Begin typing your search above and press return to search.

ఊర్వ‌శి 70ల‌క్ష‌ల బంగారం బ్యాగ్.. విమానాశ్ర‌యంలో దొంగిలించింది ఎవ‌రు?

బాలీవుడ్ తో పాటు, టాలీవుడ్ కి సుప‌రిచిత‌మైన మోడ‌ల్ కం న‌టి ఊర్వశి రౌతేలా. ఈ బ్యూటీ కేన్స్ ఫిలింఫెస్టివ‌ల్ స‌హా ప‌లు అంత‌ర్జాత‌య వేదిక‌ల‌పై త‌న‌ను తాను ఆవిష్క‌రించుకుంది.

By:  Sivaji Kontham   |   1 Aug 2025 10:49 AM IST
ఊర్వ‌శి 70ల‌క్ష‌ల బంగారం బ్యాగ్.. విమానాశ్ర‌యంలో దొంగిలించింది ఎవ‌రు?
X

బాలీవుడ్ తో పాటు, టాలీవుడ్ కి సుప‌రిచిత‌మైన మోడ‌ల్ కం న‌టి ఊర్వశి రౌతేలా. ఈ బ్యూటీ కేన్స్ ఫిలింఫెస్టివ‌ల్ స‌హా ప‌లు అంత‌ర్జాత‌య వేదిక‌ల‌పై త‌న‌ను తాను ఆవిష్క‌రించుకుంది. పెటా కార్య‌క‌ర్త‌గాను అంత‌ర్జాతీయ దృష్టిని ఆక‌ర్షించింది. దీనికి భిన్నంగా ఊర్వ‌శి వివాదాస్పద వైఖ‌రి కూడా త‌న గురించి చ‌ర్చించుకునేలా చేసింతి. ముఖ్యంగా ఈ పంజాబీ బ్యూటీ సోష‌ల్ మీడియా పోస్టులు నిరంత‌రం నెటిజ‌నుల‌కు ల‌క్ష్యంగా మారుతున్నాయి. ఈ బ్యూటీ తుమ్మినా ద‌గ్గినా దానిని ఇన్ స్టాలో పోస్ట్ చేసి ట్రోలింగ్ ని ఎదుర్కొంటోంది. కొన్నిసార్లు త‌న మాట తీరుపై మీమ్స్ ఫెస్ట్ పీక్స్ కి చేరుకుంటోంది. ఇంత‌కుముందు భార‌త ట్యాలెంటెడ్ క్రికెట‌ర్ పంథ్ త‌న కోసం హోట‌ల్ గ‌ది బ‌య‌ట కొన్ని గంట‌ల పాటు ఎదురు చూసాడ‌ని బ‌హిరంగంగా వ్యాఖ్యానించడం దుమారం రేపింది. ఆ త‌ర్వాత ఊర్వ‌శి రౌతేలా .. పంథ్ అభిమానుల‌కు సాఫ్ట్ టార్గెట్ గా మారింది. నిరంత‌రం ఊర్వ‌శిని హింసిస్తూ పంథ్ ఫ్యాన్స్ పోస్టులు పెట్ట‌డంతో అది కాస్తా ఎండ్ లెస్ ర‌చ్చగా మారింది. ఇటీవ‌ల బాల‌య్య‌తో `ద‌బిడి దిబిడి` సాంగ్‌లో ఊర్వ‌శి భంగిమ‌లు, అప‌రిమిత గ్లామ‌ర్ ట్రీట్ పైనా మీమ్ ఫెస్ట్ చ‌ర్చ‌గా మారిన సంగ‌తి తెలిసిందే.

గ్లోబ‌ల్ ఆర్టిస్టుగా దారుణ అనుభ‌వం:

