ఉస్తాద్ హంగామా హైదరాబాద్‌లోనే..
ఈ వేడుకకు పవర్ స్టార్ స్వయంగా హాజరవుతుండటంతో పాటు సినిమాలోని ప్రధాన నటీనటులు సాంకేతిక నిపుణులు కూడా రానున్నారు.
By: M Prashanth | 13 March 2026 1:43 PM ISTపవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ అంటేనే ఒక హై వోల్టేజ్ వైబ్రేషన్. వీరిద్దరూ కలిసి చేసిన ‘గబ్బర్ సింగ్’ అప్పట్లో బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ అదే మ్యాజిక్‌ను రిపీట్ చేయడానికి సిద్ధమవుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం ప్రమోషన్ల విషయంలో స్పీడ్ పెంచింది. ఈ సినిమాకు సంబంధించిన అత్యంత కీలకమైన ప్రీ-రిలీజ్ వేడుకను ఈ నెల 15వ తేదీన ఆదివారం సాయంత్రం 5 గంటల నుండి గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు.
ఇందుకు హైదరాబాద్‌లోని యుసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్ వేదిక కానుంది. సాధారణంగా పవన్ కళ్యాణ్ ఈవెంట్ అంటే అభిమానుల తాకిడి ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే మేకర్స్ యుసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌ను ఎంచుకున్నారు. ఈ వేడుకకు పవర్ స్టార్ స్వయంగా హాజరవుతుండటంతో పాటు సినిమాలోని ప్రధాన నటీనటులు సాంకేతిక నిపుణులు కూడా రానున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ ఈ కార్యక్రమాన్ని కేవలం ఒక ఈవెంట్‌లా కాకుండా, మెగా అభిమానులకు ఒక భారీ పండగలా ఉండేలా భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఈ గ్రౌండ్స్‌లో స్టేజ్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా నుండి ఇటీవల విడుదలైన సాంగ్ టీజర్ ఇప్పటికే సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన ఎనర్జిటిక్ మ్యూజిక్ కు ఈ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ చేసే ప్రసంగం తోడైతే ఇక అంచనాలు మామూలుగా ఉండవు.
హరీష్ శంకర్ పవన్‌ను ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా చూపిస్తూనే, ఆయన అసలు సిసలైన మాస్ యాటిట్యూడ్‌ను ఎలా ఎలివేట్ చేశారో ఈ వేడుకలో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. సినిమా రిలీజ్ కు ముందు ఫ్యాన్స్ లో పూనకాలు తెప్పించేలా ఒక స్పెషల్ ట్రైలర్ ను కూడా ఇక్కడే విడుదల చేసే ఆలోచనలో టీమ్ ఉంది. నిజానికి చాలా కాలం తర్వాత పవన్ కంప్లీట్ ఎనర్జీతో కనిపిస్తున్న సినిమా కావడంతో డిస్ట్రిబ్యూటర్లలో కూడా పోటీ నెలకొంది.
ఈ ఈవెంట్ ద్వారా సినిమాపై ఉన్న బజ్‌ను మరింత పెంచి, బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి ఓపెనింగ్స్ రాబట్టాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఆదివారం సెలవు రోజు కావడంతో నగరంలోని అభిమానులతో పాటు ఇతర ప్రాంతాల నుండి కూడా వేల సంఖ్యలో మెగా ఫ్యాన్స్ తరలివచ్చే అవకాశం ఉంది. భద్రతా పరంగా కూడా పోలీస్ గ్రౌండ్స్ కావడంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈవెంట్ సక్సెస్ అవుతుందని భావిస్తున్నారు. మార్చి 19న ఉగాది కానుకగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకుని ‘క్లీన్ మాస్ ఎంటర్‌టైనర్’ అనిపించుకున్న ఉస్తాద్, థియేటర్లలో ఎటువంటి విధ్వంసం సృష్టిస్తుందో చూడాలి.
