ఉదయ్ కిరణ్ బతికి ఉంటే పెద్ద స్టార్ అయ్యేవాడు.. అతను చేసిన తప్పదే!
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆర్పీ పట్నాయక్, ఉదయ్ కిరణ్ గురించి మాట్లాడారు. ప్రస్తుతం ఉదయ్ కిరణ్ బ్రతికి ఉంటే ఓటీటీ యుగంలో పెద్ద స్టార్ అయ్యేవాడు అనేది నా భావన అని ఆర్పీపేర్కొన్నారు.
By: Sravani Lakshmi Srungarapu | 22 March 2026 12:25 PM ISTటాలీవుడ్‌లో ఒకప్పుడు యంగ్ హీరోలలో సెన్సేషన్‌గా నిలిచిన ఉదయ్ కిరణ్ పేరు మళ్లీ చర్చల్లోకి వచ్చింది. అతని కెరీర్, క్రేజ్, అలాగే తర్వాత ఎదురైన పరిస్థితులపై ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. కెరీర్ ప్రారంభ దశలోనే వరుస విజయాలతో స్టార్‌డమ్‌ను అందుకున్న ఉదయ్ కిరణ్, తన నేచురల్ యాక్టింగ్ తో ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్‌ను సంపాదించిన ఆయన, తక్కువ కాలంలోనే టాలీవుడ్‌లో ప్రముఖ హీరోల సరసన నిలిచారు. అయితే, అదే వేగంతో వచ్చిన విజయాలు తరువాత నిలకడగా కొనసాగలేకపోవడం ఆయన కెరీర్‌లో కీలక మలుపుగా మారింది.
ఉదయ్ కిరణ్ కు భారీ ఫాలోయింగ్
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆర్పీ పట్నాయక్, ఉదయ్ కిరణ్ గురించి మాట్లాడారు. ప్రస్తుతం ఉదయ్ కిరణ్ బ్రతికి ఉంటే ఓటీటీ యుగంలో పెద్ద స్టార్ అయ్యేవాడు అనేది నా భావన అని ఆర్పీపేర్కొన్నారు. ఉదయ్ కిరణ్ కు ఉన్న యాక్టింగ్ టాలెంట్ తో పాటూ, ఆడియన్స్ తో కలిసిపోయే నైజాంతో పాటూ ఆయనకున్న అభిమానుల వల్ల నేటి డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లలో మరింత వెలుగొందేదని అభిప్రాయపడ్డారు.
లైఫ్ లో ఫెయిల్యూర్స్ సహజమని, పడిన బంతి ఎంత గట్టిగా కింద పడితే అంతే గట్టిగా పైకి లేస్తుందనే ఉదాహరణతో ఆయన ఒక కీలక సందేశాన్ని ఇచ్చారు. బంతి పైకి లేచేంత వరకు టైమ్ ఇవ్వాలి. ఆ టైమ్ ఇవ్వకపోతే అది కిందే ఉండిపోతుంది. ఉదయ్ కిరణ్ చేసిన తప్పు అదేనంటూ ఎమోషనల్ గా మాట్లాడారు. ఉదయ్ కిరణ్‌కు ఇండస్ట్రీలో ప్రముఖులైన తేజ, ఆర్పీ పట్నాయక్ వంటి అనుభవజ్ఞులతో సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ, జీవిత నిర్ణయాలు వ్యక్తిగతమని ఆయన స్పష్టం చేశారు. ఎలా ఉండాలి అని చెప్పే చనువు ఉండొచ్చు. కానీ వినాలా వద్దా అనేది వ్యక్తిగత నిర్ణయమని, ఆయన ఎదుర్కొన్న సమస్యలు, ఆ స్థితికి ఎందుకు చేరుకున్నారనేది ఉదయ్ కిరణ్ మాత్రమే చెప్పగలడని అన్నారు.
ఒక దశలో అగ్రస్థానంలో నిలిచిన హీరోగా ప్రారంభమైన ఉదయ్ కిరణ్ ప్రయాణం, తర్వాత అవకాశాలు తగ్గడంతో మలుపు తిరిగింది. అయినప్పటికీ, ఆయనకు ప్రేక్షకుల్లో ఉన్న ఆదరణ మాత్రం తగ్గలేదు. నేటికీ ఆయన సినిమాలు, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉన్నాయి. మొత్తంగా చూస్తే, వేగంగా ఎదిగి, అనుకోని పరిస్థితులతో వెనుకబడిన ఉదయ్ కిరణ్ కెరీర్ ఇప్పటికీ పరిశ్రమలో ఒక ఎమోషనల్ డిస్కషన్ గానే నిలుస్తుంది.
