Begin typing your search above and press return to search.

అటు డైరెక్షన్.. ఇటు ప్రొడక్షన్.. వంగా బిజీ బిజీ?

ఇదిలా ఉంటే.. ఒకవైపు ఆ భారీ ప్రాజెక్ట్‌ తో డైరెక్టర్‌ గా బిజీగా ఉన్న వంగా, మరోవైపు ప్రొడ్యూసర్‌ గా కూడా కొత్త ప్రాజెక్ట్‌ ను ముందుకు తీసుకెళ్తున్నారు.

By:  M Prashanth   |   9 April 2026 7:27 PM IST
అటు డైరెక్షన్.. ఇటు ప్రొడక్షన్.. వంగా బిజీ బిజీ?
X

పాన్ ఇండియా దర్శకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం డైరెక్టర్‌ గా, ప్రొడ్యూసర్‌ గా రెండింట్లోనూ బిజీగా ఉన్నారు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ వంటి వరుస బ్లాక్‌ బస్టర్ చిత్రాలతో ఇండస్ట్రీలో తన స్టైల్‌ తో ఆకట్టుకున్న వంగా, ఇప్పుడు ప్రభాస్ హీరోగా స్పిరిట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆ సినిమా అనౌన్స్‌మెంట్ జరిగినప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి.

స్పిరిట్ మూవీ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌ గా రూపొందుతోంది. ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. యాక్షన్ బ్యాక్‌ డ్రాప్‌ లో తెరకెక్కుతున్న ఆ చిత్రంపై అభిమానులతో పాటు సినీ వర్గాల్లో కూడా భారీ హైప్ ఏర్పడింది. ముఖ్యంగా వంగా మేకింగ్ స్టైల్, పాత్రల ప్రెజెంటేషన్‌ పై ప్రేక్షకులు హై రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు.

ఇదిలా ఉంటే.. ఒకవైపు ఆ భారీ ప్రాజెక్ట్‌ తో డైరెక్టర్‌ గా బిజీగా ఉన్న వంగా, మరోవైపు ప్రొడ్యూసర్‌ గా కూడా కొత్త ప్రాజెక్ట్‌ ను ముందుకు తీసుకెళ్తున్నారు. మేం ఫేమస్ సినిమా ద్వారా గుర్తింపు పొందిన యువ నటుడు సుమంత్ ప్రభాస్ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఆ సినిమాకు వంగా దర్శకత్వం వహించడం లేదు. తన కుటుంబానికి చెందిన భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఆ సినిమాలో సుమంత్ ప్రభాస్ సరసన మ్యాడ్, 8 వసంతాలు చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న అనంతిక సనీల్ కుమార్ కథానాయికగా ఎంపికైనట్లు సమాచారం. కొత్త జంటతో తెరకెక్కుతున్న ఆ ప్రాజెక్ట్‌ పై కూడా ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా యువతను ఆకట్టుకునే కథ రూపొందుతోందని టాక్ వినిపిస్తోంది. ఆ చిత్రానికి దర్శకుడిగా వేణును పరిచయం చేస్తున్నారు. వేణు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శిష్యుడు కాగా.. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించడంలో వంగా చూపుతున్న ఆసక్తి సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

కథ విషయానికి వస్తే, సినిమా తెలంగాణ నేపథ్యంలోని ఓ పల్లెటూరి ప్రేమ కథగా తెరకెక్కుతోందని తెలుస్తోంది. సాధారణ ప్రేమకథలా కనిపించినప్పటికీ, అందులో వంగా స్టైల్ టచ్ కూడా ఉండబోతుందని సమాచారం. భావోద్వేగాలు, రియలిస్టిక్ ట్రీట్మెంట్‌ తో పాటు యూత్‌ ఫుల్ డ్రామాగా చిత్రం ఉండనుందట. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోందని తెలిసింది.

రోమాంచికం అనే టైటిల్‌ ను పరిశీలిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి, ఒకవైపు భారీ ప్రాజెక్ట్ స్పిరిట్ ను తెరకెక్కిస్తూ, మరోవైపు కొత్తవారితో సినిమా నిర్మిస్తూ సందీప్ రెడ్డి వంగా తన బిజీ షెడ్యూల్‌ తో ముందుకు సాగుతున్నారు. దర్శకుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా తనదైన ముద్ర వేయాలని ప్రయత్నిస్తున్న ఆయన, రెండు ప్రాజెక్టులతో ఎలాంటి విజయాలు సాధిస్తారో చూడాలి.