స్టార్ ఎంట్రీతో.. 'జాంబీ రెడ్డి 2' రేంజ్ మారిపోయింది!
చెట్టుకు తలకిందులుగా వేలాడుతూ, చేతిలో భారీ ఆయుధంతో ఉపేంద్ర కనిపించిన ‘జాంబీ రెడ్డి 2’ పోస్టర్ ఒక్కసారిగా సినిమా రేంజ్ ను పెంచింది.
By: M Prashanth | 18 Sept 2026 12:36 PM ISTచెట్టుకు తలకిందులుగా వేలాడుతూ, చేతిలో భారీ ఆయుధంతో ఉపేంద్ర కనిపించిన ‘జాంబీ రెడ్డి 2’ పోస్టర్ ఒక్కసారిగా సినిమా రేంజ్ ను పెంచింది. ఆయన బర్త్‌డే సందర్భంగా ఈ లుక్‌ను బయటకు తీసుకొచ్చిన టీమ్, పాత్ర గురించి మాత్రం ఎక్కువగా చెప్పలేదు. కానీ మొదటి ‘జాంబీ రెడ్డి’లో లేని స్థాయిలో ఈసారి కాస్టింగ్‌ను పెంచుతున్నారనే విషయం మాత్రం ఇక్కడే కనిపిస్తోంది.
మొదటి భాగం వచ్చినప్పుడు తేజ సజ్జ ఇంకా హీరోగా తన మార్కెట్ పెంచుకుంటున్న దశలో ఉన్నాడు. ప్రశాంత్ వర్మ కూడా అప్పటికి పెద్ద బడ్జెట్ దర్శకుడు కాదు. ఆ సినిమా జానర్ కొత్తదనం, రాయలసీమ సెటప్‌తో పని చేసింది. తర్వాత ‘హనుమాన్’తో తేజ మార్కెట్ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు అదే హీరోతో సీక్వెల్ చేస్తున్నప్పుడు పాత స్థాయిలోనే సినిమా చేయకుండా ఉపేంద్రలాంటి నటుడిని కూడా తీసుకొచ్చారు.
ఉపేంద్రకు కన్నడలో ఉన్న ఇమేజ్ ఈ సినిమాకు అక్కడ అదనంగా ఉపయోగపడొచ్చు. అయితే ఆయనను కేవలం మార్కెట్ కోసం తీసుకున్నారా, లేక కథలోనే పెద్ద పాత్ర ఇచ్చారా అన్నది చూడాలి. నార్మల్ గా ఉపేంద్ర రెగ్యులర్ పాత్రలు చేయరు. చిన్న సినిమా అయినా సరే కంటెంట్ క్యారెక్టర్ నచ్చితేనే ఓకే చెబుతారు. పోస్టర్‌లో కనిపించిన గెటప్ చూస్తే మాత్రం నార్మల్ క్యామియోలా అనిపించడం లేదు. తేజ సజ్జతో ఆయన పాత్రకు ఎలాంటి కనెక్షన్ ఉంటుందన్నది తర్వాతి అప్డేట్‌లో తేలొచ్చు.
ఈసారి దర్శకుడు కూడా మారాడు. మొదటి భాగాన్ని ప్రశాంత్ వర్మ తెరకెక్కించగా, ‘జాంబీ రెడ్డి 2’ను సుపర్ణ్ ఎస్ వర్మ డైరెక్ట్ చేస్తున్నారు. ప్రశాంత్ వర్మ కథ, క్రియేటివ్ వైపు కొనసాగుతున్నారు. షనాయా కపూర్ కూడా సినిమాలో ఉంది. దీంతో మొదటి భాగంతో పోలిస్తే కాస్టింగ్, టెక్నికల్ టీమ్ రెండింటినీ పెద్ద స్థాయిలో సెట్ చేశారు. రిలీజ్ ప్లాన్ దగ్గర కూడా అదే మార్పు కనిపిస్తోంది. తెలుగు వరకు పరిమితం కాకుండా హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, నేపాలి, జపనీస్ భాషల్లో సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
‘హనుమాన్’ తర్వాత తేజకు వచ్చిన మార్కెట్‌ను ఉపయోగించుకుంటూనే, ఉపేంద్రతో కన్నడలో కూడా సినిమాకు మంచి ఓపెనింగ్ తీసుకురావాలనే ప్లాన్ కనిపిస్తోంది. ఇక రిలీజ్ డేట్‌ను మాత్రం టీమ్ ఇంకా ఫిక్స్ చేయలేదు. 2027లో సినిమాను తీసుకురావాలని టార్గెట్ అయితే ఫిక్స్ అయ్యింది. ఇప్పుడు ఉపేంద్ర లుక్ బయటకు రావడంతో నెక్స్ట్ రాబోయే అప్డేట్స్ పై మరింత ఫోకస్ పెరిగే అవకాశం ఉంది. ఉపేంద్ర పాత్రకు సంబంధించిన గ్లింప్స్ లేదా తేజతో కాంబినేషన్ పోస్టర్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
