Begin typing your search above and press return to search.

ప‌వ‌ర్‌స్టార్‌తో 'క‌ల నెర‌వేరింది'.. ఉస్తాద్ వేడుక‌లో మైత్రి నిర్మాత‌లు!

హైద‌రాబాద్ లో జ‌రిగిన `ఉస్తాద్ భగత్ సింగ్` ప్రీ-రిలీజ్ వేడుకలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ యెర్నేని - రవిశంకర్ యలమంచిలి ఎమోష‌న‌ల్ స్పీచ్ ఆద్యంతం ఆక‌ట్టుకుంది.

By:  Sivaji Kontham   |   16 March 2026 10:18 AM IST
ప‌వ‌ర్‌స్టార్‌తో క‌ల నెర‌వేరింది.. ఉస్తాద్ వేడుక‌లో మైత్రి నిర్మాత‌లు!
X

హైద‌రాబాద్ లో జ‌రిగిన `ఉస్తాద్ భగత్ సింగ్` ప్రీ-రిలీజ్ వేడుకలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ యెర్నేని - రవిశంకర్ యలమంచిలి ఎమోష‌న‌ల్ స్పీచ్ ఆద్యంతం ఆక‌ట్టుకుంది. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ తో సినిమా తీయాల‌నే క‌ల ఈ చిత్రంతో నెర‌వేర‌డం ఆనందంగా ఉంద‌ని అన్నారు.

నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ.. తాము సినీ పరిశ్రమలోకి వచ్చిన తొలినాళ్ల నుంచి పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయాలనేది ఒక పెద్ద కల అని.. ఆ కోరిక నెరవేరుతుండటం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ప్రజాసేవలో అత్యంత బిజీగా ఉన్నా కానీ.. తమకు ఇచ్చిన మాట ప్రకారం ఈ సినిమాను పూర్తి చేసినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత సినిమా పూర్తి చేయడంపై తాము సందిగ్ధంలో ఉన్నప్పుడు.. ఆయనే స్వయంగా ధైర్యం చెప్పి షూటింగ్‌లో పాల్గొన్నారని గుర్తుచేసుకున్నారు.

ఈ ప్రాజెక్ట్ ప్రారంభం నుంచే దీనికి హరీష్ శంకర్ దర్శకుడిగా ఉండాలని కోరుకున్నామని.. ఆయన `గబ్బర్ సింగ్`ను మించేలా ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని నవీన్ ప్రశంసించారు. ఇది పక్కా పవన్ కళ్యాణ్ మార్క్ ఎంటర్‌టైనర్ అని.. మార్చి 19న థియేటర్లలో అభిమానులందరూ ఈ చిత్రాన్ని చూసి ఎంజాయ్ చేయాలని ఆయన ఆకాంక్షించారు.

నిర్మాత రవిశంకర్ యలమంచిలి మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయలేదనే వెలితి తమకు ఎప్పటి నుంచో ఉండేదని .. `ఉస్తాద్ భగత్ సింగ్`తో ఆ వెలితి పూర్తిగా తీరిపోయిందని నిర్మాత రవిశంకర్ ఎమోషనల్ అయ్యారు. ప్రజాసేవలో ఉండి కూడా పవన్ కళ్యాణ్ రాత్రులు నిద్రపోకుండా షూటింగ్‌లో పాల్గొని ఈ సినిమాను పూర్తి చేశారని.. ఆయన కష్టం ముందు తమ కృషి చాలా చిన్నదని కొనియాడారు. గబ్బర్ సింగ్ నాటి మ్యాజిక్ రిపీట్ చేసేలా హరీష్ శంకర్ ఈ చిత్రాన్ని అభిమానుల అభిరుచికి తగ్గట్టుగా మలిచారని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.

పవన్ కళ్యాణ్ కేవలం హీరోగానే కాకుండా తమలో గొప్ప స్ఫూర్తిని నింపారని రవిశంకర్ పేర్కొన్నారు. ఆయనతో ప్రయాణం చేస్తే నలుగురికి సాయం చేయాలనే ఆలోచన కలుగుతుందని..ఆ స్ఫూర్తితోనే తాను ఇటీవల కొందరికి సహాయం చేశానని వెల్లడించారు. పవన్ తమకు చాలా ప్రత్యేకమని.. ఆయన వ్యక్తిత్వం పట్ల తమకున్న గౌరవాన్ని ఈ సందర్భంగా చాటుకున్నారు.

సినిమా షేప‌ప్ అయిన విధానంపై తాము చాలా ధీమాగా ఉన్నామని.. ఈ మధ్య కాలంలో తాను చూసిన బెస్ట్ కమర్షియల్ ఫిల్మ్ ఇదేనని రవిశంకర్ అన్నారు. ప్రారంభం నుండి చివరి దాకా ప్రేక్షకులను అలరించే అద్భుతమైన ఎంటర్‌టైన్మెంట్ ఈ సినిమాలో ఉంటుందని.. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు , అభిమానులు ఈ చిత్రాన్ని ఆదరిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

తారాగణం- సాంకేతిక బృందం:

మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల, రాశి ఖన్నా కథానాయికలుగా నటించగా, పార్థిబన్ కీలక పాత్ర పోషించారు. కేఎస్ ర‌వికుమార్ ఓ అతిథి పాత్ర‌లో న‌టించారు. హరీష్ శంకర్ ఎస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందించగా, ఎస్. తమన్ నేపథ్య సంగీతాన్ని సమకూర్చారు.