Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ: ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు

సీనియర్ నటుడు వడ్డే నవీన్ చాలా గ్యాప్ తర్వాత లీడ్ రోల్ చేసిన సినిమా.. ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. ఆయనే నిర్మించిన ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు కమల్ తేజ రూపొందించాడు. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

By:  Prakash Chimmala   |   19 Jun 2026 8:45 PM IST
మూవీ రివ్యూ: ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు
X

‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ మూవీ రివ్యూ

నటీనటులు: వడ్డే నవీన్- రాశి సింగ్- శిల్పా తులాస్కర్- ఆడుగళం నరేన్- దేవీ ప్రసాద్- బాబా భాస్కర్ తదితరులు

సంగీతం: కళ్యాణ్ నాయక్

ఛాయాగ్రహణం: కార్తీక్ సుజాత సాయికుమార్

నిర్మాత: వడ్డే నవీన్

రచన-దర్శకత్వం: కమల్ తేజ

ఒకప్పుడు 'పెళ్ళి'.. 'చాలా బాగుంది' సహా కొన్ని మంచి సినిమాలతో మెప్పించిన సీనియర్ నటుడు వడ్డే నవీన్ చాలా గ్యాప్ తర్వాత లీడ్ రోల్ చేసిన సినిమా.. ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. ఆయనే నిర్మించిన ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు కమల్ తేజ రూపొందించాడు. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ: త్రిమూర్తులు ఆంధ్ర ప్రాంతంలో ఒక కానిస్టేబుల్. తన నిజాయితీ.. ముక్కుసూటి తనం వల్ల ఏ పోలీస్ స్టేషన్లోనూ అతను కొన్ని నెలలకు మించి ఉండడు. బదిలీ అయిపోతుంటాడు. అలా అమలాపురం వచ్చిన అతను.. ఒక సభ సందర్భంగా ఏకంగా ముఖ్యమంత్రినే ఇబ్బంది పెట్టడంతో అరకు ప్రాంతానికి బదిలీ అవుతాడు. అక్కడ పాడుబడే స్థితిలో ఉన్న పాత పోలీస్ స్టేషన్లో పాత ఫైళ్ల దుమ్ముదులిపే క్రమంలో అతడి దృష్టి 20 ఏళ్ల నాటి ఒక కేసు మీద పడుతుంది. ఆ కేసుతో పోలీసే అయిన తన తండ్రికి సంబంధం ఉన్నట్లు తేలడంలో త్రిమూర్తులు.. దాని మీద పరిశోధన మొదలుపెడతాడు. ఈ క్రమంలో కొన్ని సంచలన విషయాలు తెలుస్తాయి. ఆ విషయాలేంటి.. ఈ కేసును త్రిమూర్తులు ఛేదించాడా లేదా అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ: ఒకప్పుడు వడ్డే నవీన్ హీరోగా నటించిన సినిమాలను పరిశీలిస్తే.. అతనెప్పుడు ఒక ఇమేజ్ ఛట్రంలో ఇరుక్కుపోలేదని అర్థమవుతుంది. తెరపై తన పాత్రలను ప్రెజెంట్ చేసిన తీరు గమనిస్తే వేటిలోనూ తనో స్టార్ అనే బిల్డప్ కనిపించదు. అతను కుర్రాడిగా ఉండగా.. హీరోగా తనకంటూ ఒక మార్కెట్ ఉన్నపుడు.. కెరీర్లో మంచి ఊపులో సాగినపుడు కూడా అతను సోకాల్డ్ మాస్ హీరోల్లా తనను ప్రెజెంట్ చేసుసుకోవడానికి ప్రయత్నించలేదు. అలాంటిది ఇప్పుడు నడి వయస్సులో ఉండగా.. కెరీర్లో చాలా గ్యాప్ వచ్చాక.. ప్రేక్షకులు మరిచిపోయిన టైంలో చేసిన సినిమాలో తన స్వీయ నిర్మాణంలో తెరకెక్కిన చిత్రంలో వడ్డే నవీన్ ను తెరపై చూపించిన తీరు చూస్తే ఆశర్యం కలగక మానదు. నవీన్ కనిపించినపుడల్లా చెవుల తుప్పు వదిలించేలా హీరోయిక్ బీజీఎం.. తనకో ఇంట్రో సాంగ్.. అందులో వీర లెవెల్లో స్టెప్పులు.. ప్రతి అరగంటకో యాక్షన్ ఘట్టం. అందులో ఎక్కడ లేని హీరోయిజం.. కథానాయికతో ఒక డ్యూయెట్టు.. బార్ సెటప్ లో ఐటెం సాంగ్.. ఇలా ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’లో చెప్పలేనివి కాని ‘కమర్షియల్’ విన్యాసాలు ఎన్నో.

