Begin typing your search above and press return to search.

రాజకీయ హోదాలోనూ సినిమా జ్ఞాపకాలు!

మలయాళ చిత్ర పరిశ్రమలో తనదైన నటనతో యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకుని రాజకీయ రంగ ప్రవేశం చేసిన సురేశ్ గోపి ప్రస్తుతం కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

By:  Srikanth Kontham   |   14 Aug 2026 1:31 PM IST
రాజకీయ హోదాలోనూ సినిమా జ్ఞాపకాలు!
X

మలయాళ చిత్ర పరిశ్రమలో తనదైన నటనతో యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకుని రాజకీయ రంగ ప్రవేశం చేసిన సురేశ్ గోపి ప్రస్తుతం కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే తాను ఎంతటి ఉన్నత పదవిలో ఉన్నా? సినిమా పరిశ్రమ ద్వారా త‌న‌కు లభించే కొన్ని ప్రత్యేక ఆదాయ మార్గాలను, ముఖ్యంగా షాపులు ,వాణిజ్య సంస్థల ప్రారంభోత్సవాల ద్వారా వచ్చే సంపాదనను ఎంతగానో మిస్ అవుతున్నట్లు సరదాగా పేర్కొన్నారు. ఆలప్పుళలోని ఓ ప్రైవేట్ సంస్థ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సురేశ్ గోపి ఈ వ్యాఖ్యలు చేశారు.

గతంలో తనను ఎన్నో వాణిజ్య ప్రకటనలు .. ప్రారంభోత్సవాల కోసం ఆహ్వానించేవారని, కానీ కొంతకాలంగా ఆ రకమైన ఆహ్వానాలు గణనీయంగా తగ్గిపోయాయని తెలిపారు. దీనివల్ల ఆ మార్గం ద్వారా వచ్చే ఆదాయం పూర్తిగా తగ్గిపోయిందని.. అయితే దీనిపై తనకు ఎలాంటి అసంతృప్తి లేదన్నారు. రాజకీయ జీవితం - మంత్రి పదవి తనకు గౌరవాన్ని తెచ్చిపెట్టినప్పటికీ నటుడిగా తాను అనుభవించిన మధుర జ్ఞాపకాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఒక రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా.. సాధారణ ప్రజలతో మమేకమయ్యే సినీ సెలబ్రిటీ హోదాను తాను ఇప్పటికీ ఆస్వాదిస్తానని ఆయన మాటల్లో స్పష్టమైంది.

ఈ ప్రారంభోత్సవ వేడుక తనకు మళ్లీ అలాంటి కార్యక్రమాలకు ఆహ్వానాలు అందేలా పునరారంభం కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. దైవిక నమ్మకాలపై తనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. తన జీవితంలో ఏది జరగాలని రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుందని పేర్కొన్నారు. ఒక మార్గం మూసుకుపోతే దేవుడు మరో మార్గాన్ని చూపుతాడని ప్రశాంతంగా స్పందించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్య‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మలయాళ చిత్రసీమలో ఓ వెలుగు వెలిగిన సురేశ్ గోపి రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత కూడా సినిమాలపై తనకున్న మమకారాన్ని పలు సందర్భాల్లో బయట పెడుతున్నారు. ప్రజా ప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే వీలు కుదిరినప్పుడల్లా నటనకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నారు. ప్రజల మధ్య ఉంటూనే తన కళాప్రయాణాన్ని కొనసాగించాలనే సురేష్ గోపీ తపన నిబద్ధతను చాటుతోంది. ఇక న‌టుడిగా సురేష్ గోపీ న‌టించిన కొన్నిసినిమాలు ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. కానీ ఇంకా ప్రేక్ష‌కుల ముంద‌కు రాలేదు. అవి ఇంకా పోస్ట్ ప్రొడక్ష‌న్ ద‌శ‌లో ఉన్నాయి.