చెల్లి-నేను నేలపైనే.. అమ్మ జీవితం కఠోరం: స్టార్ హీరోయిన్
మహిళలు ప్రపంచంలో తమ స్థానాన్ని కనుగొనడం గురించి, స్త్రీ అంటే ఏమిటో ఆమె ఏమి కావాలో అనే దాని మధ్య ఉన్న సంఘర్షణ గురించి పుస్తకాలు రాస్తున్నాను అని ట్వింకిల్ చెప్పింది.
By: Sivaji Kontham | 22 Aug 2025 9:41 AM ISTమేల్ డామినేటెడ్ ప్రపంచంలో స్త్రీ సాధికారత, స్త్రీల ఉన్నతి గురించి మాట్లాడే ప్రముఖులు కొద్దిమందే ఉన్నారు. అలాంటి ప్రముఖురాలు ట్వింకిల్ ఖన్నా. స్త్రీ సాధికారతపై వరుసగా పుస్తకాలు రచించే ఈ ప్రముఖ నటీమణి, ఇంతకుముందు తన కుటుంబ వ్యవహారాలపైనా పుస్తకం రాసి రిలీజ్ చేసారు. తన తల్లిదండ్రులు రాజేష్ ఖన్నా- డింపుల్ కపాడియా కాపురంలో కలతలు, బ్రేకప్ వ్యవహారాల గురించి నిజాయితీగా, బహిరంగంగా ట్వింకిల్ మాట్లాడుతుంది. తన తండ్రి కెరీర్ క్షీణత, కుటుంబ జీవితంలో కల్లోలం తమ ఆలోచనల్లో ఎలాంటి మార్పులు తెచ్చాయో, బ్రేకప్ తర్వాత తన తల్లి కుటుంబాన్ని ఒకటిగా ఎలా ఉంచగలిగిందో కూడా ట్వింకిల్ ప్రతిసారీ బహిరంగంగా మాట్లాడారు.
తల్లిదండ్రులు విడిపోయాక తాను తన సోదరి రింకీ అమ్మమ్మ ఇంటికి వెళ్లామని తెలిపారు. ``నా తల్లి - అత్త ఒకే మంచంపై పడుకునేవారు. రింకే - నేను నేలపై పడుకున్నాము`` అని తమ జీవితంలో క్లిష్టకాలం గురించి ట్వింకిల్ గుర్తు చేసుకుంది. 2018లో `పైజామాస్ ఆర్ ఫర్ గివింగ్` చిట్టి కథల పుస్తకావిష్కరణ సమయంలో ఈ విషయాలను ట్వింకిల్ మాట్లాడారు.
చిన్న వయసులో బ్రేకప్
మహిళలు ప్రపంచంలో తమ స్థానాన్ని కనుగొనడం గురించి, స్త్రీ అంటే ఏమిటో ఆమె ఏమి కావాలో అనే దాని మధ్య ఉన్న సంఘర్షణ గురించి పుస్తకాలు రాస్తున్నాను అని ట్వింకిల్ చెప్పింది. స్త్రీ బతకడానికి స్త్రీ ఎదగడానికి ఎవరి అవసరం లేదు. తనకు తానుగా స్వయంసమృద్ధిని సాధించాలనే తన బలమైన వ్యక్తిత్వాన్ని ట్వింకిల్ వేదికపై బయట పెట్టింది. తన తల్లి తమ కుటుంబాన్ని కలిపి ఉంచడంలో ప్రధాన పాత్ర పోషించిందని గుర్తు చేసుకుంది. డింపుల్ నటనలో తన కెరీర్ ని కొనసాగించారు. రేయింబవళ్లు శ్రమించి కుటుంబాన్ని పోషించారు. నటనలో కెరీర్ ముగించి, పూర్తిగా తన భర్త పిల్లలతో జీవితంలో సెటిలయ్యాక ట్వింకిల్ వరుసగా పుస్తకాలు రాస్తున్నారు. వాటిలో చాలా పుస్తకాలు బెస్ట్ సెల్లర్స్ గా నిలిచాయి. ట్వింకిల్ 8 సంవత్సరాల వయసులో తల్లిదండ్రులు విడిపోవడం తనను చాలా బాధించింది.
పుస్తకం సినిమాగా...
2015లో ట్వింకిల్ తన మొదటి నాన్-ఫిక్షన్ పుస్తకాన్ని విడుదల చేసింది. `మిసెస్ ఫన్నీబోన్స్` తో రచయితగా పాపులరయ్యారు. ట్వింకిల్ ఖన్నా రెండవ పుస్తకం `ది లెజెండ్ ఆఫ్ లక్ష్మీ ప్రసాద్`. చిన్న కథల సంకలనం.. అందులో ఒకటి సామాజిక వ్యవస్థాపకుడు అరుణాచలం మురుగానందం ఆధారంగా రూపొందించారు. ఇది R. బాల్కీ దర్శకత్వంలో అక్షయ్ కుమార్-నటించిన `ప్యాడ్ మ్యాన్`కి ప్రేరణగా మారింది. పైజామాస్ ఆర్ ఫర్గివింగ్, వెల్ కం టు ప్యారడైజ్ అనే పుస్తకాలను ట్వింకిల్ రచించారు.
టాలీవుడ్ ఆరంగేట్రం:
ట్వింకిల్ ఖన్నా టాలీవుడ్ లో విక్టరీ వెంకటేష్ సరసన `శీను` అనే చిత్రంలో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా ఆడింది. బాలీవుడ్ లో సుదీర్ఘ కెరీర్ ని సాగించిన తర్వాత స్టార్ హీరో అక్షయ్ కుమార్ ని ప్రేమించి పెళ్లాడింది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