ఇప్పుడున్న పెద్ద స్టార్ల సినిమాల్లోనూ ఇలాంటి మూస పద్ధతులను ప్రేక్షకులు తిప్పి కొడుతుంటే.. టాప్ స్టార్లు కూడా ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి సినిమాలు చేస్తుంటే.. వడ్డే నవీన్ ఇప్పుడొచ్చి ఇలాంటి విన్యాసాలను ప్రదర్శించడంలో ఔచిత్యమేంటో అర్థం కాదు. ఎంచుకున్నది కొంచెం భిన్నమైన కథే అయినా.. దాన్ని ప్రెజెంట్ చేసిన తీరు తేలిపోవడంతో ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ ప్రేక్షకులకు ఏ రకమైన కొత్త అనుభూతినీ పంచలేకపోయింది. దర్శకుడు కమల్ తేజ ఎంచుకున్నదేమో థ్రిల్లర్ కథ. కానీ దాన్ని నడిపించిందేమో కమర్షియల్ స్టయిల్లో. అందులోనూ ప్రేక్షకులు దాదాపుగా మరిచిపోయిన హీరోను తీసుకొచ్చి ఒక సూపర్ స్టార్ తరహాలో ప్రెజెంట్ చేయాలని చూడడంతో ఈ సినిమా చాలా కృత్రిమంగా తయారైంది. థ్రిల్లర్ కథలంటే మోహన్ లాల్.. వెంకటేష్ లాంటి లాంటి టాప్ స్టార్లు సైతం బిల్డప్పులన్నీ పక్కన పెట్టి ఎలా సింపుల్ గా పాత్రల్లో ఒదిగిపోతారో ‘దృశ్యం’. సిరీస్ తరహా సినిమాల్లో చూశాం. కానీ ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ దర్శకుడు మాత్రం ఇందులో కథ చెప్పడం కంటే వడ్డే నవీన్ షో రీల్ మీదే ఎక్కువ ఫోకస్ పెట్టాడు. అక్కడే ఈ సినిమా గాడి తప్పేసింది.

