Begin typing your search above and press return to search.

రూ.8,600 కోట్లతో ఆసుప‌త్రుల నిర్మాణం.. ప్రాజెక్ట్ డైరెక్ట‌ర్‌గా మెగా కోడ‌లు!

ఆస్ప‌త్రిని సంద‌ర్శించే సామాన్యుల‌కు ఎలాంటి క‌న్ఫ్యూజ‌న్ లేకుండా స్ప‌ష్ఠ‌మైన డిజైన్ల రూప‌క‌ల్ప‌న‌కు ఉపాస‌న మార్గ‌ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు.

By:  Sivaji Kontham   |   24 Sept 2026 3:23 PM IST
రూ.8,600 కోట్లతో ఆసుప‌త్రుల నిర్మాణం.. ప్రాజెక్ట్ డైరెక్ట‌ర్‌గా మెగా కోడ‌లు!
X

భారతీయ వైద్య రంగంలో అగ్రగామిగా ఉన్న అపోలో హాస్పిటల్స్ దేశవ్యాప్తంగా తన వైద్య సేవలను మరింత విస్తరించేందుకు భారీ ప్రణాళికలను సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే సుమారు రూ. 8,600 కోట్ల భారీ అంచనా వ్యయంతో నూతన ఆసుపత్రుల నిర్మాణం.. ఇప్పటికే ఉన్న వైద్య వసతుల ఆధునికీకరణకు శ్రీకారం చుట్టింది. సామాన్య ప్రజలకు కూడా అత్యుత్తమ వైద్యం మరింత సులభంగా అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో ఈ బృహత్తర కార్యక్రమానికి అపోలో యాజమాన్యం రూపకల్పన చేసింది. ఆస్ప‌త్రిని సంద‌ర్శించే సామాన్యుల‌కు ఎలాంటి క‌న్ఫ్యూజ‌న్ లేకుండా స్ప‌ష్ఠ‌మైన డిజైన్ల రూప‌క‌ల్ప‌న‌కు ఉపాస‌న మార్గ‌ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు.




ఈ అతిపెద్ద విస్తరణ ప్రాజెక్టులకు సంబంధించి కీలకమైన ప్రాజెక్ట్‌ డైరెక్టర్ బాధ్యతలను ఉపాసన కొణిదెల చేప‌ట్టారు. ఈ బాధ్యతల్లో భాగంగా అపోలో నాయకత్వ బృందం, క్లినికల్ టీమ్స్.. ప్రాజెక్ట్ భాగస్వాములతో కలిసి దేశవ్యాప్తంగా కొత్త ఆసుపత్రుల రూపకల్పన, నిర్మాణ పనులను దగ్గరుండి పర్యవేక్షించనున్నారు. నిర్మాణ రంగంలో వస్తున్న అత్యాధునిక మార్పులను అపోలో ప్రాజెక్ట్‌లలో అమలు చేయడానికి ఉపాస‌న‌ తన వంతు కృషి చేయనున్నారు.

ముఖ్యంగా ఆసుపత్రికి వచ్చే రోగులకు, వారి కుటుంబ సభ్యులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రాజెక్ట్ డిజైనింగ్‌పై మెగా కోడ‌లు ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. ఆసుపత్రి లోపల స్పష్టమైన డిజైన్‌లు.. సులభంగా నావిగేట్ చేసుకునే మార్గాలు.. సమర్థవంతమైన క్లినికల్ స్పేస్‌లు ఉండేలా చూస్తారు. డిజైన్ దశ నుంచి ఆసుపత్రి ప్రారంభం అయ్యే వరకు ప్రతి ప్రక్రియలోనూ పకడ్బందీ డీపీఆర్ రిపోర్టులు, సమన్వయం ఉండేలా ఈ ప్రాజెక్ట్ ప్రణాళిక సాగనుంది.

ఈ భారీ విస్తరణ ప్రణాళికలో భాగంగా హైదరాబాద్, ఢిల్లీ ఎన్‌సీఆర్, చెన్నై, ముంబై, బెంగళూరుతో పాటు లక్నో, వారణాసి, ఇండోర్, గువహాటి, రాంచీ తదితర వృద్ధి చెందిన‌ పట్టణాల్లో కొత్త సదుపాయాలు రానున్నాయి. మొత్తం రూ. 8,600 కోట్ల ప్రాజెక్ట్ వ్యయంలో భాగంగా ఇప్పటికే ఉన్న ఆసుపత్రుల బ్రౌన్‌ఫీల్డ్ విస్తరణ కోసం సుమారు రూ. 1,565 కోట్లు కేటాయించారు. దీనివల్ల ప్రఖ్యాత నగరాలతో పాటు టైర్-2 నగరాల్లోనూ ప్రపంచ స్థాయి వైద్య సేవలు మరింత విస్తృతంగా అందుబాటులోకి వస్తాయి.

ఈ సందర్భంగా ఉపాసన కొణిదెల మాట్లాడుతూ.. తన తాతగారు డాక్టర్ ప్రతాప్ సిఆర్ రెడ్డి భారతదేశంలో ప్రతి ఒక్కరికీ ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణ అందించాలనే ఆశయంతో అపోలోను స్థాపించారని గుర్తుచేశారు. ఆ గొప్ప ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లడమే తన ప్రధాన బాధ్యత అని తెలిపారు. ఆసుపత్రి డిజైన్ అనేది మానవీయ కోణంతో ఉండాలని.. రోగులు ఏ గందరగోళానికి గురికాకుండా ఉండేలా తమ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటాయని ఉపాస‌న‌ స్పష్టం చేశారు.