ఇంటర్వెల్ లో రామ్ విశ్వరూపం: ఉపేంద్ర
ఈ సినిమా రామ్ కెరీర్ లోనే గ్రేటెస్ట్ మూమెంట్ గా నిలిచిపోతుందని ఉపేంద్ర చెప్పారు. ఇక తన పాత్ర కూడా రియల్ లైఫ్ కు చాలా దగ్గరగా ఉంటుందట.
By: M Prashanth | 25 Nov 2025 11:50 PM ISTఉస్తాద్ రామ్ పోతినేని సినిమా అంటేనే ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్. కానీ ఈసారి రామ్ కేవలం ఎనర్జీనే కాదు, అంతకుమించి ఏదో చూపించబోతున్నాడట. విడుదలకు సిద్ధంగా ఉన్న 'ఆంధ్ర కింగ్ తాలూకా' సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను ఇప్పుడు పీక్స్ కు తీసుకెళ్లేల సీనియర్ స్టార్ హీరో ఉపేంద్ర చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఆయన మాటలు వింటుంటే ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ రావడం ఖాయం.
ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర ఒక కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సినిమా గురించి చాలా ఎమోషనల్ అయ్యారు. దర్శకుడు మహేశ్ బాబు పి కథ చెప్పినప్పుడు, తాను ఒక నటుడిగా కాకుండా సామాన్య ప్రేక్షకుడిలా విన్నానని చెప్పారు. ఆ కథలోని ఎమోషన్ తనకు వెంటనే కనెక్ట్ అయిపోయిందట. ప్రతి ఒక్కరి జీవితంలో ఉండే ఒక అందమైన భావోద్వేగాన్ని ఈ కథలో టచ్ చేశారని ఆయన చెప్పుకొచ్చారు.
ఇక రామ్ పోతినేని నటన గురించి ఉపేంద్ర చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ లో రామ్ నటన చూసి తాను షాక్ అయ్యానని అన్నారు. ఆ ఒక్క సీన్ లోనే రామ్ తన నట విశ్వరూపాన్ని చూపించాడని, ఎక్స్ట్రార్డినరీగా పర్ఫార్మ్ చేశాడని ఆకాశానికెత్తేశారు. ఒక స్టార్ హీరో నుంచి అంతటి హార్ట్ టచింగ్ పర్ఫార్మెన్స్ చూసి తాను ఎంతో ఎగ్జైట్ అయ్యానని ఉపేంద్ర మనసులో మాట బయటపెట్టారు.
ఈ సినిమా రామ్ కెరీర్ లోనే గ్రేటెస్ట్ మూమెంట్ గా నిలిచిపోతుందని ఉపేంద్ర చెప్పారు. ఇక తన పాత్ర కూడా రియల్ లైఫ్ కు చాలా దగ్గరగా ఉంటుందట. ఒక స్టార్ లైఫ్ లో ఉండే ఎత్తుపల్లాలు, ఎమోషన్స్ అన్నీ తన పాత్రలో కనిపిస్తాయని తెలిపారు. కేవలం కమర్షియల్ హంగులే కాకుండా, గుండెను తాకే బరువైన ఎమోషన్ ఈ సినిమాలో ఉందని ఆయన మాటలను బట్టి స్పష్టంగా అర్థమవుతోంది.
ఇంత మంచి సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దినందుకు దర్శకుడు మహేశ్ బాబుకు, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలకు ఉపేంద్ర ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అన్నీ కుదిరిన ప్రాజెక్ట్ ఇదని, అవుట్ పుట్ చాలా బాగా వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. ఇందులో రామ్ కు జోడీగా 'మిస్టర్ బచ్చన్' ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. ఆమె పాత్ర కూడా కథలో చాలా కీలకంగా ఉండబోతోందని సమాచారం.
ఇక ఉపేంద్ర ఇచ్చిన ఈ రివ్యూతో 'ఆంధ్ర కింగ్ తాలూకా' పై హైప్ డబుల్ అయింది. రామ్ ను ఇంతకుముందెన్నడూ చూడని కొత్త కోణంలో చూడబోతున్నామని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