దీనికి తోడు ఏమాత్రం రియలిస్టిగ్గా అనిపించని పాత్రలు.. సీన్లు కూడా సినిమా ఇంపాక్టును తగ్గించేశాయి. ఒక ముఖ్యమంత్రి ఒక పెద్ద ప్లానేసుకుని రంగంలోకి దిగితే ఒక మామూలు కానిస్టేబుల్ ఆ ప్రణాళికను ఛిద్రం చేసేయడం.. సీఎం చేతిలో ఉన్న వ్యవస్థ మొత్తం రంగంలోకి దిగినా ఆ చిన్న పోలీసును పట్టుకోలేక తంటాలు పడడం.. ఇదంతా ఏమాత్రం నమ్మశక్యంగా అనిపించదు. కథకు కీలకమైన ఆయా సన్నివేశాలను కన్విన్సింగ్ గా చెప్పే ప్రయత్నం చేయకుండా వాటిలో హీరో ఎలివేషన్ల కోసం ట్రై చేయడం.. అసందర్భంగా వచ్చి పడే పాటలు-ఫైట్లు సినిమా నడతను దెబ్బ తీశాయి. ఐతే ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’లో చెప్పాలనుకున్న అసలు పాయింటు మాత్రం ఓకే అనిపిస్తుంది. ఒక పాత కేసు చుట్టూ నడిపిన డ్రామా పర్వాలేదు. ద్వితీయార్దంలో హీరో వేసే కొన్ని ఎత్తుగడలు.. చివర్లో కాసేపు ఎంగేజింగ్ గా సాగే కోర్ట్ రూం డ్రామా.. పతాక సన్నివేశాల్లో వచ్చే ట్విస్టు ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’లో చెప్పుకోదగ్గ అంశాలు. కానీ వీటి మీదే ఫోకస్ పెట్టి హీరో పాత్రకు బిల్డప్ అంతా తీసేసి కథ ప్రధానంగా సినిమాను నడిపించి ఉంటే ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ ట్రెండీ సినిమాగా తయారయ్యేది. కానీ కమర్షియల్ మసాలాలు అద్ది ఔట్ డేటెడ్ స్టయిల్లో నరేట్ చేయడం మంచి ఐడియాను పాడు చేసినట్లయింది.

నటీనటులు: వడ్డే నవీన్ కథను అనుసరించి సాగే సన్నివేశాల్లో బాగానే పెర్ఫామ్ చేశాడు. వయసు ప్రభావం పెద్దగా కనిపించకుండా మంచి లుక్ లోనే కనిపించాడు కానీ.. కెరీర్లో ఈ దశలో తనను ఒక స్టార్ లా ప్రెజెంట్ చేసుకోకుండా ఉండాల్సింది. ఆయన డ్యాన్సులు.. ఫైట్లు ఏవీ కూడా వర్కవుట్ కాలేదు. రాశి సింగ్ పాత్ర పరిధి చాలా తక్కువ. ఆమె నటన పర్వాలేదు. ‘హాయ్ నాన్న’ ఫేమ్ శిల్పా తులాస్కర్ సీఎం పాత్రలో పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయింది. ఆడుగళం నరేన్ బాగా చేశాడు. పోలీస్ పాత్రలో దేవీ ప్రసాద్ చక్కగా నటించాడు. ఏసీపీ పాత్రలో చేసిన నటుడి ఓవరాక్షన్ మామూలుగా లేదు. మిగతా ఆర్టిస్టులంతా మామూలే.

సాంకేతిక వర్గం: కళ్యాణ్ నాయక్ పాటలు రొటీన్ గా సాగిపోయాయి. బీజీఎం కొన్ని చోట్ల బాగుంది. కొన్ని చోట్ల అతిగా అనిపిస్తుంది. కార్తీక్ సుజాత సాయికుమార్ ఛాయాగ్రహణం మామూలుగా సాగిపోయింది. నిర్మాతగా వడ్డే నవీన్ రాజీ పడలేదు. ఈ కథకు అవసరమైన మేర ఖర్చు పెట్టాడు. రైటర్ కమ్ డైరెక్టర్ కమల్ తేజ ఎంచుకున్న కథ ఓకే కానీ.. దానికి సరిపడే కథనాన్ని జోడించలేకపోయాడు. అక్కడక్కడా కొన్ని మెరుపులున్నప్పటికీ ఓవరాల్ గా దర్శకుడు నిరాశపరిచాడు. మలయాళం థ్రిల్లర్లను నెత్తిన పెట్టుకుంటారని మన ప్రేక్షకుల మీద కౌంటర్లు వేసే దర్శకులు వాళ్లు.. వాళ్లు ఆ కథలను డీవియేషన్ లేకుండా ఎంత పకడ్బందీగా చెబుతారో అర్థం చేసుకోవాలి. అందుకు పూర్తి భిన్నంగా ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ను నడిపించాడు దర్శకుడు.

చివరగా: బోరింగ్ త్రిమూర్తులు

రేటింగ్-2/5