ఉస్తాద్ షూటింగ్.. గొడవేంటి?
అదే సమయంలో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ జరుగుతున్న అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద నేడు ఉదయం వాగ్వాదం చోటు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
By: M Prashanth | 4 Aug 2025 5:14 PM ISTటాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. రాజకీయ కార్యకలాపాల్లో బిజీగా ఉన్నా.. తాను ఇప్పటికే ఓకే చెప్పిన సినిమాలను కంప్లీట్ చేస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ కాగా.. ఆ తర్వాత ఓజీని పూర్తి చేశారు. మరికొద్ది రోజుల్లో ఆ సినిమా విడుదల అవ్వనుండగా.. ఇప్పడు ఉస్తాద్ భగత్ సింగ్ షూట్ లో పాల్గొంటున్నారు.
స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా.. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఇప్పుడు షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు మేకర్స్.
అదే సమయంలో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ జరుగుతున్న అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద నేడు ఉదయం వాగ్వాదం చోటు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. పలువురు ఫిలిం ఫెడరేషన్ నాయకులు అక్కడ నిరసన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సమాచారం.
అయితే ఫిలిం ఫెడరేషన్ నాయకులు నేటి నుంచి బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. సినీ కార్మికులను ఇవాళ్టి నుంచి షూటింగ్స్ కు వెళ్లొద్దని, 30 శాతం వేతనాలు పెంచితే తప్ప షూటింగ్స్ కి వెళ్లొద్దని తెలిపింది. వేతనాలు పెంచాలన్న డిమాండ్ కు సరైన స్పందన లేకపోవడంతో ఆ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటన విడుదల చేసింది.
అదే సమయంలో షూటింగ్ కు బ్రేక్ ఇవ్వడానికి ఇష్టపడని ఉస్తాద్ మేకర్స్.. చెన్నై, ముంబయి సహా పలు ప్రాంతాల నుంచి సినీ కార్మికులను తెప్పించుకుని చిత్రీకరణ జరుపుతున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో ఫిలిం ఫెడరేషన్ నాయకులు అక్కడికి చేరుకుని నిరసన తెలపడంతో మేకర్స్ తో వాగ్వాదం జరిగిందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
ఆ సమయంలో పవన్ సెట్స్ లో ఉన్నారో లేదో క్లారిటీ లేదు. కానీ ఫిలిం ఫెడరేషన్ నాయకులు మాత్రం పవన్ ను కలుస్తామని నినదించినట్లు తెలుస్తోంది. తమ కష్టం పవన్ కు తెలుసని, అందుకే కలుస్తామని అన్నారని సమాచారం. ఇందులో నిజమెంత ఉందో మాత్రం తెలియదు. కానీ సోషల్ మీడియా, సినీ వర్గాల్లో ఫుల్ గా ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.
