Begin typing your search above and press return to search.

ఉస్తాద్ ఎంట్రీ ఇవ్వాల్సిందేనా?

పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాలకు సాధారణంగా రిలీజ్ కు ముందే వ‌చ్చే హైప్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.

By:  Sravani Lakshmi Srungarapu   |   2 March 2026 11:57 AM IST
ఉస్తాద్ ఎంట్రీ ఇవ్వాల్సిందేనా?
X

పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాలకు సాధారణంగా రిలీజ్ కు ముందే వ‌చ్చే హైప్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన సినిమా అనగానే ఫ్యాన్స్ లో క‌లిగే జోష్, సోషల్ మీడియాలో కనిపించే హంగామా, ప్రీ-రిలీజ్ ఈవెంట్ల చుట్టూ నెలకొనే జోష్ ఇవ‌న్నీ క‌లిపి ఓ పండ‌గ వాతావర‌ణాన్ని క్రియేట్ చేస్తాయి. కానీ ఈసారి ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ విషయంలో ఆ స్థాయి బ‌జ్ ఇంకా కనిపించలేదనే చర్చ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

దేఖ్‌లేంగే సాలాకు మంచి రెస్పాన్స్

హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాపై ముందు మంచి అంచ‌నాలున్నాయి. త‌ర్వాత ఈ సినిమా పొలిటిక‌ల్ యాంగిల్ లో తెర‌కెక్కిందేమో అన్న ఆలోచ‌న‌తో హైప్ కాస్త త‌గ్గింది. మార్చి 26న ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఈ మూవీ నుంచి రెండు సాంగ్స్ రిలీజ్ అయిన‌ప్ప‌టికీ, వాటిలో ఫ‌స్ట్ సింగిల్ గా వ‌చ్చిన దేఖ్‌లేంగే సాలాకు ఆడియ‌న్స్ నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. రెండో పాట‌గా వ‌చ్చిన ఆరా ఆఫ్ ఉస్తాద్ మిక్డ్స్ రియాక్ష‌న్ తెచ్చుకుంది. మ‌రీ ముఖ్యంగా ఈ సాంగ్ రిలీజ‌య్యాక అందులో పొలిటికల్ ట‌చ్ ఉందనే డిస్క‌ష‌న్ సినిమా బ‌జ్ పై ప్ర‌భావం చూపింద‌ని ట్రేడ్ వ‌ర్గాలు భావిస్తున్నాయి.

ఎలాంటి పొలిటిక‌ల్ సెటైర్ లేదంటున్న డైరెక్ట‌ర్

ఈ నేప‌థ్యంలో డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ప‌లు ఇంట‌ర్వ్యూల్లో పాల్గొంటూ, ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ కేవ‌లం ఫుల్ లెంగ్త్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్టైన్మెంట్ మాత్ర‌మేన‌ని, ఈ సినిమాకు ఎటువంటి పొలిటిక‌ల్ ట‌చ్ కానీ, సినిమాలో ఎటువంటి పొలిటిక‌ల్ సెటైర్స్ కానీ లేవ‌ని క్లారిటీ ఇస్తున్న‌ప్ప‌టికీ, ఆయ‌న మాట‌లు ఫ్యాన్స్ లో ఉన్న డౌట్స్ ను పూర్తిగా తొల‌గించ‌లేక‌పోతున్నాయ‌నే అభిప్రాయం సోష‌ల్ మీడియాలో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

భారీ హైప్ తెచ్చుకున్న ఓజి

దీనికి ముందుగా ప‌వ‌న్ నుంచి వ‌చ్చిన ఆఖ‌రి మూవీ ఓజి రిలీజ్ కు ముందే ఎంతో హైప్ సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజైన ఓజి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరీర్లోనే భారీ క‌లెక్ష‌న్స్ సాధించిన సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. ఓజి సినిమా హైప్ తో పోలిస్తే ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ ఇప్ప‌టివ‌ర‌కు ఆ స్థాయి హైప్ ను అందుకోలేక‌పోయింద‌నేది స్ప‌ష్ట‌మ‌వుతోంది.

ప్రీ రిలీజ్ ఈవెంట్ పైనే ఆశ‌లు

ఇలాంటి ప‌రిస్థితుల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ లో ఎంత‌వ‌ర‌కు ఇన్వాల్వ్ అవుతార‌నేది కీల‌కంగా మారింది. గ‌తేడాది రిలీజైన హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు ప్ర‌మోష‌న్స్ లో ప‌వ‌న్ స్వ‌యంగా పాల్గొని, సినిమా రిలీజ్ కు గ‌ట్టిగా స‌పోర్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ టైమ్ లో ఆయ‌న ప్రెజెన్స్ సినిమాకు ఎక్స్‌ట్రా మైలేజ్ ను కూడా తీసుకొచ్చింది. ఇప్పుడు ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ ప్ర‌మోష‌న్స్ విష‌యంలో కూడా ఆఖ‌రి ద‌శ ప్ర‌మోష‌న్స్ లో పాల్గొన‌డానికి ప‌వ‌న్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. సినిమా రిలీజ్ కు ముందు గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వ‌హించే ప్లాన్ లో మేక‌ర్స్ ఉండ‌గా, ఆ ఈవెంట్ కు ప‌వ‌న్ హాజ‌రై సినిమా గురించి మాట్లాడాక ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ కు కొత్త ఊపు తీసుకొస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. మొత్తానికి ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ ప్ర‌స్తుతం హైప్, అంచ‌నాల మ‌ధ్య కీల‌క ద‌శ‌లో ఉంది. ఫ్యాన్స్ లో మొద‌ట క‌నిపించ‌ని ఉత్సాహాన్ని ఆఖ‌రి ద‌శ‌లో స్టార్ ప‌వ‌ర్ తో ర‌గిలించ‌గ‌ల‌రా లేదా అనేది రానున్న రోజుల్లో తెలియ‌నుంది. దీంతో ఇప్పుడంద‌రి దృష్టి ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ పైనే నెల‌కొంది.