కన్నడ హీరో ఉపేంద్ర దంపతుల ఫోన్లు హ్యాక్.. దయచేసి స్పందించకండి అంటూ రిక్వెస్ట్!
సైబర్ నేరగాళ్లు ఎంతలా మోసాలకు పాల్పడుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
By: Madhu Reddy | 15 Sept 2025 4:00 PM ISTసైబర్ నేరగాళ్లు ఎంతలా మోసాలకు పాల్పడుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భిన్నవిభిన్నమైన మార్గాలను వెతుక్కుంటూ సామాన్యులనే కాదు సెలబ్రిటీలను కూడా బురిడీ కొట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏకంగా కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర.. ఆయన భార్య ప్రియాంకల ఫోన్ లను హ్యాక్ చేశారు. దీంతో అప్రమత్తమైన జంట వెంటనే సోషల్ మీడియా ద్వారా ప్రజలకు అవేర్నెస్ కల్పిస్తూ పోలీసులను ఆశ్రయించడం జరిగింది.. ఈ మేరకు ఉపేంద్ర సోషల్ మీడియా ఖాతా ద్వారా ఒక వీడియో షేర్ చేస్తూ దయచేసి వాటికి స్పందించకండి అంటూ రిక్వెస్ట్ చేశారు.
అసలు విషయంలోకి వెళితే.. కన్నడ స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్న ఉపేంద్ర దంపతుల ఫోన్ లను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు.. ఈ మేరకు ఉపేంద్ర మాట్లాడుతూ.." నా భార్య ప్రియాంక ఆర్డర్ చేసిన వస్తువుకి సంబంధించి సోమవారం ఉదయం ఒక ఫోన్ కాల్ వచ్చింది. కొన్ని హ్యాష్ ట్యాగ్, నంబర్లు ఎంటర్ చేస్తే డెలివరీ అవుతుందని చెప్పారట. వెంటనే ఫోన్ హ్యాక్ అయింది. ఆ తర్వాత కొంతసేపటికి నా ఫోన్ కూడా హ్యాక్ చేశారు. డబ్బు కోరుతూ మా ఫోన్ నెంబర్లు, సోషల్ మీడియా ఖాతాల నుంచి మెసేజ్లు పంపించారు. ముఖ్యంగా ప్రియాంక నంబర్ నుంచి ఫోన్ చేసి రూ.22,000 పంపాలి అని, కొన్ని గంటల్లో తిరిగి ఇస్తామని తెలిసిన వాళ్లకు ప్రియాంక మెసేజ్ పెట్టినట్టు మెసేజ్లు పెట్టారు.
దయచేసి మా ఫోన్ నెంబర్ నుండి కానీ సోషల్ మీడియా ఖాతాల నుండి కానీ ఏదైనా ఫోన్ కాల్స్ లేదా మెసేజ్ లు వస్తే స్పందించకండి ..ఎవరైనా డబ్బు అడిగితే పంపించకండి. ఈ ఘటనపై మేము పోలీసులకు ఫిర్యాదు చేస్తాము. సైబర్ నేరగాల పట్ల మరింత అప్రమత్తంగా ఉండండి" అంటూ విజ్ఞప్తి చేశారు ఉపేంద్ర. ప్రస్తుతం ఉపేంద్ర చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఇకపోతే ఉపేంద్ర తో పాటు ఉపేంద్ర భార్య ప్రియాంక కూడా అవేర్నెస్ వీడియో రిలీజ్ చేశారు. ఆమె సన్నిహితులు, కుటుంబ సభ్యులు, ప్రజలు సహోద్యోగులకు హెచ్చరిక అంటూ ఆ వీడియోని పంచుకున్నారు. ఆమె ఆ వీడియోలో మాట్లాడుతూ.. "కొంతమంది హ్యాకర్స్ మా మొబైల్స్ హ్యాక్ చేశారు. ఎవరైనా సరే నా తరఫు నుండి కాల్ చేసినా.. లేదా సోషల్ మీడియా ఖాతాల ద్వారా మెసేజ్ చేసినా స్పందించకండి. ఇప్పటికే కొన్ని యూపీఐ ల ద్వారా కొంతమంది నా పేరు చెప్పడంతో డబ్బులు పంపించారు.. దయచేసి ఇకపై అలా చేయకండి "అంటూ ప్రియాంక చెప్పుకొచ్చింది. మొత్తానికైతే ఈ జంటకు సంబంధించిన ఫోన్స్ ఇప్పుడు హాక్ అయ్యాయి అని తెలిసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
