Begin typing your search above and press return to search.

ఉపకార్ నుండి ధురంధర్ వరకు: బాలీవుడ్ దేశభక్తి ప్రయాణం!

భారతదేశం 80వ స్వాతంత్య్ర‌ దినోత్సవాన్ని జరుపుకున్న‌ తరుణంలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో దేశభక్తిని ప్రతిబింబించే కథాంశాలు ఎంతగా మారాయో ? గమనిస్తే ఎంతో ఆసక్తికరంగా అనిపిస్తుంది.

By:  Srikanth Kontham   |   15 Aug 2026 10:39 PM IST
ఉపకార్ నుండి ధురంధర్ వరకు: బాలీవుడ్ దేశభక్తి ప్రయాణం!
X

భారతదేశం 80వ స్వాతంత్య్ర‌ దినోత్సవాన్ని జరుపుకున్న‌ తరుణంలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో దేశభక్తిని ప్రతిబింబించే కథాంశాలు ఎంతగా మారాయో ? గమనిస్తే ఎంతో ఆసక్తికరంగా అనిపిస్తుంది. దశాబ్దాల క్రితం రిలీజ్ అయిన `ఉపకార్` వంటి చిత్రాల నుంచి నేటి `ధురంధర్` వరకు బాలీవుడ్ దేశభక్తి భావనలో వచ్చిన మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ఒకప్పుడు దేశభక్తిని త్యాగం, బాధ , రాజకీయ నిరసనగా చూసిన చిత్రాలు క్రమంగా గర్వం, విశ్వాసం , దేశ అభివృద్ధి వైపు అడుగులు వేయడం గమనార్హం.

మనోజ్ కుమార్ నటించిన `ఉపకార్` వంటి క్లాసిక్ చిత్రాలు స్వాతంత్య్ర‌నాంత‌రం భారతదేశంలో ఉన్న రైతుల కష్టాలను, సామాజిక ఇబ్బందులను , దేశం పట్ల ఉండాల్సిన బాధ్యతను ప్రధానంగా చూపించాయి. ఆ కాలంలో దేశభక్తి అంటే వ్యవస్థలో ఉన్న లోపాలను ప్రశ్నించడం, నిరసన తెలపడం, సామాజిక మార్పు కోసం పోరాడడం అని అర్థం. సినిమాటిక్ భాషలో చెప్పాలంటే? అప్పటి దేశభక్తి గీతాలు దేశం పడుతున్న కష్టాల గురించి ఆవేదనను వ్యక్తం చేసేవి.

కానీ కాలక్రమేణా ఈ ధోరణిలో మార్పు వచ్చింది. తొంభైల దశకం తర్వాత వచ్చిన `బోర్డర్`, `లగాన్` వంటి సినిమాలు దేశం పట్ల ఉండాల్సిన వీరోచిత భావాలను, చరిత్రపై గర్వాన్ని వ్యక్తం చేశాయి. దేశ సరిహద్దుల వద్ద సైనికుల త్యాగాలను, దేశ గౌరవాన్ని కాపాడడంలో భారతీయుల పట్టుదలను చూపించడం ద్వారా ప్రజల్లో జాతీయతను రగిల్చారు. ఆ దశలో దేశభక్తి అంటే కేవలం ఆవేదన కాదు. ధైర్యం , తెగింపు అనే భావన బలంగా నాటుకుంది.

ప్రస్తుత తరం చిత్రాల విషయానికి వస్తే `ధురంధర్` వంటి సినిమాలు స్వాతంత్య్రం అనంత‌రం వచ్చిన 80 ఏళ్ల తర్వాత భారతదేశం సాధించిన ప్రగతిని, శాస్త్ర సాంకేతిక రంగాలలో దేశం వెలుగుతున్న తీరును చూపిస్తున్నాయి. దేశభక్తి అంటే యుద్ధాలు ..త్యాగాలు మాత్రమే కాదు. ప్రపంచ వేదికపై భారత్ సాధిస్తున్న విజయాలను చూసి గర్వ పడటం. నేటి యువత ఆశయాలను, ఆధునిక భారత్ ఆత్మవిశ్వాసాన్ని ఈ చిత్రాలు ప్రతిబింబిస్తున్నాయి.

బాలీవుడ్ భాషలో దేశభక్తి ఇలా పరిణామం చెందడం వల్ల ప్రేక్షకులు తమను తాము మరింత శక్తివంతంగా చూసుకునే అవకాశం కలిగింది. ఒకప్పుడు వెనుకబడిన దేశంగా చూపబడిన భారతదేశం ఇప్పుడు గ్లోబల్ పవర్‌గా ఎదుగుతున్న తీరును దర్శకులు తెరపై అద్భుతంగా ఆవిష్కరిస్తున్నారు. ఈ మార్పు కథాంశాలకే పరిమితం కాకుండా సినిమా ప్రమోషన్ల విధానం, పాటలు, పాత్రల నిర్మాణంలోనూ స్పష్టంగా కనిపిస్తోంది.

`ఉపకార్` నుండి `ధురంధర్` వరకు బాలీవుడ్ చేసిన ఈ ప్రయాణం భారతదేశం వృద్ధి ప్రయాణానికి అద్దం పడుతోంది. దేశభక్తి అనేది భావోద్వేగం నుంచి జీవన శైలిగా, ఆత్మవిశ్వాసంగా మారడం భారతీయులకు గర్వ కారణం. రాబోయే కాలంలో వినూత్నమైన కోణాల్లో దేశభక్తిని చాటిచెప్పే సినిమాలు మరిన్ని వస్తాయని ప్రేక్ష‌కులు ఎంత‌గానో ఆశీస్తున్నారు.