Begin typing your search above and press return to search.

తాత‌కు ఉపాస‌న గిఫ్ట్: 'అయోధ్య' శిల్పి త‌యారు చేసిన విగ్ర‌హం ప్ర‌త్యేక‌త‌?

అయోధ్యలోని రామమందిరంలో ప్రతిష్ఠించిన బాల రాముడి విగ్రహం ఎంతో విశిష్టమైనది. సుమారు 51 అంగుళాల ఎత్తుగల ఈ దివ్యమైన విగ్రహం ఐదేళ్ల బాలుడి రూపంలో కనువిందు చేస్తుంది.

By:  Sivaji Kontham   |   22 Sept 2026 9:29 AM IST
తాత‌కు ఉపాస‌న గిఫ్ట్: అయోధ్య శిల్పి త‌యారు చేసిన విగ్ర‌హం ప్ర‌త్యేక‌త‌?
X

మెగా కుటుంబంలో సనాతన ధర్మం- ఆధ్యాత్మిక‌త‌పై నిబద్ధత ఎలాంటిదో తెలిసిందే. మెగా కోడ‌లు ఉపాసన కొణిదెల ఇదే వార‌స‌త్వాన్ని ముందుకు తీసుకెళుతూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నారు. భ‌ర్త రామ్ చ‌ర‌ణ్ తో క‌లిసి ఉపాస‌న భ‌క్తి యాత్ర‌ల గురించి తెలిసిందే. మెగా కోడ‌లు తాజాగా మరో ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నారు. తాను చేపట్టిన సుందరకాండ పారాయణాన్ని విజయవంతంగా ముగించిన సందర్భంగా.. తన తాతగారైన అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకులు డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డికి ఒక అరుదైన శ్రీరాముడి విగ్రహాన్ని కానుకగా అందించారు. కుటుంబ సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ ఉపాస‌న‌ చేసిన ఈ పని ప్రస్తుతం సోషల్ మీడియాలో చ‌ర్చ‌గా మారింది.

ఈ ప్రత్యేకమైన శ్రీరాముడి విగ్రహాన్ని ఎవ‌రు తయారు చేసారు? అనే డిబేట్ కొన‌సాగుతోంది. అయితే దీనిని ఒక‌ సాధారణ శిల్పి తయారు చేయలేదు. అయోధ్యలోని దివ్యమైన రామమందిరంలో కొలువుదీరిన బాలరాముడి విగ్రహాన్ని అద్భుతంగా రూపొందించిన ప్రసిద్ధ శిల్పి అరుణ్ యోగిరాజ్ చేతుల మీదుగా దీనిని మలచడం విశేషం. అయోధ్య రామాలయ శిల్పితోనే స్వయంగా కస్టమ్-మేడ్‌గా ఈ విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేయించి తన తాతకు బహూకరించడం ద్వారా ఉపాసన ఈ కానుకను మరింత సార్థకం చేసుకున్నారు.

అయోధ్యలోని రామమందిరంలో ప్రతిష్ఠించిన బాల రాముడి విగ్రహం ఎంతో విశిష్టమైనది. సుమారు 51 అంగుళాల ఎత్తుగల ఈ దివ్యమైన విగ్రహం ఐదేళ్ల బాలుడి రూపంలో కనువిందు చేస్తుంది. నల్లని కృష్ణ శిలతో ఏకశిలపై అత్యంత సున్నితంగా మలిచిన‌ ఈ ప్రతిమలో రాముడి ముఖంలో చిరునవ్వు- అపారమైన దైవత్వం ఉట్టిపడతాయి. ఈ విగ్రహం చుట్టూ హిందూ పురాణాల ప్రకారం శ్రీమహావిష్యువు దశావతారాలు అత్యంత సూక్ష్మంగా చెక్కి ఉండగా.. కుడి పాదం కింద హనుమంతుడు, ఎడమ వైపు గరుడ భగవానుడి రూపాలు క‌లిగి ఉండ‌టం దీని ప్రత్యేకతను మరింత ఇనుమ‌డింప‌జేసాయి.

ఈ అద్భుతమైన బాల రాముడి విగ్రహాన్ని రూపొందించిన‌ ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ కర్ణాటకలోని మైసూర్‌కు చెందినవారు. ఈయనది ఐదు తరాల నుంచి శిల్పకళను కొనసాగిస్తున్న సుప్రసిద్ధ శిల్పుల కుటుంబం కాగా.. ఈయన తాత బావన్న శిల్పి జాతీయ అవార్డు గ్రహీత. మొదట ఎంబీఏ పూర్తి చేసి కార్పొరేట్ ఉద్యోగం చేసినా కానీ.. కళపై ఉన్న ఇష్టంతో శిల్పకళా రంగంలోకి అడుగుపెట్టిన అరుణ్ యోగిరాజ్.. అయోధ్య రాముడితో పాటు ఢిల్లీలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్, కేదార్‌నాథ్‌లోని ఆదిశంకరాచార్య విగ్రహాలను మలచి అఖండ ఖ్యాతిని ఘ‌డించారు.

ఉపాసన షేర్ చేసిన‌ ఈ ఆధ్యాత్మిక పోస్ట్‌కు సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి భారీ స్పందన లభించింది. ఆధునిక జీవనశైలిని పాటిస్తూనే సనాతన ధర్మాన్ని, సంప్రదాయాలను మెగా కోడ‌లు కాపాడుతున్న తీరు యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని అభిమానులు కొనియాడారు. మెగా కుటుంబ అభిమానులు ఆమెను ఎంతో ఆప్యాయంగా `వదిన` అంటూ ప్రశంసిస్తూ.. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవడానికి ఇలాంటి ఆధ్యాత్మిక ఆచారాలు ఎంతో దోహదపడతాయని అభిప్రాయపడ్డారు.