విశాఖ జాయింట్ కలెక్టర్ ఉద్యోగం వదిలేసి నటనలోకి!
ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ.. ``ఈ మధ్య ఎంసెట్‌లో మొదటి ర్యాంక్ వచ్చిన ఒక కుర్రాడిని సుభాష్ చంద్రబోస్ ఎవరు? అని అడిగితే విజయవాడలోని `బోస్ ట్రావెల్స్` బస్సు అని చెప్పాడు.
By: Sivaji Kontham | 24 Aug 2026 10:15 AM ISTసివిల్ సర్వీసెస్ జాబ్ సాధించి, విశాఖపట్నం జాయింట్ కలెక్టర్‌గా పనిచేయడం అంటే ఎందరికో అదొక డ్రీమ్ జాబ్. కానీ నటనపై ఉన్న అపారమైన అభిరుచితో ఆ హోదాను, ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసి సినీ రంగంలోకి అడుగుపెట్టడం సామాన్యమైన విషయం కాదు. అటువంటి అత్యంత సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకుని ప్రస్తుతం టాలీవుడ్‌లో సహాయ నటుడిగా, కమెడియన్‌గా, విలన్‌గా విభిన్న పాత్రల్లో బిజీగా మారి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు నటుడు వడ్లమాని శ్రీనివాస్.
కలెక్టర్ హోదాను పక్కనపెట్టి సినిమా పరిశ్రమలో శ్రమించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు వడ్లమాని శ్రీనివాస్. ఇప్పటివరకు ఆయన 70కి పైగా చిత్రాలలో నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ముఖ్యంగా ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన 6 చిత్రాలలో కీలక పాత్రల్లో కనిపించి తన నటనతో ప్రత్యేక ముద్ర వేశారు. తన కల కోసం తీసుకున్న రిస్క్.. ప్రదర్శించిన పట్టుదల నేడు ఆయనను టాలీవుడ్‌లో గుర్తింపు ఉన్న నటుడిగా నిలబెట్టాయి.
ఇటీవల సుమంత్ హీరోగా నటించిన `మహేంద్రగిరి వరాహి` అనే యాక్షన్ అడ్వెంచర్ మైథలాజికల్ థ్రిల్లర్ చిత్రంలో కూడా వడ్లమాని శ్రీనివాస్ ఒక ముఖ్యమైన పాత్రలో నటించారు. ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో- విద్యార్థుల్లో విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కేవలం ర్యాంకుల చుట్టూనే తిరిగే నేటి విద్యా వ్యవస్థ, విద్యార్థుల ధోరణిపై ఆయన తనదైన శైలిలో స్పందించారు.
ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ.. ``ఈ మధ్య ఎంసెట్‌లో మొదటి ర్యాంక్ వచ్చిన ఒక కుర్రాడిని సుభాష్ చంద్రబోస్ ఎవరు? అని అడిగితే విజయవాడలోని `బోస్ ట్రావెల్స్` బస్సు అని చెప్పాడు. ఎందుకంటే వాళ్లు ఎప్పుడూ పుస్తకాలు, ర్యాంకుల గోలలోనే పడి ఏడుస్తుంటారు తప్ప బయటి ప్రపంచాన్ని, సినిమాలను, ఆటలను పట్టించుకోరు. నేనూ ఆ చదువులే చదివి కలెక్టర్ దాకా వచ్చి.. చివరకు సినిమాలో తండ్రి పాత్రలు వేసుకుంటున్నాను. జీవితం ఎట్నుంచి ఎటైనా తీసుకెళ్లొచ్చు కాబట్టి.. కేవలం మార్కుల కోసం కాకుండా సర్వతోముఖాభివృద్ధి (కాంప్రిహెన్సివ్) సాధించేలా చదువుకోవాలి`` అని హితవు పలికారు.
తన జీవిత ప్రయాణమే ఒక ఉదాహరణగా నిలుస్తుండటంతో వడ్లమాని శ్రీనివాస్ చెప్పిన మాటలు సమాజంలో ఆలోచన రేకెత్తిస్తున్నాయి. చదువుతో పాటు ప్రాపంచిక పరిజ్ఞానం, కళలు, వ్యక్తిత్వ వికాసం ఎంత ముఖ్యమో ఆయన తన ప్రసంగం ద్వారా స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి నటననే నమ్ముకుని విజయవంతమైన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న వడ్లమాని శ్రీనివాస్ కథ నేటి యువతకు ఎంతో స్ఫూర్తిదాయకం.
