వంగా మెచ్చిన వాయిస్ అంతటి బిజీ ఆర్టిస్టును చేసింది!
ఉపేంద్ర లిమాయే తెలుగు పరిశ్రమలో వరుస చిత్రాలు చేయడానికి ప్రధాన కారణం సంచలనాత్మక చిత్రం `యానిమల్` అని ఎంతో నిజాయితీగా తెలిపారు.
By: Sivaji Kontham | 4 Oct 2026 10:17 AM ISTప్రముఖ నటుడు ఉపేంద్ర లిమాయే పరిచయం అవసరం లేదు. ఒక ప్రత్యేకమైన గంభీరమైన గొంతు.. అద్భుతమైన కామెడీ టైమింగ్ తో సౌత్ - నార్త్ లో హృదయాలను గెలుచు కుంటున్నాడు. సందీప్ వంగా `యానిమల్` మొదలు వరుసగా తెలుగు చిత్రాల్లో అద్భుత నట ప్రదర్శనతో ఆకట్టు కుంటున్నారు. అనీల్ రావిపూడి `సంక్రాంతికి వస్తున్నాం` చిత్రంలోను అద్భుత ప్రదర్శనతో మెప్పించారు. తాను తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టడానికి గల కారణాలను, తన అద్భుతమైన అనుభవాలను లిమాయే ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. బాలీవుడ్‌తో పాటు పలు భాషల్లో నటించిన ఆయన తెలుగు ఇండస్ట్రీలో వరుస చిత్రాల్లో నటించడం వెనుక ఉన్న ఆసక్తికర విశేషాలను వెల్లడించారు.
ఉపేంద్ర లిమాయే తెలుగు పరిశ్రమలో వరుస చిత్రాలు చేయడానికి ప్రధాన కారణం సంచలనాత్మక చిత్రం `యానిమల్` అని ఎంతో నిజాయితీగా తెలిపారు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు తన వాయిస్ అంటే చాలా ఇష్టమని.. అందుకే ఆ చిత్రంలో తెలుగు డబ్బింగ్ చెప్పే సమయంలో తన సొంత గొంతు కావాలని ఆయన ప్రత్యేకంగా కోరారని గుర్తు చేసుకున్నారు.
సందీప్ రెడ్డి వంగా స్వయంగా ఒక ట్యూటర్ - టీచర్‌లా ఉండి దగ్గరుండి మరీ డైలాగ్స్ చెప్పించారని ఉపేంద్ర తెలిపారు. సౌత్‌లో నటించమని..ఇక్కడి దర్శకులు, నిర్మాతలు చాలా మంచి ప్రతిభావంతులు అని సందీప్ చెప్పారని.. అలా తన కెరీర్ మొదలైందని సంతోషంగా చెప్పారు. ఆ విధంగా `యానిమల్`, `సంక్రాంతికి వస్తున్నాం` వంటి చిత్రాల ద్వారా ఆయన తెలుగు ఆడియన్స్‌కు పరిచయం అయ్యారు.
`యానిమల్` చిత్రంలో ఆయన చెప్పిన డైలాగ్స్, ముఖ్యంగా `పీల గొంతు` అనే పదం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిందని గుర్తు చేసుకున్నారు. ఈ పాత్ర తన కెరీర్‌కు ఎంతో మంచి పేరును తీసుకురావడమే కాకుండా.. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుందని తెలిపారు.
ఈ మొదటి విజయంతో తెలుగులో వరుస అవకాశాలు వచ్చాయని.. అనిల్ రవిపూడి దర్శకత్వంలో వచ్చిన `సంక్రాంతికి వస్తున్నాం` వంటి చిత్రాలలో కూడా నటించే అవకాశం లభించిందని తెలిపారు. అంతేకాకుండా `పెద్ది`, `రోమాంచకం` వంటి చిత్రాలలోనూ నటించానని పేర్కొంటూ, తెలుగు పరిశ్రమలో పనిచేయడం తనకు ఎంతో ఆసక్తికరంగా ఉందని.. అద్భుతమైన అనుభూతిని ఇచ్చిందని వెల్లడించారు.
