హనుమాన్-2.. తేలిగ్గా తీసుకోలేం
‘హనుమాన్’కు ఒకేసారి రెండు సీక్వెల్స్ తెరకెక్కనున్నాయి. ప్రశాంత్ వర్మ ‘జై హనుమాన్’ను మైత్రి మూవీ మేకర్స్‌తో రూపొందిస్తుండగా, ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ మరో సీక్వెల్‌ను ప్రకటించింది. ఇందులో పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా, వీఐ ఆనంద్ దర్శకుడిగా వ్యవహరించనున్నారు.
By: Garuda Media | 21 Nov 2026 11:10 PM IST2024 సంక్రాంతికి రిలీజైన ‘హనుమాన్’ సినిమా ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. పోటీలో ‘గుంటూరు కారం’ లాంటి పెద్ద సినిమా ఉండగా.. స్టార్ కాస్ట్ లేని ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టించింది. తెలుగులోనే కాక ఇతర భాషల్లోనూ భారీ వసూళ్లు రాబట్టి పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమాకు కొనసాగింపుగా ‘జై హనుమాన్’ ఉంటుందని ఆ చిత్రం చివర్లో లీడ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఆటోమేటిగ్గా ఈ సినిమాను ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బేనర్లోనే ప్రశాంత్ తీస్తాడని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఆ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బేనర్లో చేయడానికి రెడీ అయిపోయాడు ప్రశాంత్. నిర్మాతలతో తనకు ఏం సమస్యో తెలియదు కానీ.. అతనో చిన్న దర్శకుడిగా ఉండగా నమ్మి స్టార్ కాస్టింగ్ లేకపోయినా మంచి క్వాలిటీతో సినిమాను ప్రొడ్యూస్ చేసిన నిర్మాతలను వదిలేశాడేంటి అనే ప్రశ్న తలెత్తింది. కానీ తెర వెనుక ఏం జరిగిందో తెలియదు కాబట్టి ప్రశాంత్‌ను కూడా తప్పుబట్టలేం.
ఐతే ఈ విషయాన్ని ‘హనుమాన్’ ప్రొడ్యూసర్లు అంత తేలిగ్గా తీసుకోలేదని ఈ రోజే అర్థమైెంది. పంతం పట్టి తమ బేనర్లో ప్రత్యేకంగా ‘హనుమాన్’ సీక్వెల్‌ను అనౌన్స్ చేశారు. ఐతే ‘హనుమాన్’ సీక్వెల్ అంటే ప్రశాంత్ చేయడమే కరెక్ట్ అనే భావన ఉంటుంది ప్రేక్షకుల్లో. పైగా ‘కాంతార’ హీరో రిషబ్ శెట్టి అందులో లీడ్ రోల్ చేస్తుండడం, మైత్రి లాంటి పెద్ద సినిమా ప్రొడ్యూస్ చేస్తుండడంతో దానికి ఉన్న హైపే వేరు.
ఈ నేపథ్యంలో ప్రొడ్యూసర్లు వేరుగా ‘హనుమాన్’ సీక్వెల్ అంటే ఆడియన్స్ లైట్ తీసుకుంటారనే భావిస్తాం. కానీ మెగా ఫ్యామిలీకి చెందిన పంజా వైష్ణవ్ తేజ్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. పైగా వైవిధ్యమైన సినిమాలకు పెట్టింది పేరైన వీఐ ఆనంద్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రైమ్ షో వాళ్లు కూడా ఈ సినిమాను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని భారీ బడ్జెట్ పెట్టడానికి రెడీ అయిపోయారు. కాబట్టి ఈ ప్రాజెక్టును తేలిగ్గా ఏమీ తీసుకోలేం. మొత్తానికి ‘హనుమాన్’కు ఒకే టైంలో రెండు సీక్వెల్స్ తెరకెక్కడం, రెండూ ఆసక్తి రేకెత్తిస్తుండడం విశేషంగానే చెప్పుకోవాలి.
