Begin typing your search above and press return to search.

యూనిక్ స్టోరీ.. ఇప్పుడిదే మెయిన్ ఎలిమెంట్..

ప్రేక్షకుల ఆలోచనా విధానంలో వచ్చిన ఛేంజ్ టాలీవుడ్ పైనా స్పష్టంగా కనిపిస్తోంది. థియేటర్‌ కు వెళ్లాలంటే సినిమాలో ఏదో ఒక స్పెషాలిటీ ఉండాల్సిందేనని ఆడియన్స్ భావిస్తున్నారు.

By:  M Prashanth   |   4 July 2026 4:51 PM IST
యూనిక్ స్టోరీ.. ఇప్పుడిదే మెయిన్ ఎలిమెంట్..
X

ఒకప్పుడు సినిమా ఎలా ఉన్నా అభిమాన హీరో కోసమో, పాటల కోసమో, కామెడీ కోసమో టికెట్ తీసుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రేక్షకుల ఆలోచనా విధానంలో వచ్చిన ఛేంజ్ టాలీవుడ్ పైనా స్పష్టంగా కనిపిస్తోంది. థియేటర్‌ కు వెళ్లాలంటే సినిమాలో ఏదో ఒక స్పెషాలిటీ ఉండాల్సిందేనని ఆడియన్స్ భావిస్తున్నారు. ముఖ్యంగా కథలో కొత్తదనం ఇప్పుడు మెయిన్ ఎలిమెంట్‌ గా మారుతోంది.

ప్రస్తుతం ప్రేక్షకుల ముందుకు వారానికి ఎన్నో సినిమాలు వస్తున్నాయి. వాటితో పాటు ఓటీటీల్లోనూ భారీగా కంటెంట్ అందుబాటులో ఉంటోంది. ఇంట్లోనే కూర్చుని సినిమాలు, వెబ్ సిరీసులు చూసే అవకాశం ఉండటంతో ప్రతి కొత్త సినిమా కోసం థియేటర్‌ కు వెళ్లేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపించడం లేదు. తమ సమయం, డబ్బుకు తగ్గ అనుభూతిని ఇచ్చే సినిమాలను మాత్రమే ఎంపిక చేసుకుంటున్నారు. ఇక్కడే యూనిక్ స్టోరీ కీలకంగా మారుతోంది.

రెగ్యులర్ కథను కొత్తగా చూపించినా లేదా ఇప్పటివరకు చూడని పాయింట్‌ తో సినిమా తెరకెక్కించినా ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడుతోంది. ట్రైలర్, టీజర్ చూసినప్పుడే సినిమాలో కొత్తదనం ఉందనే ఫీలింగ్ కలిగితే థియేటర్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కథలో ప్రత్యేకత లేకపోతే ప్రేక్షకులను ఆకట్టుకోవడం కష్టంగా మారుతోంది. ముఖ్యంగా గతంతో పోలిస్తే ఇప్పుడు ప్రేక్షకులకు సినిమాలపై అవగాహన పెరిగింది.

వివిధ భాషలకు చెందిన చిత్రాలను ఓటీటీల ద్వారా చూస్తున్నారు. దీంతో ఒక కథను చూసిన వెంటనే అందులో కొత్తదనం ఎంతుంది? గతంలో వచ్చిన సినిమాలకు దగ్గరగా ఉందా? అనే విషయాలను గుర్తించగలుగుతున్నారు. అందుకే కథ విషయంలో మేకర్స్ మరింత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో యూనిక్ స్టోరీ ఒక్కటే ఉంటే సరిపోతుందా? అంటే అదీ కాదు. ఆ కథను ప్రేక్షకులకు ఆసక్తికరంగా చెప్పగలగాలి.

ప్రేక్షకుడికి ప్రత్యేకమైన అనుభూతిని అందించాలి. కథ, కథనం, విజువల్స్, మ్యూజిక్.. ఇలా అన్ని అంశాలు కలిసి సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాలి. అయితే వీటన్నింటికీ బేస్ మాత్రం కొత్తదనం ఉన్న కథే అనే అభిప్రాయం బలపడుతోంది. స్టార్ హీరోల సినిమాల విషయంలోనూ ఇదే పరిస్థితి. కేవలం హీరో క్రేజ్‌ తో భారీ ఓపెనింగ్స్ రావొచ్చు. కానీ సినిమా ఎక్కువ రోజులు థియేటర్లలో నిలబడాలంటే ప్రేక్షకులను ఆకట్టుకునే కంటెంట్ అవసరం. చిన్న సినిమాలకు కూడా యూనిక్ పాయింట్ ఉంటే ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంటోంది.

అలా ప్రేక్షకుల అభిరుచుల్లో వచ్చిన చేంజ్ కొత్త కథలు చెప్పాలనుకునే దర్శకులు, రైటర్లకు మంచి అవకాశంగా కూడా కనిపిస్తోంది. భారీ సెట్లు, స్టార్ కాస్ట్, పెద్ద బడ్జెట్‌ తో పాటు కథలో కొత్తదనం ఉంటేనే ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడే పరిస్థితి వచ్చింది. ఏదేమైనా సినీ ప్రియులు ఇప్పుడు సెలెక్టివ్‌ గా మారిపోయారు. అందుకే ప్రస్తుతం సినిమా విజయాన్ని నిర్ణయించే అంశాల్లో యూనిక్ స్టోరీ టాప్ ప్లేస్ లో ఉంది. ప్రేక్షకుడిని థియేటర్ వరకు తీసుకురావాలంటే.. మేకర్స్ ముందుగా వెతకాల్సింది కొత్త కథ కోసమే.