Begin typing your search above and press return to search.

టెలివిజన్ రంగంలో వివాదాలు!

టెలివిజన్ రంగం నిరంతరం సరికొత్త కథనాలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. కానీ తెరవెనుక జరిగే వివాదాలు సమాజంలో అంత‌కు మించి పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తున్నాయి.

By:  Srikanth Kontham   |   4 Jun 2026 2:00 PM IST
టెలివిజన్ రంగంలో వివాదాలు!
X

టెలివిజన్ రంగం నిరంతరం సరికొత్త కథనాలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. కానీ తెరవెనుక జరిగే వివాదాలు సమాజంలో అంత‌కు మించి పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తున్నాయి. ప్రముఖ సీరియల్ `భాబీజీ ఘర్ పర్ హై` నిర్మాతలపై నటి శిల్పా షిండే చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు.. అటుపై చోటుచేసుకున్న పరిణామాలు బుల్లితెరపై తీవ్ర‌ కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో వీటిపై ప్రముఖ నటి హినా ఖాన్ స్పందించారు. తప్పుడు ఆరోపణలు చేయడం వల్ల సమాజంలో ఎలాంటి ప్రతికూల ప్రభావాలు ఉంటాయో? బహిరంగంగా వ్యక్తం చేయడం పరిశ్రమలో తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

శిల్పా షిండే సీరియల్ నిర్మాతపై చేసిన ఆరోపణలు ఒకానొక సమయంలో చట్టపరమైన, సామాజిక పరమైన చర్చలకు కేంద్రబిందువుగా మారాయి. మహిళా రక్షణకు సంబంధించిన చట్టాలను వృత్తిపరమైన విభేదాల కోసం ..వ్యక్తిగత కక్షల కోసం వాడుకోవడం సరైన పద్ధతి కాదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ ఉదంతాన్ని ప్రస్తావిస్తూ,` హినా ఖాన్ తోటి నటి వైఖరిని తప్పుపట్టడం, ప్రచారం కోసం చట్టాలను ఆయుధాలుగా మార్చు కోకూడదని సూచించడం విశేషం. ఒక మహిళ తనపై జరిగిన అన్యాయాన్ని ఎదిరించడానికి చట్టాన్ని ఆశ్రయించడం ఎంతో అవసరమని.. అయితే అదే చట్టాన్ని అబద్ధపు ఆరోపణల కోసం వాడితే అది సమాజానికి ఎంతో హాని చేస్తుందని హినా ఖాన్ అభిప్రాయపడ్డారు.

తప్పుడు కేసులు నమోదు చేయడం వల్ల భవిష్యత్తులో నిజంగానే వేధింపులకు గురై న్యాయం కోసం పోరాడే ఇతర మహిళల మాటలను సమాజం నమ్మే అవకాశం తగ్గుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు నిజమైన బాధితుల సుదీర్ఘ పోరాటాన్ని బలహీనపరుస్తాయని స్పష్టం చేశారు. చలనచిత్ర, టెలివిజన్ పరిశ్రమలలో నిర్మాతలు, నటీనటుల మధ్య వృత్తిపరమైన సంబంధాలు ఎంతో సున్నితమైనవి. విభేదాలు వచ్చినప్పుడు వాటిని చర్చల ద్వారా లేదా చట్టబద్ధమైన వేదికలపై పరిష్కరించుకోవాలి తప్ప నేరారోపణలను సులభంగా వాడటం వల్ల ఇండస్ట్రీ ప్రతిష్ట దెబ్బతింటుంది. హినా ఖాన్ చేసిన ఈ వ్యాఖ్యలు పరిశ్రమలోని పని వాతావరణంలో పరస్పర నమ్మకం, బాధ్యతాయుతమైన ప్రవర్తన ఎంత ముఖ్యమో అందరికీ గుర్తు చేస్తున్నాయి.

సెలబ్రిటీలుగా సమాజంలో కోట్లాది మందిపై ప్రభావం చూపే వ్యక్తులు మాట్లాడే ప్రతి మాట, తీసుకునే ప్రతి నిర్ణయం ఎంతో బాధ్యతాయుతంగా ఉండాలి. ఒక నటిగా తోటి నటి చేసిన తప్పుడు విధానాన్ని నిర్భయంగా ప్రశ్నించడం ద్వారా హినా ఖాన్ సామాజిక బాధ్యతను చాటుకున్నారని చాలామంది విశ్లేషకులు భావిస్తున్నారు. పరిశ్రమలో కేవలం గ్రూపు రాజకీయాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా నిజానిజాల వైపు నిలబడటం ఆరోగ్యకరమైన వాతావరణానికి సంకేతం.

టెలివిజన్ రంగంలో ఇలాంటి వివాదాలు రేటింగులు, వ్యక్తిగత ప్రతిష్టల చుట్టూ తిరగకుండా, వ్యవస్థాగత మార్పులకు దారితీయాలి. చట్టాలను రక్షణ కవచాలుగా వాడుకోవాలే తప్ప ఇతరులను వేధించే ఆయుధాలుగా మార్చకూడదనే సందేశం ఈ వివాదం ద్వారా స్పష్టమవుతోంది. భవిష్యత్తులో ఇండస్ట్రీలో మరింత పారదర్శకమైన, సురక్షితమైన పని వాతావరణం ఏర్పడటానికి ఇలాంటి బహిరంగ చర్చలు, నిజాయితీతో కూడిన అభిప్రాయాలు ఎంతో దోహదపడతాయి.