Begin typing your search above and press return to search.

తెలుగులో రాకుండానే ఓటీటీలోకి.. ఇదెక్కడి ట్విస్ట్?

కానీ ఇప్పుడు ఓ మూవీ.. థియేటర్ లోకి వచ్చేందుకు రెడీ అయినా కొన్ని కారణాల వల్ల ప్రేక్షకుల ముందుకు రాలేదు.

By:  M Prashanth   |   27 Jan 2026 10:00 PM IST
తెలుగులో రాకుండానే ఓటీటీలోకి.. ఇదెక్కడి ట్విస్ట్?
X

సాధారణంగా చాలా సినిమాలు.. థియేటర్స్ లో రిలీజ్ అయిన కొన్ని రోజులకు ఓటీటీలోకి వస్తాయన్న విషయం తెలిసిందే. ఇంకా కొన్ని చిత్రాలు.. కేవలం ఓటీటీలోనే విడుదల అవుతుంటాయి. కానీ ఇప్పుడు ఓ మూవీ.. థియేటర్ లోకి వచ్చేందుకు రెడీ అయినా కొన్ని కారణాల వల్ల ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి వస్తుంది. మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్ అవ్వనుంది.

అదేం సినిమా అంటే.. అన్నగారు వస్తారు (వా వాతియార్). కోలీవుడ్ స్టార్ హీరో కార్తి, ఉప్పెన కృతి శెట్టి లీడ్ రోల్స్ లో మాస్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఆ సినిమా.. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కింది. నలన్ స్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రాన్ని స్టూడియో గ్రీన్‌ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా నిర్మించారు. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన సినిమా.. అనేక కారణాల వల్ల లేట్ అవుతూ వచ్చింది.

ముఖ్యంగా ఫైనాన్షియల్ సమస్యల కారణంగా సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ.. జనవరి 14 న రిలీజ్ అయింది. అది కూడా తమిళ భాషలో మాత్రమే. తెలుగులో కూడా విడుదల అవుతుందని అనుకుంటే.. సంక్రాంతి పోటీ ఎక్కువగా ఉండడం వల్ల తప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే తమిళంలో రిలీజ్ అయ్యాక.. తెలుగులో కూడా సినిమా సందడి చేయనుందని అంతా అంచనా వేశారు.

కానీ తమిళంలో సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దీంతో తెలుగులో రిలీజ్ చేయడం ఎందుకు అనుకున్నారో ఏమో కానీ మేకర్స్ ఏకంగా ఓటీటీ బాట పట్టారు. తమిళంలో రిలీజ్ అయ్యి రెండు వారాలు కూడా కాకముందే అన్న గారు మూవీ.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది. అయితే రిలీజ్ కు ముందే.. వా వాతియార్ ఓటీటీ రైట్స్ ను ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది.

ఇప్పుడు జనవరి 28వ తేదీ నుంచి సినిమా అమెజాన్ లో స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో కూడా స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అమెజాన్ ప్రైమ్ సోషల్ మీడియాలో వెల్లడించింది. దీంతో ఆ విషయం వైరల్ గా మారింది. ఏదేమైనా అన్నగారు.. తెలుగులో రాకుండానే ఓటీటీలోకి వచ్చేస్తున్నారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

అయితే థియేటర్ రిలీజ్ టైమ్ లో తమిళంలో ఎలాంటి పోటీ లేకపోయినా.. వా వాతియార్ మూవీ ఎలాంటి ప్రభావం చూపించలేకపోయింది. పండుగ సెలవులు అయినా కూడా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో విఫలమైంది. ఇప్పుడు తక్కువ టైమ్ లోనే ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుంది. మరి థియేటర్ లో ఆశించిన ఫలితాన్ని అందుకోని అన్నగారు.. ఓటీటీలో ఇప్పుడు ఎలాంటి రిజల్ట్ అందుకుంటారో వేచి చూడాలి.