కుమార్తెను కొడుకులా ట్రీట్ చేసిన డాడ్!
వెండితెరపై కోట్లాది మందిని అలరించే స్టార్స్ వ్యక్తిగత జీవితంలో సాధారణ తల్లిదండ్రుల వలే పిల్లలపై అపార మైన ప్రేమానురాగాలను కురిపిస్తారు.
By: Srikanth Kontham | 22 Jun 2026 6:00 PM ISTవెండితెరపై కోట్లాది మందిని అలరించే స్టార్స్ వ్యక్తిగత జీవితంలో సాధారణ తల్లిదండ్రుల వలే పిల్లలపై అపార మైన ప్రేమానురాగాలను కురిపిస్తారు. భారతీయ సినిమా చరిత్రలో మొదటి సూపర్‌స్టార్ గా గుర్తింపు పొందిన రాజేష్ ఖన్నా- ఆయన కుమార్తె ట్వింకిల్ ఖన్నా మధ్య ఉన్న బంధం కూడా అలాంటిదే. తాజాగా ట్వింకిల్ తన తండ్రితో ఉన్న పాత జ్ఞాపకాలను..తనను పిలిచే భిన్నమైన విధానాన్ని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు.
సాధారణంగా మన సమాజంలో బాబా అనే పదాన్ని కుమారులను పిలవడానికి ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కానీ రాజేష్ ఖన్నా మాత్రం తన ముద్దుల కుమార్తె అయిన ట్వింకిల్‌ను (ఆమె అసలు పేరు టీనా కావడం వల్ల) ఎంతో ఆప్యాయంగా టీనా బాబా అని పిలుచుకునేవారు. ఈ పిలుపు వెనుక ఉన్న తండ్రి ప్రేమ, వాత్సల్యం తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనివని ట్వింకిల్ ఖన్నా పేర్కొన్నారు. ఈ వినూత్నమైన పిలుపు రాజేష్ ఖన్నా విలక్షణమైన వ్యక్తిత్వాన్ని .. ఆయనకు కుమార్తెపై ఉన్న అమితమైన ప్రేమను..నమ్మకాన్ని తెలియజేస్తుంది. కొడుకులకు ఇచ్చే ప్రాధాన్యతను.. కుమార్తెకు ఇవ్వడమే కాకుండా లింగ వివక్షతకు తావులేకుండా టీనాను వారసురాలిగా ఆయన చూశారని ఈ పిలుపు ద్వారా అర్థమవుతుంది.
తండ్రి అందించిన ప్రోత్సాహం, స్వేచ్ఛే తదనంతర కాలంలో ట్వింకిల్ ఖన్నా స్వతంత్ర ఆలోచనలు కలిగిన రచయిత్రిగా, నటిగా తనదైన ముద్ర వేయడానికి ఎంతో దోహదపడింది. దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్, స్టార్‌డమ్ ఉన్నా? ఇంట్లో మాత్రం రాజేష్ ఖన్నా సాధారణ ప్రేమగల తండ్రిగానే ఉండేవారని ట్వింకిల్ గుర్తుచేసుకున్నారు. ప్రపంచమంతా ఆయన్ని నటుడిగా ఆరాధిస్తే ఆమెకు మాత్రం ఆయన కేవలం తనను గారాబం చేసే నాన్న మాత్రమే. తండ్రీకూతుళ్ల మధ్య ఉండే ఈ అందమైన అనుబంధం రాజేష్ ఖన్నా మరణించిన ఇన్నేళ్ల తర్వాత కూడా ట్వింకిల్ హృయంలో అంతే పచ్చగా ఉందనడానికి ఈ తాజా జ్ఞాపకాలే నిదర్శనం.
కాలం గడుస్తున్నా కొద్ది దూరమైన తల్లిదండ్రుల జ్ఞాపకాలు విలువైనవిగా మారుతుంటాయి. పిలిచే పిలుపులు, గడిపిన చిన్న క్షణాలు జీవితాంతం మధురమైన నిధిలా మిగిలిపోతాయి. ట్వింకిల్ ఖన్నా షేర్ చేసిన ఈ భావోద్వేగపూరిత జ్ఞాపకాలు ఆమె వ్యక్తిగత జీవితానికే పరిమితం కాకుండా తల్లిదండ్రులను కోల్పోయి వారి ప్రేమను మిస్ అవుతున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలిస్తున్నాయి. వెండి తెరపై రాజేష్ ఖన్నా సృష్టించిన రికార్డులు.. క్రేజ్ చరిత్రలో ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి. కానీ కూతురి దృష్టిలో గొప్ప తండ్రిగా సంపాదించుకున్న స్థానం అంతకంటే ఉన్నతమైనది.
