Begin typing your search above and press return to search.

కమెడియన్ కొత్త ఇల్లు విలువ రూ.100 కోట్లు.. అందులో ఏకంగా అన్ని కెమెరాలు!

కానీ వడివేలు కొత్త ఇంటిలో మాత్రం సంప్రదాయ తమిళ నిర్మాణ శైలికి ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది.

By:  Priya Chowdhary Nuthalapti   |   28 Oct 2026 9:00 PM IST
కమెడియన్ కొత్త ఇల్లు విలువ రూ.100 కోట్లు.. అందులో ఏకంగా అన్ని కెమెరాలు!
X

తమిళ సినీ పరిశ్రమలో తనదైన కామెడీతో ప్రేక్షకులను నవ్వించిన నటుడు వడివేలు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయనను అభిమానులు ముద్దుగా వైగై పుయల్ అని పిలుస్తారు. తన కామెడీతో ఎన్నో సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న వడివేలు ఇప్పుడు తన కొత్త ఇంటితో వార్తల్లో నిలిచారు. ఈ ఇంటి ప్రత్యేకతలు, అందులో ఉన్న సౌకర్యాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ భవనం విలువ సుమారు రూ.100 కోట్లు ఉంటుందని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే ఈ ధర అధికారికంగా నిర్ధారణ కాలేదు.

సాధారణంగా సెలబ్రిటీల ఇళ్లు ఆధునిక హంగులతో, ప్రత్యేకమైన డిజైన్లతో కనిపిస్తుంటాయి. కానీ వడివేలు కొత్త ఇంటిలో మాత్రం సంప్రదాయ తమిళ నిర్మాణ శైలికి ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. పాతకాలపు ఇళ్లలో కనిపించే విధంగా ఇంటి ముందు విశాలమైన వరండా ఉంది. దీనిని తమిళంలో తిన్నై అని పిలుస్తారు. గతంలో ఇలాంటి ప్రదేశాల్లో ఇంటికి వచ్చిన అతిథులు కూర్చుని మాట్లాడుకునేవారు.

ఈ ఇంటిలో వినాయకుడి విగ్రహం కూడా ఉంది. ఇది ఆ ఇంటికి ఆధ్యాత్మిక వాతావరణాన్ని అందిస్తోంది. సంప్రదాయానికి ప్రాధాన్యం ఇస్తూనే ఆధునిక సౌకర్యాలు ఉండేలా ఈ ఇంటిని నిర్మించినట్లు తెలుస్తోంది.

వడివేలు ఇంటిలో సౌర విద్యుత్ ప్యానెల్స్ ఏర్పాటు చేసినట్లు సమాచారం. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు ఉపయోగపడేలా ఇన్వర్టర్ సదుపాయం కూడా ఉంది. ఇంటి భద్రత కోసం సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ ఇంట్లో దాదాపు 42 సీసీ కెమెరాలు ఉన్నాయి అంట. కార్లను పార్క్ చేసేందుకు ప్రత్యేక స్థలం కూడా ఉంది.

ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ ఇంటి ప్రాంగణంలోనే వడివేలు కోసం ప్రత్యేకంగా కార్యాలయ గదిని ఏర్పాటు చేసినట్లు సమాచారం. దీనివల్ల ఆయన తన వ్యక్తిగత పనులు, ఇతర కార్యక్రమాలకు సంబంధించిన పనులను ఇంటి నుంచే చూసుకోవచ్చు.

మరోవైపు వడివేలు సినిమాలతోనూ బిజీగా ఉన్నారు. నాయ్ శేఖర్ రిటర్న్స్, చంద్రముఖి 2, మామన్నన్, మారీసన్ వంటి చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా మామన్నన్, మారీసన్ సినిమాల్లో ఆయన తనలోని మరో నటుడిని ప్రేక్షకులకు పరిచయం చేశారు. కేవలం కామెడీ పాత్రలకే పరిమితం కాకుండా భావోద్వేగాలతో కూడిన పాత్రల్లోనూ మెప్పించగలరని నిరూపించారు.

ప్రస్తుతం బ్యాంగ్ బ్యాంగ్, D56 వంటి ప్రాజెక్టులతో ఆయన పేరు వినిపిస్తోంది. మొత్తానికి, సంప్రదాయ నిర్మాణ శైలి, పచ్చని తోట, ఆధునిక సౌకర్యాలతో వడివేలు కొత్త ఇల్లు ఇప్పుడు సినీ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.