ఇదిలా ఉంటే, ఇప్పుడు త‌న అంత‌ర్జాతీయ ప్ర‌యాణంలో ఒక పెద్ద అపశృతి గురించి ఊర్వ‌శి రౌతేలా వెల్ల‌డించింది. దాదాపు రూ. 70ల‌క్ష‌ల విలువ చేసే ఖ‌రీదైన జువెల‌రీతో ఉన్న‌ త‌న ల‌గ్జ‌రీ సూట్ కేస్ ను లండ‌న్ లోని గాట్విక్ విమానాశ్ర‌యంలో పోగొట్టుకున్నాన‌ని ఊర్వ‌శి వెల్ల‌డించింది. విమానాశ్రయం నుండి ఈ సూట్ కేస్‌ను ఎవ‌రో దొంగిలించార‌ని, వింబుల్డన్‌లో పాల్గొనడానికి వెళ్లిన త‌న‌కు ఈ దారుణ‌ అనుభ‌వం ఎదురైందని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. తన బ్యాగ్ లగేజ్ బెల్ట్ నుండి కనిపించలేదని, బ్యాగ్ కోసం చాలా సేపు ఎదురు చూసినా ఫ‌లితం లేక‌పోయింద‌ని తెలిపింది. అలాగే విమానాశ్ర‌య అధికారుల‌కు దొంగత‌నానికి గురైన‌ బ్యాగేజీ గురించి ఫిర్యాదు చేసినా ఎవ‌రూ ప‌ట్టించుకోలేద‌ని ఆవేద‌నను వ్య‌క్తం చేసింది. ప్లాటినం ఎమిరేట్స్ సభ్యురాలిగా వింబుల్డన్‌కు హాజరవుతున్న గ్లోబల్ ఆర్టిస్ట్‌గా ఈ అనుభ‌వం తీవ్రంగా నిరుత్సాహ‌ప‌రిచింద‌ని ఊర్వ‌శి పేర్కొంది.

అధికారులు ప‌ట్టించుకోలేదు:

``ఈ నిరుత్సాహం పోగొట్టుకున్న బ్యాగేజీ గురించి కాదు. విమానాశ్ర‌య భ‌ద్ర‌త వైఫ‌ల్యం గురించి.. ఇది నాకు జ‌ర‌గొచ్చు. లేదా ఇత‌ర ప్ర‌యాణీకుల‌కు కూడా ఇలాంటి అనుభ‌వాలు ఎదుర‌వ్వొచ్చు. ప్ర‌యాణీకుల జ‌వాబుదారీ త‌నం గురించి .. భ‌ద్ర‌త‌, గౌర‌వం గురించి ఆందోళ‌న చెందుతున్నాను. బ్యాగేజ్- టికెట్ ఉన్నా అధికారులు ప‌ట్టించుకోలేద‌``ని ఊర్వ‌శి ఆరోపించారు.

మేనేజ‌ర్ మోసం చేసారు:

ఇటీవ‌ల ఊర్వ‌శి త‌ల్లి కూడా మేనేజ‌ర్ వేదికా ప్ర‌కాష్ శెట్టి త‌మ వ‌స్తువుల‌ను దొంగిలించార‌ని ఫిర్యాదు చేసారు. 2015 నుంచి రెండేళ్లుగా త‌మ‌తో ప‌ని చేస్తున్న వేదిక త‌మవ‌ద్ద ఉన్న ఖ‌రీదైన‌ వ‌స్తువుల‌కు జ‌వాబుదారీగా ఉండేవార‌ని, కానీ కాల‌క్ర‌మేణా అవి మాయ‌మ‌వుతున్న‌ట్టు గుర్తించామ‌ని కూడా ఊర్వ‌శి రౌతేలా త‌ల్లి ఆరోపించారు. చాలాసార్లు దొంగ‌త‌నాలు జ‌రిగాయి. మోసం చేసింద‌ని మేనేజ‌ర్ వేదిక‌ను దూషించారు. త‌మ‌తో 24/7 ఉండే అసిస్టెంట్ కావ‌డంతో న‌మ్మాము. 2016లో ఊర్వ‌శి మిస్ యూనివ‌ర్శ్ అయ్యాక త‌న‌ను చూసుకునేందుకు వేదిక‌ను స‌హాయ‌కురాలిగా నియ‌మించుకున్నారు. ఊర్వశికి చెందిన‌ వార్డ్‌రోబ్, బరువైన గౌన్లు , వ్యక్తిగత వస్తువులు వంటి వాటిని త‌న‌కే అప్ప‌గించేవారు. కానీ త‌న దొంగ‌త‌నాలు, మోసం కార‌ణంగా ఆర్థికంగా చాలా న‌ష్ట‌పోయామ‌ని ఊర్వ‌శి రౌతేలా త‌ల్లి ఆరోపించారు.