Begin typing your search above and press return to search.

వరలక్ష్మికి డైరెక్టర్ సారీ.. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌ కు పంచాయితీ?

నటి వరలక్ష్మి శరత్‌ కుమార్ లీడ్ రోల్ లో నటించిన పోలీస్ కంప్లైంట్ మూవీ రిలీజ్ కు సిద్ధమవుతున్న వేళ, ప్రమోషన్ల విషయంపై చెలరేగిన వివాదం ఇప్పుడు దాదాపు క్లియర్ అయినట్లు కనిపిస్తోంది.

By:  M Prashanth   |   12 Jun 2026 12:05 AM IST
వరలక్ష్మికి డైరెక్టర్ సారీ.. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌ కు పంచాయితీ?
X

నటి వరలక్ష్మి శరత్‌ కుమార్ లీడ్ రోల్ లో నటించిన పోలీస్ కంప్లైంట్ మూవీ రిలీజ్ కు సిద్ధమవుతున్న వేళ, ప్రమోషన్ల విషయంపై చెలరేగిన వివాదం ఇప్పుడు దాదాపు క్లియర్ అయినట్లు కనిపిస్తోంది. కొన్ని గంటలుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌ గా మారిన ఆ వ్యవహారంలో దర్శకుడు సంజీవ్ మేగోటి ఓపెన్ గా క్షమాపణలు చెప్పగా, వరలక్ష్మి కూడా ఆ సారీ యాక్సెప్ట్ చేసినట్లు ప్రకటించారు.

ఇటీవల జరిగిన ప్రెస్ మీట్ లో దర్శకుడు సంజీవ్ మేగోటి చేసిన కామెంట్స్ వివాదానికి కారణమయ్యాయి. సినిమా ప్రమోషన్లకు వరలక్ష్మి సహకరించడం లేదని ఆరోపించారు. డబ్బులు తీసుకుని రాలేదని అన్నారు. దీంతో సోషల్ మీడియాలో వరలక్ష్మిపై విమర్శలు, ట్రోలింగ్ మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆమె స్పందిస్తూ తాను పిలిచిన ఈవెంట్స్ కు హాజరయ్యానని, పూర్తి విషయాలు తెలుసుకోకుండా స్పందించడం సరైంది కాదని పేర్కొన్నారు. అలాగే దాన్ని పెద్ద వివాదంగా మార్చాలని తాను అనుకోవడం లేదని స్పష్టం చేశారు.

ఆ వివాదం మరింత ముదరకముందే తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ జోక్యం చేసుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం దర్శకుడు సంజీవ్ వీడియో ద్వారా వివరణ ఇస్తూ వరలక్ష్మికి సారీ చెప్పారు. ఆ వీడియోను వరలక్ష్మి తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేస్తూ, "అపాలజీ యాక్సెప్ట్ చేశా. న్యాయం, సత్యం ఎప్పుడూ గెలుస్తాయి. ఈ విషయంలో త్వరగా స్పందించిన తెలుగు నిర్మాతల మండలికి ధన్యవాదాలు" అని పేర్కొన్నారు. అలాగే ఆ వ్యవహారంలో సహకరించిన దామెదర్, ప్రసన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

తన వివరణలో దర్శకుడు సంజీవ్ మేగోటి కూడా వరలక్ష్మిపై ప్రశంసలు కురిపించారు. పోలీస్ కంప్లైట్ మూవీ కథను ఆమెను దృష్టిలో పెట్టుకుని రాసుకున్నానని, షూటింగ్ మొత్తం ఆమె ఎంతో డెడికేషన్ తో పనిచేశారని చెప్పారు. ఒక సందర్భంలో ఆమె చేతికి గాయం అయినప్పటికీ షూటింగ్‌ కు ఎలాంటి ఆటంకం కలగకుండా సహకరించారని గుర్తుచేశారు. సినిమా యూనిట్ మెంబర్ గా కాకుండా ఫ్యామిలీ మెంబర్ లాా వ్యవహరించారని అన్నారు.

అయితే విడుదల సమయానికి ఆమెతో కలిసి కొన్ని ప్రమోషనల్ ఈవెంట్స్ ను నిర్వహించాలని అనుకున్నప్పటికీ, అవి కుదరలేదని వివరించారు. అదే సమయంలో సినిమా గురించి మాట్లాడుతుండగా ప్రమోషన్ల అంశం ప్రస్తావనకు వచ్చిందని, ఆ ఒత్తిడిలో కొన్ని మాటలు అనుకోకుండా బయటకు వచ్చాయని చెప్పారు. అవి ఎవరినీ బాధపెట్టాలనే ఉద్దేశంతో చెప్పినవి కావని, అనుకోకుండా దొర్లాయని తెలిపారు.

వరలక్ష్మి ఎప్పుడూ ఏ సినిమా యూనిట్‌ కూ ఇబ్బంది కలిగించలేదని, అనేక మంది తనకు కాల్ చేసి మాట్లాడారని దర్శకుడు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆ వివాదానికి తెరపడినట్లే కనిపిస్తున్నప్పటికీ, ఇది నిర్మాతల మండలి వరకు వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. ఏదేమైనా చిన్న అపార్థంతో మొదలైన ఆ వ్యవహారం, సారీతో ముగిసినట్లు కనిపిస్తోంది. విడుదలకు సిద్ధంగా ఉన్న పోలీస్ కంప్లైంట్ సినిమాపై దృష్టి పెట్టాలని దర్శకుడు కోరగా.. వరలక్ష్మి మూవీలో అద్భుతంగా యాక్ట్ చేశారని చెప్పారు. మరి సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి.