన ఉదాహరణ ఇచ్చారు. మగవారు జీన్స్ ప్యాంట్ వేసుకున్నప్పుడు వంగితే వారి లోదుస్తులు కనిపిస్తాయని.. మరి అది చూసి ఏ అమ్మాయి కూడా వారిపై అఘాయిత్యాలకు పాల్పడదు కదా అని చురకలంటించారు. మగవారి లోదుస్తులు కనిపిస్తే లేని అభ్యంతరం.. ఆడవారి విషయంలోనే ఎందుకు వస్తుందని.. ఈ వివక్ష మారాలని డిమాండ్ చేశారు.
ఎవరి శరీరం వారిది.. తమకు నచ్చిన బట్టలు వేసుకునే పూర్తి స్వేచ్ఛ ప్రతి మహిళకు ఉంటుందని వరలక్ష్మి పేర్కొన్నారు. ఒకరి డ్రెస్సింగ్‌ను బట్టి వారి క్యారెక్టర్‌ను జడ్జ్ చేసే అధికారం ఎవరికీ లేదని ఆమె హెచ్చరించారు. మహిళలు అందంగా ఉన్నారని అనుకోవడంలో తప్పు లేదని.. కానీ ఆ మెప్పుకోలు గౌరవప్రదంగా ఉండాలి తప్ప, ప్రవర్తనలో హద్దులు దాటకూడదని హితవు పలికారు.
తనలోని ఈ తెగింపు.. నిర్మొహమాటంగా మాట్లాడే స్వభావం తనను తాను రక్షించుకోవడానికే కాకుండా.. తోటి మహిళల్లో ధైర్యాన్ని నింపడానికేనని వరలక్ష్మి వివరించారు. వేధింపులకు గురైనప్పుడు మౌనంగా ఉండకుండా గళం ఎత్తాలని.. సెలబ్రిటీగా తన వాయిస్ ద్వారా సమాజంలో మార్పు తీసుకురావడానికి నిరంతరం ప్రయత్నిస్తానని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. వరలక్ష్మి దర్శకత్వం వహించిన `సరస్వతి` చిత్రం ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే.
