అగ్లీ స్టోరీ సెట్ లో అవికా గోర్‌కు వింత అనుభవం!
టాలీవుడ్‌లో రాబోతున్న రొమాంటిక్ థ్రిల్లర్‌లలో ప్రత్యేక ఆసక్తి రేకెత్తిస్తున్న సినిమా అగ్లీ స్టోరీ.
By: Sravani Lakshmi Srungarapu | 6 May 2026 10:00 PM ISTటాలీవుడ్‌లో రాబోతున్న రొమాంటిక్ థ్రిల్లర్‌లలో ప్రత్యేక ఆసక్తి రేకెత్తిస్తున్న సినిమా అగ్లీ స్టోరీ. యంగ్ హీరో నందు ప్రధాన పాత్రలో నటిస్తుండగా, హీరోయిన్‌గా అవికా గోర్ నటిస్తున్నారు. ప్రణవ్ స్వరూప్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మే 22న రిలీజ్‌కు సిద్ధమవుతోంది. అయితే సినిమా కథ కంటే, తాజాగా అవికా గోర్ చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా తన కెరీర్‌లో తొలిసారి షూటింగ్ టైమ్ లో అసౌకర్యంగా ఫీల్ అయినట్లు చెప్పడం ఈ ప్రాజెక్ట్‌పై మరింత ఆసక్తిని పెంచింది.
టెలివిజన్‌లో బాలిక వధు లాంటి సీరియల్స్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అవికా, తెలుగు ప్రేక్షకులకు కూడా మంచి పరిచయం ఉన్న నటి. అయితే ఇప్పటివరకు చేసిన సినిమాల్లో ఎప్పుడూ ఇలాంటి అనుభవం ఎదురు కాలేదని, అగ్లీ స్టోరీలో మాత్రం కొన్ని సన్నివేశాలు తనను మానసికంగా ఇబ్బంది పెట్టాయని ఆమె స్పష్టం చేశారు. ముఖ్యంగా హీరో పాత్ర ప్రవర్తన, ఆ క్యారెక్టర్ లోని నెగెటివ్ షేడ్స్ తాను చూసే సమయంలోనే అసహనాన్ని కలిగించాయని చెప్పారు. సెట్లో ఉండగానే ఆ సీన్స్ నుంచి బయటకు రావాలనిపించిందని, తన కెరీర్‌లో అలా అనిపించడం మొదటి సారని చెప్పిన ఆమె వ్యాఖ్యలు ఈ సినిమాకి గట్టి హైప్ ను తెచ్చాయి.
అవికా వెల్లడించిన ఈ అసౌకర్య అనుభవం, సినిమా కథ ఎంత రియలిస్టిక్‌గా ఉంటుందనే దానిపై స్పష్టమైన సంకేతాలు ఇస్తోంది. ఒక పాత్రను ఆడియన్స్ ద్వేషించేలా తీర్చిదిద్దడం డైరెక్టర్ ప్రధాన ఉద్దేశమని ఆమె చెప్పడం గమనార్హం. అదే సమయంలో సినిమాలో నటించిన నందు యాక్టింగ్ పై కూడా ఆమె ప్రశంసలు కురిపించారు. ఆ క్యారెక్టర్ ను చూస్తే నిజంగా ద్వేషం కలుగుతుందని, అదే అతని యాక్టింగ్ బలమని అవికా గోర్ పేర్కొన్నారు. అంటే కథలోని ఎమోషనల్ డెప్త్ ఎంతగా ఉంటుందో అర్థమవుతోంది.
సినిమాలు కేవలం వినోదానికి మాత్రమే పరిమితం కాకుండా, సమాజానికి అద్దం పట్టేలా ఉండాలని అవికా అభిప్రాయపడటం ఈ ప్రాజెక్ట్‌కు మరో ప్రత్యేకతను తీసుకొచ్చింది. కొన్ని సినిమాలు చూడటానికి ఇబ్బందిగా అనిపించినా, ఇలాంటి కథలు అవసరమని, అవి మన చుట్టూ ఉన్న వాస్తవాలను గుర్తు చేస్తాయని ఆమె చెప్పడం గమనించాల్సిన అంశం. ఈ వ్యాఖ్యల ద్వారా అగ్లీ స్టోరీ కేవలం రొమాంటిక్ థ్రిల్లర్ కాకుండా, ఒక గట్టి సామాజిక కోణాన్ని కూడా స్పృశించే అవకాశం ఉందని తెలుస్తోంది.
డైరెక్టర్ ప్రణవ్ స్వరూప్‌పై కూడా అవికా పూర్తి నమ్మకాన్ని వ్యక్తం చేశారు. తొలి సినిమానే అయినప్పటికీ, ఆయన విజన్ చాలా క్లియర్‌గా ఉందని, తన యాక్టింగ్ ను కూడా మరింత మెరుగుపరచడంలో సహాయపడిందని తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌ను ఫ్యూచర్ లో తిరిగి చూసుకున్నప్పుడు గర్వంగా భావిస్తానని చెప్పడం, ఆమెకు ఈ సినిమా ఎంత స్పెషల్‌గా ఉందో తెలియజేస్తోంది. మొత్తంగా చూస్తే, ఒక హీరోయిన్ తన కెరీర్‌లో తొలిసారి సెట్లోనే అసౌకర్యంగా ఫీలయ్యేంతగా ప్రభావం చూపిన సినిమా అంటే ఆ సినిమాఎంత బలమైన కంటెంట్‌తో వస్తుందో అర్థమవుతోంది. అవికా గోర్ చేసిన ఈ నిజాయితీ గల వ్యాఖ్యలు సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేస్తున్నాయి. విడుదలకు ముందే ఇంత చర్చకు దారి తీసిన ఈ సినిమా, థియేటర్లలో ప్రేక్షకులను ఎలా ప్రభావితం చేస్తుందో చూడాలి.
