పెద్ద హీరో సినిమా గుట్టుగా కానిచ్చేస్తున్నారు!
టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ప్రస్తుతం 'ఉస్తాద్ భగత్ సింగ్' లాంటి భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
By: Sivaji Kontham | 7 Aug 2025 9:43 AM ISTటాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ప్రస్తుతం `ఉస్తాద్ భగత్ సింగ్` లాంటి భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఇది తెరకెక్కుతోంది. ఈ సినిమాపై కార్మికుల సమ్మె ప్రభావం ఎంత? అంటే.. తాజాగా నిర్మాతల్లో ఒకరైన నవీన్ ఎర్నేని జవాబిచ్చారు. చిత్రకథానాయకుడు పవన్ కల్యాణ్ పై వారం పాటు షూటింగ్ పెండింగ్ ఉంది. మరో 25 రోజుల పాటు ఇతర షెడ్యూల్ చిత్రీకరణలను పూర్తి చేయాల్సి ఉంటుందని చెప్పారు. దీనిని బట్టి టాకీ మరో నెలరోజుల్లో పూర్తవుతుంది. తదుపరి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తవుతాయి.
వేతన పెంపునకు ససేమిరా..
అయితే కార్మికుల మెరుపు సమ్మె ప్రభావం ఇండస్ట్రీపై తీవ్రంగానే ఉంది. వేతన సవరణకు, 30 శాతం పెంపునకు నిర్మాతలమండలి- ఫిలింఛాంబర్ వర్గాలు అంగీకరించడం లేదు. ఫెడరేషన్ అనుబంధ అసోసియేషన్ లలో ఉన్న కార్మికుల స్థానంలో కొత్త ప్రతిభను తీసుకోవాల్సిందిగా నిర్మాతలకు ఫిలింఛాంబర్ సూచించింది. దీనికి లేబర్ కమీషన్ నుంచి అనుమతి ఉందని కూడా ఛాంబర్ తన లేఖలో ఉద్ఘాటించింది.
ఆ వార్తల్లో నిజం లేదు:
దీనికి మీరు సిద్ధమా? అని నవీన్ ఎర్నేనిని ప్రశ్నించగా, ఒకవేళ ఆ విధానం పని చేస్తుందని భావిస్తే అనుసరిస్తామని అన్నారు. వేతన సవరణ అంశం గురించి ప్రశ్నించగా, తాము దీనిపై వ్యాఖ్యానించలేమని అన్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ పై ఫెడరేషన్ ప్రతినిధులు దాడి చేసారు అని వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని నవీన్ ఎర్నేని మాటలను బట్టి అర్థమవుతోంది. ఒక కన్నడ సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడుతూ నవీన్ ఎర్నేని పై విషయాలను ప్రస్థావించారు.
నిర్మాతలు లబో దిబో...
కార్మికుల సమ్మె అంశంపై పలువురు నిర్మాతలు తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. సి.కళ్యాణ్ ఇంతకుముందు మాట్లాడుతూ ఇలాంటి మెరుపు సమ్మె నిర్మాతల మెడపై కత్తి పెట్టడం లాంటిదేనని అన్నారు. నిర్మాతలపై ఆధారపడి జీవిస్తూనే ఉపాధినిచ్చే వారికి అల్టిమేటం జారీ చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. మరోవైపు పీపుల్స్ మీడియా అధినేత విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. కార్మికుల వేతనాల పెంపును నిరసించారు. ఇప్పటికే కార్మికులకు సరిపడేంత భత్యాన్ని నిర్మాతలు చెల్లిస్తున్నారని, మలయాళ చిత్రసీమతో పోలిస్తే, టాలీవుడ్ లో అధిక వేతనాలు అందిస్తున్నారని కూడా అన్నారు. మలయాళంతో పోలిస్తే నాలుగు రెట్టు అధిక వ్యయం అవుతోందని నిర్మాతలు దీనిని అదుపు చేయలేకపోతున్నారని ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. పరిశ్రమలో కొత్త ప్రతిభను ప్రోత్సహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వైజయంతి మూవీస్ అధినేత అశ్వనిదత్ ఇంతకుముందు సోషల్ మీడియాల్లో అధికారికంగా ప్రకటించారు. నైపుణ్యం ఉన్న సాంకేతిక నిపుణులను తమ బ్యానర్ ఆహ్వానిస్తోందని పేర్కొన్నారు.
గుట్టుగా కానిచ్చేస్తున్నారు:
ప్రస్తుతానికి కార్మికుల సమ్మె కారణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొన్ని అగ్ర నిర్మాణ సంస్థలు వారితో బేరసారాలు సాగించి గుట్టుగా పనుల్ని పూర్తి చేస్తున్నాయని గుసగుస వినిపిస్తోంది. అయితే చిన్న సినిమాల నిర్మాణానికి ఇది ఏమేరకు అడ్డంకిగా మారిందో తెలియాల్సి ఉంది. మెగాస్టార్ చిరంజీవి చొరవ తీసుకుని ఈ సమస్యను పరిష్కరించాలని నిర్మాతలు కోరగా పరిస్థితి ఇలానే కొనసాగిస్తే, రెండు మూడు రోజుల్లోనే తాను దీనిలో జోక్యం చేసుకుంటానని ఆయన ప్రామిస్ చేసిన సంగతి తెలిసిందే.
