ఆడవారికి ఆడవారే శత్రువులా.. నిన్న ఉపాసన.. నేడు రాధిక ఆప్టే!
అయితే ఇప్పుడు ఇదే విషయంపై మరో నటి రాధిక ఆప్టే కూడా స్పందించడం గమనార్హం.
By: Madhu Reddy | 27 Oct 2026 12:00 AM IST"ఆడవారికి ఆడవారే" శత్రువులు అనే సామెత సందర్భాన్ని బట్టి బయటకు వస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఇలాంటి సామెతలు పెద్దవాళ్లు ఊరికే పెట్టలేదేమో అనే కామెంట్లు కూడా ఆయా పరిస్థితులను బట్టి చూస్తే వినిపిస్తూ ఉంటాయి. అయితే ప్రస్తుత సమాజంలో ఆడవారి మధ్య జరుగుతున్న సంఘర్షణలను ఎత్తి చూపుతూ.. నిన్న మెగా కోడలు ఉపాసన.. నేడు ప్రముఖ హీరోయిన్ రాధిక ఆప్టే చేసిన కామెంట్లను బట్టి చూస్తే నిజమేమో అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరి అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..
మీ ఎదుగుదల కోసం పక్క ఆడవాళ్లను తొక్కకండి - ఉపాసన
ప్రముఖ స్టార్ యాంకర్ సుమ గత కొంత కాలం గా ఫెస్టివల్ ఫర్ జాయిస్ పేరిట పేదవారికి పండగ వాతావరణాన్ని సృష్టిస్తూ.. ఆర్థికంగా అండగా నిలుస్తున్న విషయం తెలిసిందే.అయితే ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాదులో నిర్వహించిన "ఫెస్టివల్ ఫర్ జాయిస్" ఐదో వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఉపాసన మహిళల ఎదుగుదల, పరస్పర సహకారం అలాగే తమ విజయాల కోసం ఇతర మహిళలను తొక్కేయాలని చూసేవారి గురించి మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేసింది.
వ్యక్తిగత విజయం కంటే ఇతరుల పట్ల చూపించే గౌరవమే ముఖ్యం - ఉపాసన
ఉపాసన మాట్లాడుతూ.." ఒక మహిళ సాధించిన విజయానికి మరో మహిళా కన్నీళ్లు కారణం కాకూడదు.. కొందరు తమ స్వార్థం కోసం ఇతరులకు చేసే అన్యాయాలు అమాయకపు పిల్లల జీవితాలపై కూడా ప్రభావం చూపుతున్నాయి. మహిళలు తమ మధ్య ఉన్న విభేదాలను పక్కనపెట్టి ఒకరికొకరు అండగా నిలవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఆడవాళ్లే ఆడవాళ్లకు శత్రువులుగా మారుతున్నారు. దయచేసి అలాంటివన్నీ ఇకపై మానుకోండి. ఐక్యత ,పరస్పర గౌరవం చాలా ముఖ్యం. వ్యక్తిగత విజయాల కంటే కూడా మానవత్వం, ఇతరుల పట్ల చూపించే గౌరవమే ముఖ్యం" అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది. ఉపాసన చేసిన కామెంట్లను బట్టి చూస్తాం మహిళలు ఎదుటి మహిళ పట్ల ఎంతటి ఆధిపత్యాన్ని చలాయిస్తున్నారో ఆమె మాటల ద్వారా అర్థమయింది.
అయితే ఇప్పుడు ఇదే విషయంపై మరో నటి రాధిక ఆప్టే కూడా స్పందించడం గమనార్హం. బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న రాధిక ఆప్టే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఏదో ఒక విషయంపై స్పందిస్తూ ఉంటుంది. అలాంటి ఈమె ప్రముఖ సౌత్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ తో కలిసి చేస్తున్న వెబ్ సిరీస్ 'అక్క'. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్ వేదికగా అక్టోబర్ 30వ తేదీన స్ట్రీమింగ్ కాబోతున్న నేపథ్యంలో వరుస ప్రమోషనల్ కార్యక్రమాలు చేపట్టారు. ఈ ప్రమోషనల్ కార్యక్రమాలలో పాల్గొన్న రాధిక ఆప్టే ప్రస్తుత మహిళల ప్రవర్తన గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.
రాధిక ఆప్టే మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో మహిళలు మహిళలకే మద్దతు ఇవ్వరు. ముఖ్యంగా మనకు అండగా ఉంటారని అనుకున్న మహిళలు కూడా కొన్ని సందర్భాలలో మద్దతు ఇవ్వకపోవచ్చు. అయితే ఇప్పుడిప్పుడే మహిళల సంఖ్య సినిమా సెట్లలో పెరుగుతోంది. అందర్నీ ఒకేలా చూడడం కూడా మెరుగుపడుతోంది. దయచేసి ఆడవారు తోటి ఆడవాళ్లకు సహాయంగా నిలవడం నేర్చుకోండి. సమాజంలో సంతోషకరమైన , ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించేందుకు మన వంతు సహాయం చేద్దాం అంటూ తన అభిప్రాయంగా చెప్పుకొచ్చింది.
మొత్తానికైతే ఇండస్ట్రీలో ఆడవాళ్లు మగవాళ్ళ నుంచి క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వేళ.. ఇప్పుడు ఈ సెలబ్రిటీలు చేసిన వ్యాఖ్యలు కూడా అందర్నీ ఆలోచింపచేస్తున్నాయి. ఏది ఏమైనా మహిళలు ఒకరికొకరు తోడుగా ఉంటూ.. సమాజంలో బంధాలను మరింత పదిలం చెయ్యాలి అని పలువురు నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు .
