నోరా ఫతేహిపై వ్యామోహం ఎంత పని చేసింది..!
అభిమానం హద్దు మీరితే దాని పర్యవసానం కూడా అంతే కఠోరంగా ఉంటుంది. అతడు బాహుబలి మనోహరి నోరా ఫతేహికి పిచ్చి అభిమాని.
By: Sivaji Kontham | 22 Aug 2025 9:53 AM ISTఅభిమానం హద్దు మీరితే దాని పర్యవసానం కూడా అంతే కఠోరంగా ఉంటుంది. అతడు బాహుబలి మనోహరి నోరా ఫతేహికి పిచ్చి అభిమాని. అతడి వ్యామోహం ఏ రేంజులో ఉంటుందంటే, భార్యను అచ్చం నోరాలా రెడీ అవ్వమని ఒత్తిడి చేస్తున్నాడు. ఫిజికల్ గా అద్భుత రూపలావణ్యంతో కనిపించాలని, దానికోసం రెగ్యులర్ గా మూడు గంటల పాటు జిమ్ లోనే సమయం గడపాలని అతడు ఫిక్స్ చేసాడు.
అయితే భర్త అలా ఫిక్స్ చేయడంతో భార్యామణి తీవ్రంగా మానసిక, శారీరక ఒత్తిడికి గురైంది. కానీ నోరా ఫతేహి అంత అందంగా మారేదెలా? అది ఎప్పటికీ సాధ్యం కానిది.. కానీ భర్త మాత్రం టార్చర్ కొనసాగించాడు. చివరికి అతడి ఉన్మాదంపై భార్య పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. తన భర్త తనను నోరా ఫతేహిలా మారాలని తనను హింసిస్తున్నాడని చివరికి ఈ మహిళ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. ఈ కేసు గురించి విచారించిన పోలీసులు అవాక్కయ్యారు. వివరాల్లోకి వెళితే..
ఉత్తర ప్రదేశ్- మురాద్‌నగర్‌కు చెందిన 26 ఏళ్ల మహిళ 28 ఏళ్ల ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌ను పెళ్లాడింది. తన భర్తకు బాలీవుడ్ పిచ్చి. హిందీ స్టార్లలా స్మార్ట్ గా ఉండాలని కోరుకుంటాడు. జిమ్ లో తీవ్రంగా శ్రమించాలని తన భార్యను ఒత్తిడి చేయడం ప్రారంభించాడు. వ్యాయామం మానేస్తే ఆరోజు ఫుడ్ కట్. అయితే ఇది ఆమెపై తీవ్ర మానసిక ఒత్తిడిని పెంచింది. చివరికి తన అత్తమామలు కూడా కొడుకునే సమర్థిస్తూ తనను హింసించారని ఆమె ఆరోపించింది. కోడలు నోరా ఫతేహిలా కనిపించాలని అత్తమామలు కోరుకున్నారు. పెళ్లి సమయంలో 75లక్షల వరకట్నం, స్కార్పియోను పెళ్లి కొడుక్కి అందజేసారు. కానీ ఇప్పుడు అతడి వల్ల వేధింపులకు గురవుతున్నానని ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది.
అయితే భర్త ఆకృత్యాలను నెటిజనులు తూర్పారబెడుతున్నారు. సినిమా స్టార్ లా భార్య ఉండాలనుకోవడం మూర్ఖత్వం. సెలబ్రిటీలు తమ అందచందాలను కాపాడుకోవడానికి ప్రత్యేకించి ట్రైనర్లు, డైటీషియన్లను నియమించుకుంటారు. దానికోసం చాలా డబ్బు ఖర్చు చేస్తారు. ఇది సామాన్యులకు సాధ్యం కానిది.. అని హితబోధ చేస్తున్నారు. నోరా ఫతేహిపై వ్యామోహం ఉంటే ఆమెనే పెళ్లాడాల్సింది... మరొక మహిళ జీవితాన్ని నాశనం చేయకూడదు! అని సూచిస్తున్నారు. ప్రేమ అనుబంధం స్థానంలో ఊహించని వ్యామోహాలు కాపురంలో కల్లోలానికి కారణమవుతున్నాయి. మారిన విలువలు బంధంలో సమస్యగా మారుతున్నాయి.
