తెలంగాణ గవర్నమెంట్ లో ఉపాసనకు కొత్త బాధ్యత
తెలంగాణలో క్రీడా అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మరింత వేగవంతంగా పుంజుకున్నాయి.
By: M Prashanth | 4 Aug 2025 2:49 PM ISTతెలంగాణలో క్రీడా అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మరింత వేగవంతంగా పుంజుకున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన స్పోర్ట్స్ పాలసీ 2025 అమలుకు మరింత బలం చేకూరింది. ఈ క్రమంలో తెలంగాణ స్పోర్ట్స్ హబ్‌కి ప్రత్యేక బోర్డ్ ఆఫ్ గవర్నర్స్‌ను ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ బోర్డ్ వ్యవస్థాపనతో తెలంగాణలో క్రీడా రంగాన్ని నూతన దిశగా తీసుకెళ్లే ప్రయత్నం మొదలైంది.
హైదరాబాద్ లో ఇటీవల జరిగిన తొలి తెలంగాణ స్పోర్ట్స్ కాన్‌క్లేవ్ కార్యక్రమం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమైంది. ప్రభుత్వ అధికారులు, స్పోర్ట్స్ రంగ ప్రముఖులు, యువ క్రీడాకారులు, ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై విశేష ఉత్సాహాన్ని చూపించారు. ఇందులో భాగంగా, తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డ్‌కు సంబంధించిన అధికారిక వివరాలు ప్రకటించడం, స్పోర్ట్స్ అభివృద్ధికి కీలకమైన మార్గదర్శకాలపై చర్చలు జరగడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈసారి బోర్డ్ ఆఫ్ గవర్నర్స్‌లో అత్యంత ప్రాముఖ్యతను సొంతం చేసుకున్నారు ఉపాసన కామినేని కొణిదెల. అపోలో హాస్పిటల్స్ వైస్ ఛైర్‌పర్సన్‌గా, UR లైఫ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న ఉపాసన ఇప్పటికే ఆరోగ్యం, వెల్‌నెస్, యువత అభివృద్ధికి పాటుపడుతున్నారు. ఇప్పుడు తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డ్‌కు సహ ఛైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడా రంగ అభివృద్ధిలో అభ్యున్నత, సమగ్ర దృష్టిని ప్రతిబింబించేలా ఈ నియామకం ఉండటం విశేషం.
ఉపాసన లాంటి వారు బోర్డ్‌లో భాగమవడం వల్ల క్రీడాకారుల సంక్షేమం, స్పోర్ట్స్ ఎడ్యుకేషన్, సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ వంటి అంశాల్లో కొత్త దృక్పథాన్ని తెస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వారి అనుభవం, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన క్రీడల్లో అత్యంత అవసరమైన అంశాలుగా మారబోతున్నాయి. దీని వలన తెలంగాణ నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్‌లో స్పోర్ట్స్ ఎక్స్‌లెన్స్‌లో ముందుండే అవకాశం ఉంది.
ఈ బోర్డ్‌లో ప్రముఖ వ్యాపారవేత్తలు, స్పోర్ట్స్ సెలెబ్రిటీలు, అడ్మినిస్ట్రేటర్లు సభ్యులుగా ఉన్నారు. ప్రభుత్వ రంగంతో పాటు కార్పొరేట్ సంస్థలు, ప్రైవేటు భాగస్వామ్యానికి పెద్ద పీట వేసిన విధానం గమనించదగ్గది. ఈ పబ్లిక్ ప్రైవేట్ మోడల్ ద్వారా క్రీడా రంగంలో మెరుగైన మౌలిక వసతులు, శిక్షణ, విద్య, గ్యాస్‌రూట్ డెవలప్‌మెంట్ సాధించాలనే లక్ష్యం ఉంది. ఫండ్స్ పారదర్శక వినియోగం కోసం తెలంగాణ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ ఫండ్ (TSDF)ను బోర్డ్ పర్యవేక్షించనుంది.
