Begin typing your search above and press return to search.

'ఇంటింటికీ వెళ్లి చెప్పలేను కదా'.. ఆ రూమర్స్ పై హరీష్ ఇలా..

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై గత కొంతకాలంగా వస్తున్న రీమేక్ రూమర్లపై దర్శకుడు హరీష్ శంకర్ మరోసారి రెస్పాండ్ అయ్యారు.

By:  M Prashanth   |   14 March 2026 6:16 PM IST
ఇంటింటికీ వెళ్లి చెప్పలేను కదా.. ఆ రూమర్స్ పై హరీష్ ఇలా..
X

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై గత కొంతకాలంగా వస్తున్న రీమేక్ రూమర్లపై దర్శకుడు హరీష్ శంకర్ మరోసారి రెస్పాండ్ అయ్యారు. ఆ మూవీ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన తెరి సినిమాకి రీమేక్ అని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం హరీష్ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

మార్చి 19న ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ కానుండగా.. హరీష్ శంకర్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా.. 'అందరూ ఉస్తాద్ భగత్ సింగ్ అనేది తెరి రీమేక్ అని అనుకుంటున్నారు. కానీ అసలు ఈ రెండు సినిమాలకు సంబంధమేంటి?' అని హోస్ట్ ప్రశ్నించారు. తాను రీమేక్ సినిమా చేస్తే దాన్ని దాచి పెట్టే అవసరం లేదని కూడా స్పష్టం చేశారు.

'నేను ఓపెన్‌గా చెబుతున్నా.. ఒకవేళ రీమేక్ చేస్తే టైటిల్స్‌ లోనే మాటలు, మార్పులు, దర్శకత్వం హరీష్ శంకర్ అని వేస్తాం. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలో మాత్రం కథ, మాటలు, దర్శకత్వం అన్న క్రెడిట్ పెట్టుకున్నాం. అప్పుడు అర్థం చేసుకోవాలి కదా' అని చెప్పారు. సినిమా నుంచి ఇప్పటికే ఒక పాట విడుదలైందని, టీజర్ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చిందని హరీష్ శంకర్ గుర్తు చేశారు.

త్వరలో ట్రైలర్ కూడా విడుదల కానుందని తెలిపారు. 'ఒక పాట వచ్చింది, టీజర్ చూశారు. ఇంకో రెండు రోజుల్లో ట్రైలర్ వస్తుంది. ఇప్పటివరకు చూసిన వాటిలో ఎక్కడైనా మీకు తెరి కథ గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో వస్తున్న ట్రోలింగ్‌ పై స్పందించారు. 'సుమారు మూడు లక్షల అరవై వేల ట్వీట్లు నాపై ట్రోలింగ్ చేస్తూ వచ్చాయి. నేను కాదు అని చెబుతున్నా కూడా కొందరు నెగిటివ్‌ గా మాట్లాడుతున్నారు' అని తెలిపారు.

'అయినా నాకు పూర్తి నమ్మకం ఉంది. సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులు చూసి నిర్ణయం తీసుకుంటారు' అని అన్నారు. తాను ప్రతి ఒక్కరికీ వెళ్లి వివరణ ఇవ్వడం సాధ్యం కాదని హరీష్ శంకర్ పేర్కొన్నారు. 'ఇంటింటికీ వెళ్లి బొట్టు పెట్టి ఈ సినిమా తెరి రీమేక్ కాదని చెప్పలేను కదా. ఎవరు ఎలా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. సినిమా చూసిన తర్వాత అసలు విషయం తెలుస్తుంది' అని తెలిపారు.

అలాగే గతంలో తాను తెరకెక్కించిన గబ్బర్ సింగ్ ను ఆయన ప్రస్తావించారు. 'నాకు మరో గబ్బర్ సింగ్ లాంటి సినిమా ఇవ్వమని చెబుతున్నారు. కానీ రీమేక్ చేయొద్దంటున్నారు. గబ్బర్ సింగ్ కూడా రీమేక్ కదా. అయినా మేము తెరి రీమేక్ చేయాలనే ఆలోచన మాత్రం ఎప్పుడూ పెట్టుకోలేదు' అని అన్నారు. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల తర్వాత అయినా రీమేక్ రూమర్లకు కంప్లీట్ గా తెరపడుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. మరేం జరుగుతుందో చూడాలి.