భర్తల లైఫ్ లోకి మూడో వ్యక్తి వస్తే.. జగ్గూ 'వదలా' ట్రైలర్
సీనియర్ యాక్టర్ జగపతిబాబు లీడ్ రోల్ లో రూపొందిన సైకాలజికల్ ఫ్యామిలీ థ్రిల్లర్ 'వదలా' విడుదలకు సిద్ధమవుతోంది.
By: M Prashanth | 9 July 2026 1:33 PM ISTసీనియర్ యాక్టర్ జగపతిబాబు లీడ్ రోల్ లో రూపొందిన సైకాలజికల్ ఫ్యామిలీ థ్రిల్లర్ 'వదలా' విడుదలకు సిద్ధమవుతోంది. దర్శకుడు అకెళ్ల వి. కృష్ణ తెరకెక్కించిన ఆ మూవీ జులై 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే టీజర్ తో ఆసక్తి రేకెత్తించిన ఆ సినిమా.. తాజాగా విడుదలైన ట్రైలర్ తో మరింత హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా భార్యాభర్తల జీవితంలో మూడో వ్యక్తి వస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే అంశాన్ని థ్రిల్లింగ్ గా చూపించడం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.
ట్రైలర్ ను పరిశీలిస్తే.. ఇరవై ఏళ్లుగా ఆనందంగా దాంపత్య జీవితం గడుపుతున్న దంపతులుగా జగపతిబాబు, లయ కనిపిస్తారు. ఒకరిపై ఒకరికి చాలా ప్రేమతో జీవిస్తున్న వారి కుటుంబంలోకి ఓ యువతి ప్రవేశించడం కథలో కీలక మలుపుగా మారుతుంది. ఆ యువతి జగపతిబాబు పాత్రపై వ్యామోహం పెంచుకోవడం, దాని ఎఫెక్ట్ ఫ్యామిలీపై పడటం, ఆ తర్వాత వరుసగా జరిగే సంఘటనలు కథను థ్రిల్లింగ్ గా మలిచినట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.
భార్యాభర్తల మధ్య అనుమానాలు, గొడవలు పెరగడం, కుటుంబ సభ్యులకు ప్రమాదం ఏర్పడటం, గుర్తు తెలియని బెదిరింపులు రావడం వంటి అంశాలను దర్శకుడు సస్పెన్స్ తో మిక్స్ చేసినట్లు కనిపిస్తోంది. చివరి వరకు అసలు ఆ యువతి ఉద్దేశం ఏమిటి? ఆమె ఎందుకు ఆ ఫ్యామిలీని లక్ష్యంగా చేసుకుంది? అనే ప్రశ్నలను ట్రైలర్ ప్రేక్షకుల్లో రేకెత్తించింది. జగపతిబాబు మరోసారి హుందా నటనతో ఆకట్టుకునేలా కనిపిస్తున్నారు. కుటుంబాన్ని కాపాడేందుకు పోరాడే వ్యక్తిగా ఆయన పాత్రలో ఎమోషన్స్ తో పాటు సస్పెన్స్ కూడా కనిపిస్తోంది.
లయ చాలా కాలం తర్వాత జగపతిబాబుతో జోడీ కట్టగా.. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ నేచురల్ గా అనిపించేలా ట్రైలర్ లో చూపించారు. ఒకప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆ జంట మరోసారి స్క్రీన్ పై అదే ఎక్స్పీరియన్స్ కలిగించేలా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక హృతిక శ్రీనివాస్ పోషించిన పాత్ర ట్రైలర్ కు మెయిన్ అట్రాక్షన్ గా నిలిచింది. వ్యామోహంతో నడిచే యువతి పాత్రలో ఆమె ఎక్స్ప్రెషన్స్, యాక్టింగ్ కథపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఆ పాత్ర చుట్టూనే సినిమా ట్విస్టులు తిరిగే అవకాశమున్నట్లు ట్రైలర్ క్లారిటీ ఇస్తోంది.
టెక్నికల్ గా కూడా వదలా మూవీ ఆకట్టుకునేలా కనిపిస్తోంది. సినిమాటోగ్రఫీలో డార్క్ టోన్స్, విజువల్ ఫ్రేమింగ్ కథలోని థ్రిల్లర్ ఎన్విరాన్మెంట్ ను స్ట్రాంగ్ చూపించాయి. కార్తీక్ బి. కొడకండ్ల అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రతి సీన్ లో సస్పెన్స్ ను మరింత పెంచింది. సస్పెన్స్ ను చివరి వరకు కొనసాగించేలా ట్రైలర్ కట్ చేసిన తీరు కూడా సినిమాపై అంచనాలను పెంచుతోంది.
ఏదేమైనా ఫ్యామిలీ ఎమోషన్స్, సైకాలజికల్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో రూపొందించిన చిత్రంగా వదలా కనిపిస్తోంది. భార్యాభర్తల లైఫ్ లోకి మూడో వ్యక్తి ఎంట్రీ ఇచ్చిన తర్వాత జరిగే సిచ్యువేషన్స్ ను దర్శకుడు ఎలా చూపించాడన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ట్రైలర్ కు వస్తున్న రెస్పాన్స్ చూస్తే.. జులై 17న విడుదల కానున్న ఆ మూవీ థ్రిల్లర్ అభిమానుల దృష్టిని ఆకర్షించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
